LOCAL WEATHER

9, ఆగస్టు 2013, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???

1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంద్ర రాష్ట్రం. కర్టేసి లింకు:[భద్రాచలంతో కలిపి]

1954 లో రాష్ట్రాల కమిషన్ వారు  ప్రతిపాదించిన రాష్ట్రాల మేప్.
కర్టేసి లింక్: http://missiontelangana.com/first-src-map-showing-telangana/

దేశంలో వేలకోట్ల రూపాయలు నగరాలకి తగలేసినా 
ఇప్పటికి ఉన్నది కేవలం 28 శాతం నగర ప్రజలే... 
వీరి  అవసరాల కోసం మిగిలిన 72శాతం ప్రజలని కొల్లగొడుతున్నారు.

రాజధాని గురించి మాట్లాడుతూ... మీడియా మేధావులు ... రాజధాని పెట్టాలంటే ... ఆంధ్రాలో ఎక్కడ పెట్టాలి...?    దానికి చాలా విశాలమైన ప్రాంతం కావాలనీ... పరిశ్రమలు అవీ పెట్టటానికి అనువైన ప్రదేశం ఉండాలనీ... దానికి ఎన్నో వేల/లక్షల ఎకరాల భూమి కావాలనీ... నీళ్ళు కూడా సమృద్ధిగా దొరకాలనీ... ఇలా ఒకటేమిటి... ఎవరికీ తోచినది వారు చెప్పేస్తున్నారు.... పరిశ్రమలకి...రాష్ట్ర పరిపాలనకి సంబంధం ఏమిటో ఈ తెలివిగల జ్ఞానులకే తెలియాలి....రాజధానిలో కావాలిసింది కేవలం పరిపాలనా భవనాలు మాత్రమే... దానికి సంబంధించిన ఉద్యోగులకి ఉండటానికి కాలనీలు ... ఇవి మాత్రం ఉంటే చాలు...

కాకపొతే, ఇప్పటికే  ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానులని ప్రతిపాదికగా తీసుకునీ... కేవలం రాష్ట్ర పరిపాలనకి సంబంధించినవే కాకుండా, అనవసరమైన అన్నిటినీ రాజదానివైపునకి ఆకర్షించి, రాజధాని అనగానే పెద్ద మెట్రోపాలిటన్‌లాగా తయారు చెయ్యటమే రాజధాని నిర్మాణం అని చాలా మంది అనుకుంటున్నారు. ఇలా అనుకోటానికి కారణం... స్వార్ధ రాజకీయ నాయకులే...  ముఖ్యమైన ప్రజావసరాలు తీర్చేవన్నితమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిలోనే పెట్టి, దానిని//దానికోసం అందరు కొట్టుకు చచ్చే ప్రాంతంగా తయారు చెయ్యటమే. దీని వలన రాజధాని తప్ప మిగలిన ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందటం కష్టంగా అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితులే దరిదాపుల అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి. ఈ విషయంలో ఏ రాష్ట్రానికి మినహాయింపు లేదు. 

అలా రాజధానులని అబివృద్దికి మూలంగా తయారుచెయ్యటం వలన, రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో "మనం పెరగాలంటే రాజధానికే పోవాలి" అనే భావన ఏర్పడిపోయింది. దానితో విపరీత రద్దీ పెరిగి, వారికి సౌకర్యాలని కలిపించే పనిలో ప్రభుత్వాలు పడినాయి. అలా రాజధాని అభివృద్ధికి కావాలిసిన సొమ్ములని, రాష్ట్ర ప్రజల మీద రుద్దేస్తున్నారు. దానితో ఆ రాష్ట్రం లోని మిగిలిన నగరాలు-పట్టణాలు కానీ, పల్లెలు కానీ తమ అభివృద్ధికి కావాలిసిన సొమ్ములని రాజధాని పాలు చెయ్యవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇలా జరిగిన కొద్దీ, రాష్ట్ర ప్రజల వలసలు రాజధాని వైపు మరింత ఎక్కువ సాగినాయి.  దీనివలన ప్రజల ప్రయాణ సౌకర్యాల కోసమే వేలకోట్లు ఖర్చు చెయ్యవలసి వస్తోంది.  ఉదాహరణకి హైదరాబాదులో జరుగుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు; అనేక ఊళ్ళకి సింగల్ లైను రహదార్లే లేవన్న సంగతి మరచి, దీని కోసం వేల కోట్ల రూపాయలు వ్యర్ధం చేస్తున్నారు. ఈ రకమైన పాపం అన్ని రాజధానులలోనూ జరుగుతోంది.

ఇలా ప్రజలందరినీ ఒకే చోటకి ఆకర్షించటం ఎందుకూ...? వారికి సౌకర్యాల కల్పించటానికి మిగిలిన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటం ఎందుకు...?? ప్రజలందరూ ఒకే చోట గుమికూడకుండా చెయ్యలేరా...??? ఎందుకు చెయ్యలేరు... చెయ్యగలరు. కానీ, దానికి స్వార్ధ రహితమైన రాజకీయ వ్యవస్థ అవసరం... దానితోబాటు కుళ్ళిపోయిన పాత రాజరిక వ్యవస్థ నిర్మాణాన్ని పట్టుకుని వెళాడటం మానాలి. ఎందుకంటే, పాతకాలంలో శత్రు భయం ఉండటం వలన రాజుగారు ఆయనకి సంభందించిన ఆస్థులని కాపాడుకోవటానికి ఒకే చోట పెట్టుకోటం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా... పైగా, ఈ రోజు సమాచార వ్యవస్థ కూడా ఆధునికరించబడి, అందరికి అతి చవుకగా అందుబాటులో ఉన్నది. అలాంటప్పుడు రాజధాని పేరుతొ ఒకే ప్రాంతంలో అభివృద్ధిని అలా పేర్చుకుంటూ పోవటం ఎందుకు...?? మిగిలిన ప్రాంతాలని ఎడారులుగా చెయ్యటం ఎందుకు...??? 

కాబట్టి, "రాజదాని అంటే అభివృద్దికి కేంద్రం... అనే మూఢనమ్మకం" నుండి బయటపడాలి. అభివృద్ధి వికేంద్రికరణ చెయ్యాలి. దీనివలన, ఎక్కువ ప్రాంతాలు బాగుపడతాయి. రాజధానికి వలసలు తగ్గుతాయి. అప్పుడు అనవసరమైన వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒకే చూట కుమ్మరించే దిక్కుమాలిన పరిస్థితి ఉండదు. ఆ డబ్బును రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగటంలేదో అక్కడ ఉపయోగించే అవకాశం ఉన్నది. సోషలిజం, కమ్యూనిజం అని మాట్లాడే మన నేతలు, ఆ భావాలు కేవలం మనుషుల కోసమే కాదు, ప్రాంతాలకి కూడా అన్వయించాలి....ఆ భావాలు మనుషుల మీద ఉపయోగిస్తే కోట్ల ఖర్చుకి వందలమందే బాగుపడతారు...కానీ, ఇదే భావం వెనుకబడిన ప్రాంతాల మీద ఉపయోగిస్తే, కోట్లు ఖర్చు పెడితే లక్షల మంది బాగుపడే అవకాశం ఉన్నది.


ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే...
84శాతం  ప్రజల  పొట్టలు కొట్టిన  వేల కోట్ల రూపాయల ఖర్చుకి.... 
నగరికరణ జరిగింది కేవలం 16 శాతమే...!!!

సరే, ఇక మన ఆంధ్రప్రదేశ్ గురించి వేరే ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. కేవలం రాజధాని వల్లనే విభజన జరగబోతోంది..... మళ్ళి ఆ రాజదానికోసమే జరగబోతున్న విభజనకి ఆటంకం కలుగుతోంది. ఈ సందర్భంగా ...ఒక రాజకీయ నాయకుడు హైదరాబాదు గురించి మాట్లాడుతూ; సెంటి మెంటు అంటాడు.... విచిత్రం.... పుట్టి పెరిగిన ఊరుకి ఏమీ చెయ్యకుండా, రాజధానికి దోచిపెట్టినవాడు  సెంటిమెంటు అనటం ఏ మాత్రం సమంజసం....?? "తల్లిదండ్రిని చూడని వాడు ఫాదర్స్ డే//మదర్స్ డేల గురించి మాట్లాడినట్లుగా ఉన్నది"....!!!

ఇప్పుడు జరుగుతున్న దానిబట్టి,  రాయల్ ఆంధ్రా వారికి  "మంచి స్థిరమైన రాజధాని లేకపోవటమే" గొడవలకి మూలం అని అర్ధం అవుతోంది. వీరు ఇప్పటికే చాలా కాలాన్ని, ధన్నాన్నీ కోల్పోయారు. దానికి కారణం... తమకి పట్టులేని ప్రాంతాలలోనికి వెళ్లి అక్కడ తమ ప్రాభవం, ప్రతాపం చూపించాలని అనుకోవటమే.... ఇది మద్రాసులోనూ అయినది, హైదరాబాదు లోనూ అదే పరిస్థితి కనపడుతోంది.

రాయల్ ఆంధ్రా వారు చేసిన తప్పు హైదరాబాదు వెళ్ళటం  కన్నా, తమ జిల్లాలలో తాము అబివృద్ధి చెందకపోవటం... ఇది ఒక కారణం అయితే, ఒక జిల్లా వారికి మరొక జిల్లా వారికి సరైన అవగాహన లేక పోవటం మరొక ముఖ్యమైన కారణంగా కనపడుతున్నది. ఎందుకంటే, చిత్తూరు జిల్లా వారు శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమ స్థాపించాలని అనుకోరు. అలాగే అనంతపురం వారు కృష్ణ జిల్లాకి రారు. కోస్తా జిల్లాలలోనే వారిలో వారికి సరిగా పడదనే చెప్పవచ్చును. అలాంటి పరిస్థితే రాయలసీమలో కూడా ఉన్నది. దీనికి తెలంగాణా జిల్లాల వారు కూడా ఏమీ అతీతం కాదు...

ఈ కారణంగానే అందరు కలిసికట్టుగా హైదరాబాదు మీద పడ్డారు. స్వంత జిల్లాల మిద కన్నా హైదరాబాదు మీదే ప్రేమనీ సెంటిమెంటునీ పెంచుకున్నారు. భార్యా, పిల్లల కన్నా "ఎక్కువగా" చూసుకున్నారు... విచిత్రం ఏమంటే,  శ్రీకాకుళం ఎంపి పార్లమెంటులో లేచి "హైదరాబాదుకి ఇది కావాలి అది కావాలి" అని అడిగితే, ఆయనకీ రాయల్ ఆంద్రా ఎంపిలు అందరూ గొంతు కలుపుతారు. అదే ఈ జిల్లాలో ఎవరైనా తమ జిల్లాకి ఏదైనా కావాలనీ పార్లమెంటులో లేవనెత్తితే ఒక్కడూ కూడా సపోర్టు చెయ్యరు. ఏదైనా విజయవాడలో పెడదామంటే గుంటూరు వారు కావాలంటారు. గుంటురుకి  రాబోతుంటే కృష్ణా వారు అడుగుతారు. ఇలాంటి రాజకీయ వేత్తలతోనే గోదావరి జిల్లాలు కూడా నిండి ఉన్నాయి. పిట్టల పోరు పిల్లి తీర్చిన చందాన, ఆ అభివృద్ధికి కావాలిసినవి హైదరాబాదుకి పోతుంటే, వీరందరూ కళ్ళు అప్పగించటమే కాకుండా, సంతోషంగా సహకరించారు. ఈ విధంగా వీరందరూ కలసి హైదరాబాదు పిల్లికి రొట్టెముక్కని అందించారు... వీరిలో ఉన్న ఈ అనైక్యతే ఈ రోజు సీమాంద్ర ప్రజల నెత్తిమీదకి వచ్చిపడింది.

ఇంత జరిగినా "విడిపోతే రాజధాని ఎక్కడ పెట్టాలి" అని అడిగేంత అమాయకత్వం సీమాంధ్ర నాయకులు చూపిస్తున్నారంటే... దానికి కారణం వీరి మధ్య ఉన్న అనైక్యత మరియు అభద్రతా భావం... రాజధాని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతే మన గతేమిటి? ఇప్పటికే రెండుసార్లు మోసపోయ్యాము... అనే అభద్రతా భావం. హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంటే ఏ గోలా ఉండదు కదా... అని, మరొక "రాయల్ ఆంధ్రా ప్రజల చారిత్రాత్మక నష్టానికి తెర తీస్తున్నారు" ఈ తెలివితక్కువ మూర్ఖ సీమాంధ్ర నాయకులు. 

ఇప్పటికే ఇలాంటి పరిస్థితిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం[కాకినాడ ప్రక్కన] ప్రజల బాధ చూస్తే... దూరంగా ఉండే రాజధాని బాధ ఏమిటో అర్ధం అవుతుంది.  పాండిచెర్రిలో కనీసం వేరొక రాష్ట్రం వారైన మదరాసు వారికి ఉన్న మర్యాద కూడా స్వంత రాష్ట్ర ప్రజలైన యానాం వారికి  లేదు. కారణం వీరికి భౌగోళిక సంబంధం లేకపోవటమే కాకుండా,  భాషా, సంస్కృతి భేదాలు కూడా ఉండటమే..... అంతెందుకు,దేశ రాజధాని అయిన ఢిల్లీలో, ఉత్తర దేశీయులుకన్నా... దక్షిణ దేశీయులు అన్నీ విధాల వెనుకపడి ఉండటానికి కారణం... అది దూరంగా ఉండటమే...

కాబట్టి, రాయల్ ఆంధ్రా వారు... హైదరాబాదుని కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే తమ రాజధాని ఏర్పాటు చేసుకోవటం ఒక చారిత్రాత్మక అవసరం. ఇప్పుడు కనుక నేతలు తప్పు నిర్ణయం తీసుకుంటే,  ఇప్పుడున్న అవమానకరమైన పరిస్థితిలోనికి భవిష్యత్తు తరాల వారిని కూడా తోసిన వారు అవుతారు. పైగా, ఇది ఆంధ్రా వారికి అడిగే సమయం. కావాలిసింది కఠినంగా అడిగి, వత్తిడి చేసి తీసుకోవలిసిన టైమిదే...ఒకప్పుడు ఆంద్రా ఏర్పడేప్పుడు... మదరాసు మాయలో పడి, ఆంధ్రాలో కలవవలసిన చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుండీ జిల్లాల వరకు, ప్రక్క రాష్ట్రాల వారికి  నీళ్ళొదులుకున్నారు.... ఇప్పుడు కూడా హైదరాబాదు మాయలో పడి... రాష్ట్రానికి చెందిన అనేక ఊళ్ళ దగ్గర నుండీ, నీరు, వనరుల పంపిణీ ...ముఖ్యమైన ఆదాయ-వ్యయ లెక్కల్ని విస్మరిస్తున్నారు.  ఏది జరిగినా విభజన సమయలోనే జరగాలి... ఆతరవాత ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే...ఈ సంగతి గుర్తెరిగి బుద్ధి కలిగి ఉంటే మంచిది. .

అందువల్ల, అనవసర అపోహలతో ప్రజల సొమ్ముతో ఆడుకోకుండా,  ఢిల్లీ ప్రయాణాలు కట్టిపెట్టి, పార్టీలకి అతీతంగా సీమాంధ్ర నాయకులు ఒకచోట కూర్చుని...తమలో అపోహలని తొలగించుకొని, "రాజధాని ఏ ప్రాంతంలో పెట్టినా, అక్కడ అందరికి అవకాశాలు ఉండేట్లుగా" నిర్ణయాలు తీసుకోని, దానికో చట్ట రూపం ఇచ్చి, రాజధాని పేరుతొ అభివృద్ధి కేంద్రీకరణ అనే తప్పుని మరల చెయ్యకుండా... రాష్ట్రం మొత్తాన్ని రాజదానిగానే చూస్తే మంచిది. దీనివల్లన, భవిష్యత్తులో ఏ ప్రాంత ప్రజలు వేరొక ప్రాంతం వారిచే మోసగించబడరు. 

ఇందుకోసం రాజధాని అనగానే ఒకే చోట పెట్టకుండా...  ప్రాంతీయ అవసరాలుగా రాజధానిని విభజించి, అనేక ప్రాంతాలలో పెట్టినట్లయితే... అన్ని ప్రాంతాలు ఒకే సారి అభివృద్ధి అయ్యేందుకు చాలా చక్కటి అవకాశం ఉన్నది. ఇలా ఒకే చోట రాజధాని లేకపోవటం వలన అన్ని రంగాలవారు దీనినే ఆదర్శంగా తీసుకొని, అన్ని ప్రాంతాలలో తమ అబివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. "ఎక్కడైనా ఒకే రకమైన సౌకర్యాలు ఉంటే అందరు ఒకే చోటుకి ఎందుకు పరిగెడతారు"...!!!ఇక్కడో మాట చెప్పుకోవాలి... "హైదరాబాదు సంబంధమే" లేకపోతే, రాయల్ ఆంధ్రాలో... రాజకీయ నాయకులు - ప్రజలు  ఖచ్చితంగా ఎవరి జిల్లాని వారు అభివృద్ధి చేసుకోవాలనే చూస్తారు... దురలవాట్లు లేని వాడు ఇంటిపట్టునే ఉండి... భార్యా పిల్లలని మంచిగా చూసుకోన్నట్లుగా.....!!!

దీని ఆధారంగా కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్‌కు,  రాజధానులు ఎక్కడుంటే బాగుంటుందో ప్రాంతీయ అవసరాలుగా విభజించి,  ఎక్కడ ఏ ప్రాంతం దేనికి ప్రసిద్దో దానిని అక్కడ పెట్టాలి. దీనివల్ల  అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలకి దానిమీదన అవగాహన ఉంటుంది. దీని వలన రాజధాని మా ప్రాంతంలో పెట్టండి, మా ప్రాంతంలో పెట్టండి అని వివాదాస్పదంగా కొట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకో ముక్క విడిపోవాలన్నా కేవలం ఒక్క రోజులోనే విడిపోయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అన్నిప్రాంతాలు సమంగానే ఉంటాయి కాబట్టి ఎదో పోతోందన్న బాధ ఎవరిలో ఉండదు. అయితే అసలు విడిపోయ్యే భావన కూడా పుట్టదనుకోండి...!!! ఈ ప్రయోగం ....రాష్ట్రం అంటే కేవలం రాజధాని మాత్రమే అనే మూర్ఖత్వం నుండి బయటపడేసి, దేశంలోని అన్ని రాష్ట్రాలకి మార్గ దర్సకంగా ఉండి, కనువిప్పు కలిగించేట్లు ఉండాలి.

రాజధానికి సంబంధించిన అంశాలు:
----------------------------------------------------------------------------------------------------------

1]మొదటిగా ఆర్ధిక మరియు క్లరికల్ రాజధాని .. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన పాలనా వ్యవహారాలని చూసుకునే వారు. వారు ఉండటానికి కాలనీలు ఉంటే చాలును. ఇది నంద్యాల లేక ఒంగోలులలో పెడితే ఆంధ్ర, రాయలసీమ వారికి అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ కేవలం కాగితాలు ఖరాబు చేసే గుమాస్తాలు మాత్రమే ఉంటారు. ఇక్కడ లెక్కలు... అంటే ఆదాయాలు... వ్యయాల గురించి మాత్రమే పరిపాలన ఉంటుంది. అన్నమాట... ఇలాగే కేవలం కాగితం పని మాత్రమే ఉన్న [డబ్భుతో పనిలేని] హెడ్ ఆఫీసులని, రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాలలో  పెట్టవచ్చును. దాని వలన, ఆ ప్రాంతాలు ప్రత్యేక ఆర్ధిక పెకేజిల సహాయం పొందకుండానే బాగుపడే అవకాశం ఉన్నది.

2] వ్యవసాయ రాజధాని ... ఇది చాలా ముఖ్యమైనది... వ్యవసాయం అనేక చోట్ల ఉండేది కాబట్టి... ఎక్కడ ఎక్కువగా వ్యవసాయం మీద మాత్రమే ప్రజలు బ్రతుకుతున్నారో అక్కడే దగ్గరలో ఉన్న ఓ పట్టణంలో ఏర్పాటు చెయ్యాలి... వ్యవసాయం ఎక్కువ వ్యాపించి ఉన్న ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని చిన్న రాజధానులు ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చెయ్యాలి. ఈ కార్యాలయాలన్నీ ఇప్పుడున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఆర్ధిక రాజధానితో సంబధం కలిగి ఉండాలి.   ఈ రాజధానిని గుంటూరు, కర్నూలు, అమలాపురాలలో ఏర్పాటు చెయ్యటానికి అనువైన ప్రదేశాలు. వీటికి అనుసంధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా లభ్యంయ్యేచోటే మరొక పట్టణంలో  ప్రజాపంపిణి వ్యవస్థని కూడా పెట్ట వచ్చును.

3] పారిశ్రామికరంగ రాజధాని..... దీనికి కావాలిసిన అనువైన ప్రాంతాలు ఆంధ్రాలో చాల కొద్దిగానే ఉన్నాయి. ఎందుకంటే, ఇక్కడ పెద్దగా పారిశ్రామిక అభివృద్ధి చెందలేదు. కాబట్టి, దీనిని కొద్దో గొప్పో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖలో ఏర్పాటు చెయ్య వచ్చును... దానితో పాటు పరిశ్రమలు ఏర్పాటుకి అనువుగా ఉన్న ప్రదేశాలైన అనంతపురం, ప్రకాశం జిల్లాలు కుడా ఈ పారిశ్రామిక రాజధాని ఏర్పాటుకి అనువైన ప్రదేశాలే....

4] విద్యా రాజధాని... ఇక్కడ చదువులకి సంబంధించినవి ఉండి...   చదువుకోటానికి వచ్చే విద్యార్ధులకి కావాల్సిన సౌకర్యాలు ఉన్న ప్రాంతంమైతే బాగుంటుంది.... ప్రాధమిక చదువు అన్ని ప్రాంతాలకి సంబంధించినదే అయినప్పటికీ... పై చదువులకి ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా అన్ని రాష్ట్రంలోనే ఉండేట్లుగా చేస్తే బాగుంటుంది.... దీనికి ఇప్పటికే  చదువుల [పొగలేని]ఫ్యాక్టరీల ప్రాంతంగా ఉన్న విజయవాడలో ఏర్పాటు చేస్తే బాగుండచ్చు. దీనికి రాష్ట్రమే కాదు దేశంలోని అన్ని ప్రాంతాలకి పోవటానికి కావాలిసిన రవాణా వ్యవస్థ సదుపాయం కూడా ఉన్నది.

5] నీటి పారుదల రాజధాని... ఇది వ్యవసాయ అనుసంధానం కాబట్టి ఆక్కడే ఏర్పాటు చెయ్యవచ్చును. లేక నీటి వనరులు ఎక్కడ ఎక్కువ ఉండి వినియోగించవలసి ఉన్నదో అక్కడే పెడితే బాగుంటుంది... దీనికి రాజమండ్రి-కర్నూలు  మంచి అనువైన ప్రదేశాలు.

6] రవాణా రాజధాని... రవాణాకి సంబంధించిన ఆన్ని వ్యవస్థలని ఇక్కడ ఏర్పాటు చెయ్యాలి. బహుశా దీనికి విజయవాడే బాగుండచ్చు...

7] విద్యుఛక్తి రాజధాని...  విద్యుఛక్తి ముఖ్యమైనది మొత్తం రాష్ట్రానికే సంబంధించినది... కాబట్టి పవర్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నా వాటి పరిపాలన అక్కడే ఉండాలనీ లేదు. ఇలాంటి విద్యుచ్చక్తికి సంబందించిన అన్ని ఆఫిసులని ఏదైనా బాగా వెనుకబడిన ప్రాంతంలో పెట్టినట్లైన...ఈ ఆఫీసుల వలన ఆ ప్రదేశం బాగుపడే అవకాశం ఉన్నది.   ఆంద్రాలో నీటి పారుదల... ధర్మల్ విద్యుఛక్తి కంటే...గాలి మరియు సోలార్ శక్తిని వినియోగించుకునే అవకాశమే ఎక్కువ కాబట్టి ఆ దిశగా ఆలోచించటం మంచిది. 

8] భూగర్భ గనుల రాజధాని...  దీనిని అనుమానం లేకుండా అనంతపురంలో ఏర్పాటు చెయ్యవచ్చును. దానివల్ల ఆ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది.

9] అటవీ  రాజధాని... ఈ రాజధాని ఒకటి కాకుండా రెండు పెట్ట వలసి ఉంటుంది. ఒకటి శ్రీకాకుళంలో మరొకటి కడపలో

10] ఇదే కాకుండా, రాయల్ ఆంధ్రాకి సంబంధించిన హెడ్ ఆఫిసులన్నీ వారి ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలి. ఉదాహరణకి ... సికిందరాబాదులో ఉన్న దక్షిణ మధ్య రైల్వేని తెగ్గొట్టి "కోరమండల్ రైల్వేగా" నామకరణం చేసి.... రాయల్ ఆంధ్రాలోని ఎదో ప్రాంతంలో నెలకొల్పాలి. ఇలా వీరికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ విభజించి ...వాటి కార్యాలయాలని రాయల ఆంధ్రాలోని ఒకే ఉళ్ళో పెట్టకుండా... అనేక ఉళ్ళలో పెట్టాలి. 

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పూర్తిగా అవగాహన ఉన్న నిపుణుల కమిటి కనుక సరైన ప్రాంతాలని నిర్ణయించి పెట్టినట్లయితే బాగుంటుంది. అనువుగాని చోట వ్యవసాయం, అడవులలో//వ్యవసాయభూములలో పరిశ్రమలు పెట్టాలనే....రాజకీయ నాయకుల కెలుకుడు లేకుండా, పూర్తిగా నిపుణుల కమిటికే సంపూర్ణ అధికారాలిస్తే మంచిది.

దీనితోబాటు  మంచి రాజకీయ నాయకత్వం కూడా ఉంటే, కొత్త ఆంధ్రప్రదేశ్ బాగుపడటానికి 40, 50 సంవత్సరాలు అవసరం లేదు... కేవలం 10, 15 సంవత్సరాలలోనే చుట్టుప్రక్కల ఉన్న అన్ని రాష్ట్రాలని మించిపోతుంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన మంచి తెలివిగల మానవ వనరులు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. వీరిని ఉపయోగించుకొని  దేశంలో ఆంద్రప్రదేశ్ పవరేమిటో చుపించవచ్చును. ఇలా కాకుండా ఎన్నో శక్తియుక్తులు ఉపయోగించి రాష్ట్ర విభజన ఆపినా, అది పామై... ఏ 20,  30 సంవత్సరాల తరవాతైనా రాయల్ ఆంధ్రా వారి మెడకి చుట్టుకొని కాటువేయ్యక మానదు....!!! కాబట్టి ఏది జరిగినా... జరగకపోయినా... ఇప్పటికైనా ఎవరి జిల్లా అభివృద్ధి వారు చూసుకుంటే, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడవచ్చును. 


ఇవన్ని చెయ్యాలంటే, 
దమ్మున్న రాజకీయ నాయకులు కావాలి...
జావకారిన.. పదవులని నమ్ముకున్న నాయకులు కాదు....
అలాంటి కాపినం ఉన్న నాయకులు తక్షణమే రాజకీయాల నుండి తొలగి...
తమ అసలు ప్రవ్రుత్తి  అయిన కాంట్రాక్టు  పనులు చెసుకుని బ్రతికితే, 
అదే రాయల్ ఆంధ్రా ప్రజలకి... వారు చేసే గొప్ప మేలు... పనిలో పనిగా,
తెలుగులోనూ...ఇంగ్లీషులోనూ మొదటి అక్షరంతో మొదలైనా...  
అచ్చిరాని... ఆంధ్రప్రదేశ్ పేరును
 "రాయల్ ఆంధ్రా"గా  మారుస్తే, 
ఉన్న ఇరు ప్రాంతాలవారికీ గౌరవం ఇవ్వటమే కాకుండా...
పేరులోనే రాయల్ ఉన్న ఈ రాష్ట్రం... 
నిజంగానే రాయల్‌గా మారుతుంది.జైహింద్
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???

@@@@@@@@@@@@@వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి