LOCAL WEATHER

30, మార్చి 2014, ఆదివారం

ఎన్నికల కోడు గురించి కోడై కూసే మీడియాకి మాత్రం ఏ కోడూ వర్తించదా...???

ఎన్నికల కోడ్ అందరికీ వర్తించదా...???

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు 
ఎన్నికల కోడు కూస్తోందని మీడియాలలో ఒకటే గోల... 
ఎన్నికల కోడ్ అంటే...
ఎన్నికలు జరగబోయే ముందర 
నాయకులు రకరకాలైన పనులు చేసి ఓటర్లని ఆకట్టుకుంటున్నారనీ 
వారిని కట్టడి చెయ్యాలనీ పెట్టినదే ఎన్నికల కోడు...
దీని ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలని ప్రకటించగానే 
ఎవరూ కూడా కొత్త పధకాలని ప్రవేశ పెట్టకూడదు... 
అలాగే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజలని మభ్య పెట్ట కూడదు... 
మతం, దేవుడు లాంటి పదాలు వాడి ప్రజలని లోబర్చుకో కూడదు...
 ఇలాంటివి అనేకం ఉన్నాయి... 
వీటి వలన ప్రజలు ప్రలోభాలకి లోను కాకుండా ఓటు వేసి 
తమ అసలైన మనోభావన్ని తెలియజేస్తారని 
ఈ కోడుయొక్క ఉద్దేశ్యం...

ఇన్ని ఉన్నప్పటికీ 
ఈ కోడు గురించి కోడై కూసే 
మీడియాకి మాత్రం ఏ కోడూ వర్తించదు 
ఎందుకనో...!!!
వీరు ఎన్నికల ముందు లాగానే... 
ఎన్నికల ప్రకటనానంతరం కూడా 
ప్రజలని ఉద్రేక పరచే, మభ్యపెట్టే అనేకమైన విషయాలని 
తమ మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా ప్రసారం చేసి పారేస్తుంటారు... 
ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా...

వీటిలో కొన్ని...

1] ఫలానా నియోజక వర్గంలో ఓ సామాజిక వర్గం బలంగా ఉన్నదని...

2] మరో నియోజక వర్గంలో మైనారిటీల ఓట్లే కీలకం అనీ... 

3] ఈ నియోజక వర్గం కాంగ్రెస్సు పార్టీకి పెట్టని కోట, మరొక దానిలో తెలుగు దేశం ఏమైనా గెలుస్తుందని, ఇంకొక దానిలో వైఎస్సార్ సీపీకి ఎవరు నుంచున్నా సరే గెలుపు ఖాయమని వివరణలని ఇచ్చేస్తుంటారు; ప్రజలు "వెయ్యబోయ్యే ఓట్లతో" సంబంధం లేకుండానే...

4] ఫలానా నియోజక వర్గం లోని ఒక ప్రాంతంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టాలిసి వస్తుందని... అక్కడ డబ్బుదే హవా అనీ...

5] మీడియా విలేఖరి అనబడే వాడు తమ పేకాట భాషని వాడితూ... ఒక నాయకుడు తమ పార్టీ గెలుపుకై   "బీసీ కార్డు" ఉపయోగించాడని... 

6] ఫలానా నాయకుడి చూపు మరొక పార్టీ పై ఉన్నదని, చాటు మాటున ఆ పార్టీ వారికే సపొర్టు చేస్తున్నాడని...

7] అదృష్టం తలుపుతట్టి అనుకోని వాడికి పార్టీ టిక్కెట్టు వచ్చిందని...[ప్రజాసేవ అంటే లాటరి టిక్కెట్టు లాంటిదా..]

8] ఎంతో భాద్యతాయుతమైన వీరు వాడే భాష చూస్తే అసలు ఎన్నికల గురించా లేక ఏదైనా సినిమా గురించా అని అనిపించక మానదు... "రసకందయంలొ పడింది", "రసవత్తర పోరు",  "ఒంటరి పోరు", "ఓటు బ్యాంకు","కుల సమీకరణాలు/వర్గీకరణాలు", "ఎన్నికల సందడి"....


ఇలా ఒకటేమిటి, ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతున్నా కూడా ...ఫలానా చోట పొలిసు కాపలా లేదని, అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉన్నదని...పరోక్షంగా రిగ్గింగు చేసేవారికి సందేశం ఇస్తూ....ఏదైతే ఎలక్షన్లలో ఓటర్లని ప్రభావితం చెస్తాయని భావించి ఎన్నికల కోడులో పెట్టారో... వాటికన్నా మించిన అంశాలని చాలా వివరంగా మీడియాలలో చర్చించి ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు; హక్కులే కానీ బాధ్యతలు లేని మీడియా.  వీరిచ్చే గణాంకాల వలన ఆయా ప్రాంతాలలో అభివృద్ధికన్నా అల్లర్లు ప్రబలే అవకాశాలే ఎక్కువ. ఇంత కోడ్ ఉల్లంఘన చేస్తున్న వీరే, మరెవరో ఎన్నికల కోడును దాటుతున్నారని తెగ హడావిడి చేసి,  కొన్ని గంటల తరవాత మిన్నుకుండిపోతారు... 

"మీడియా వారు చేసే మానసిక కోడ్ ఉల్లంఘనకన్నా, రాజకీయ నాయకులు చేసే భౌతిక కోడ్ ఉల్లంఘనే నయం"....దాని వలన ప్రజలకి ఏదో పధకం ద్వారా డబ్బులో లేక అభివృద్ధి కార్యక్రమమో అందుతుంది.

కాబట్టి ఓ ఎన్నికల కమీషను వారూ... అందరికీ వర్తింపచేసిన ఈ ఎన్నికల కోడును, మీడియాని కూడా తమ పరిధిలోనికి తెచ్చుకొని, అన్నిరకాల మీడియాలకి కూడా వర్తించేట్లు చూడగలరు...  వాటిని మీరిన మీడియాకి డబ్బుల పెనాల్టీలతోబాటూ... ఎన్నికలు అయ్యేదాకా ఆ మీడియాపై బేన్ పెట్టే విధంగా చర్యలు తీసుకొవాలి....  

ఒక వేళ వీటిని కంట్రోల్ చేసే అధికారం లేనట్లయితే....కేబుల్ ఆపరేటర్ల మీద చర్యలు తీసుకొని, కోడు మీరిన మీడియా కనపడకుండా చేసి...ఎన్నికలలో ఓటర్లు తమ ఆలోచన ఏదో తాము చేసుకునే "ఆలోచనా స్వాతంత్రాన్ని" రక్షించగలరు. ముఖ్యంగా "పెద్ద మనుషులు కూర్చుని చర్చిస్తున్నట్లుగా కొట్టుకొనే ప్రోగ్రాంలను" ఎలక్షన్ల కాలంలో నిషేధించ వలసి ఉన్నది.



@@@@@@@@@@@@@@@@@@

****************************************************************
అందరికి ఉగాది శుభాకాంక్షలు
****************************************************************
@@@@@@@@@@@@@@@@@@




23, మార్చి 2014, ఆదివారం

మత చిచ్చు పెడుతున్న తిరుమల అవినీతి అగ్ని...

కర్టేసి:గూగుల్ ఇమేజెస్ 

కొద్ది రోజులుగా తిరుమలలో ఉన్న అడవులలో కార్‌చిచ్చు ప్రబలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినాయి... అవి ఆర్పడం గురించి కన్నా అవి ఎందుకు ప్రబలినాయో ఎవరికి తోచినట్లుగా వారు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్పుకు పోతున్నారు... చివరకు ఎలాగైతేనే మన నేవీ వారి సహాయ సహకారాలవలన అవి చల్లారిపోతున్నాయి...

అయితే ఆ మంటలు చల్లారుతున్నా, అవి ఎందుకు ప్రబలినాయో అన్న అనుమానపు మంటలు చల్లారటం లేదు... ఈ విషయంలో మతం మాటను ఎవరు పైకి తెచ్చారో కానీ, ఎవరో అన్య మతస్తులు వలనే ఇది జరిగింది అని ఎక్కడో ఉన్న విశాఖ స్వామీజీ గారు కూడా అనేశారు. ఇది ఆయన తెలిసి అన్నారో లేదో తెలియదు కానీ... ఇదంతా చూస్తుంటే ఆ మంటలు కావాలని రాజేసినవే అని మడుకూ అర్ధం అవుతున్నది...

ఇవి అలా ఎవరు రాజేశారు అని అనగానే... అనుమానం సహజంగానే మతాలన[అ]మ్ముకొనే వారి మీదకే పోతాయి... కాని, ఈ విషయంలో ఇది ఇలాగే అనుమానం తేవాలనే, కొందరు పనిగట్టుకొని... అసలు విషయాన్ని జనానికి తెలియకుండా ఉంటానికే అలా ప్రచారం చేస్తున్నారా... అని అనిపించక మానదు...!!

ఈ అనుమానాలని ప్రక్కన పెట్టి, కొద్ది నెలలుగా జరిగే సంఘటనలని తీసుకుంటే ఈ మంటలకి కారణం ఎవరో ఇట్టే తెలిసిపోతుంది... అనేక ఏళ్ళుగా తిరుమల అటవీ సంపదని కొల్లగొడుతున్న చందన స్మగ్లర్లు; కొద్ది నెలలుగా బరితెగించి పోలీసుల మీదే తిరగబడటం, ఆ అడవి తమ స్వంతం అని అన్నట్లుగా పొగరు చూపించటం, దానికి తగ్గట్లుగా వీరికి రాజకీయ నాయకులలో కొందరి అండ ఉందనే వాదనలూ... ఇవన్నీ చూస్తుంటే ఈ దుస్సాహసానికి చందన స్మగ్లర్లూ, వారితో కలిసిన కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్న అధికారులూ...కారణం అనిపిస్తోంది...

ఏదైనా ఆఫీసులలో అవినితి జరిగినప్పుడు సహజంగా ఆ ఆఫీసుకి అగ్ని గండం ఉంటుంది... ఆ ఆఫీసు ఎంత కాంక్రీటు బిల్డింగులో ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో పేద్ద బిల్డింగులో ఉండి బ్రహ్మాణ్ణమైన కాపలా ఉన్నప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగి..."కాలాలిసిన ఫైళ్ళు కాలేదాకా" ఆ మంటలు అదుపులోనికి రావు పాపం...ఎన్నొ ఆధునిక ఫైరింజన్లు ఉన్నప్పటికీ..

ఏదైనా అడవిలో ఏ రకం చెట్లు ఎన్ని ఉన్నాయి లాంటి వివరాలు అటవీ శాఖ వారి వద్ద ఉంటాయి....ఆ ఫైళ్ళ నకళ్ళు రాజధానిలో ఉంటాయి... మరి ఇన్నాళ్ళూ జరిగిన చందనం, ఇతర వృక్షాల స్మగ్లింగు అవినీతిని చెరిపెయ్యటం ఎలా... పైన మనం చెప్పుకున్నట్లుగా దానికి సంబంధించిన ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే పోలా...చాలా తేలికే మరి... అయితే ఇప్పుడున్న పరిస్తితులలో ఏ తిరుపతి ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే కుదరదు కదా...హైదరాబాదులో కూడా దానికి ప్రతిస్పందన రావాలి కదా... కానీ అక్కడ ఉన్నది ఏ సాదాసీదా రాజకీయ నాయకుడో కాదు..."నారసిమ్హుడు". 

నారసిమ్హుడి ప్రతి స్పందన ఎలా ఉంటుందో దొంగ పెట్రోల్ బంకుల స్ట్రైకులో  చూశారు...కాబట్టి ఈ ఆఫీసు అగ్నిప్రమాదం కుదరదు...పొనీ ఎలక్షన్ల తరవాత చూసుకుందాము అంటే అప్పుడు రాజెవరో...__...ఎవరో తెలియదు కదా... ఎందుకొచ్చిన గొడవ, ఈ తిరుమల అడవుల అవినీతిని నానబెట్టటం ఎందుకు... ఆఫీసులో కాకపోతే అడవిలో అగ్నిప్రమాదం జరగదా... పైగా అది ఇంకా తేలిక కూడా... అని అవినీతి దోంగలు అనుకోవటం వల్లనే తిరుమలలో అవినీతి మంటలు చెలరేగినాయి... అప్పుడు రికార్డులుంటాయి కాని, అడవే ఉండదు కదా... లెక్కల్లో తేలని అడవి, అగ్నికి సమర్పయామి అని సర్ది చెప్పుకోవచ్చును కదా...!!!

తిరుమలకి భక్తిగా వచ్చే భక్తుల లింగ భేదం చూడకుండా... అందరి ఒళ్ళంతా తడిమి మరీ చెకింగు చేసి... వంటిమీద దుస్తులు తప్ప మంచి నీళ్ళ సీసాకూడా వదలకుండా అన్నీ ఊడగొట్టి మరీ పంపించే కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట  మంటలు చెలరేగినాయి...!!! ఎవరికీ పట్టలేదు...!!! ఎదో రెండిళ్ళు తగలడుతుంటే ఫైరింజనువాళ్ళు వచ్చి ఆర్పినట్లుగా ఆర్పితే ఆ మంటలు చల్లారుతాయా...? ఈ విషయం అక్కడ ఉన్న అధికారులకి తెలియదా...?? ఒక వేళ తెలిస్తే, ఎందుకు అన్ని రోజులు మిన్నుకుండిపోయ్యారు...??? రోజూ పేపర్లోనూ...టీవీల్లోనూ కొత్త న్యూసు క్రింద రావటానికా...?!? "కాలాలిసిన ఫైళ్ళు కాలిన తరవాత" అప్పుడు నేవీ వారి సహాయాన్ని నిదానంగా వారికి వినపడనంతగా అడిగారు...పాపం...నేవీ వారు ఆలస్యంగం వచ్చినా ఆ మంటలని చక్కగా అదుపులోనికి తీసుకొచ్చారు. ఇదే మొదటి రోజునే, ఆ మంటల తీవ్రతని కనిపెట్టి నేవీ వారి సహాయం తీసుకుని ఉన్నట్లైతే, అంతటి నష్టం జరిగేదా...??

ఇంతకీ విషయం చెప్పొచ్చేదేమంటే... తిరుమలలో అగ్నిని దారి మళ్ళీంచినది ఎవరో కానీ... చాలా తెలివిగా...సినిమాలోలాగా ఒకరు మర్డరు చేసి... "అప్పుడే గొడవ పెట్టుకుని వెళ్ళిన మరొక వ్యక్తి ఐడెంటిటీని, కావాలని పడేసినట్లుగా" ఆ అవినీతి అగ్నికి మతం రంగేసి దారి మళ్ళీంచారు...


దీనిని కనుక ఉపేక్షిస్తే, 
హైదరాబాదులో అధికార మార్పిడికోసం జరిగే 
మతకల్లోలాలు లాంటివి 
కేవలం తిరుపతిలోనే కాక 
రాష్ట్ర వ్యాప్తంగా అంటుకునే అవకాశం ఉన్నది...
కాబట్టి, 
ఈ తిరుమల అవినీతి మంటల వ్యవహారాన్ని 
తేలిగ్గా తీసిపారెయ్యక 
అత్యున్నత సంస్థచే విచారణ జరిపి, 
అసలైన దోషులని శిక్షించాలి... 
అప్పుడే ప్రజలలో ఉన్న అనవసర అపొహలు తొలగి 
మత చిచ్చులు రేగకుండా ఉంటాయి...



@@@@@@@@@@@


                                                         

7, మార్చి 2014, శుక్రవారం

సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం...


ఈ కష్టం...  "సమైక్యం పేరుతొ అనైక్యంగా యుద్ధం చేసిన సీమాంధ్ర రాజకీయ నాయకుల వల్లన వచ్చేదే..."  రాష్ట్రం విడిపోవటం కన్నా మించిన కష్టం ఏమిటా అనా.... ఎదో ఒకటి రాష్ట్రం విడిపోయింది...దాని వల్లన సీమాంధ్రకి వచ్చిన పెద్ద కష్టం ఏమీ లేదు... నష్టం పూడ్చుకోదగినదే.... అయితే ఆ పూడ్చుకునే నష్టాన్ని పూడ్చేదేవారు...?? మళ్ళీ మన స్వార్ధ రాజకీయ నాయకులే కదా...వీరు ఎంత పనికిమాలినవారు అయినప్పటికీ...!!!   వీరి అనై[తికత్వం]క్యం వలన రాష్టం విడిపోయినా కూడా వీరికి బుద్ధి రాలేదు... కలిసికట్టుగా ఉండవలసిన సమయంలో ఎవరి పొయ్య వారు పెట్టుకొంటున్నారు...

ఇలా సీమాంధ్ర రాజకీయ'వేత్తలు ఉంటే..... అక్కడ తెలంగాణలో ఏక పార్టీ లేక ఏక నాయకత్వ పరిపాలన రాబోతోంది...తెలంగాణాని తెప్పించింది మేమంటే మేము అని ఎంతమంది చంకలు గుద్దుకున్నా... "ఆ క్రెడిట్ కేసీఆర్‌కి తప్ప మిగిలిన ఎవ్వరికీ పోదు"... పైగా తన ప్రాంతం కోసం  తన పార్టీని కాలుష్య సముద్రంలొ కలిపేయకుండానే ఉంచారు...ఇది తెలంగాణాకి ఎంతో మంచిది. ఇక కాంగ్రెస్సుకి... కేసీఆర్ అండలేకపోతేగానీ బ్రతకలేని పరిస్థితిని ఆ పార్టీ వారే కొని తెచ్చుకున్నారు.... ఇకపోతే ఇక్కడ బీజేపీది "దారిని పొయ్యే దానయ్య పరిస్థితే"... ఆస్తుల తగాదా పడుతున్నవారికి, ఓ దారిన పొయ్యే దానయ్య ఎంత సహాయం చేసినా కూడా... ఆ అస్తులలో వాడికి భాగం రాదు కదా...!!! ఇదే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి...

సీమాంధ్ర అని చెప్పి, తెలంగాణా పరిణామాలని వ్రాస్తున్నాననా మీ సందేహం...   విడిపోయి అన్నదమ్ములు లాగా బ్రతుకుదాము అన్న వారు,  అప్పుడే పంపు తగాదాలూ...ప్రహరీ గోడ తగాదాలూ మొదలెట్టేశారు.  ఈ కాస్తకి... ఇచ్చి పుచ్చుకుందాం అని కూడా ఓర్వలేని వారు... అన్నదమ్ములులాగా ఎలా ఉంటారు...కేవలం బద్ద విరోధులు లాగానే బ్రతుకుతారు... రేపు సీమాంధ్ర వారికి వీరితోనే తప్పనిసరిగా కలిసి కాపురం చెయ్యవలసిన పరిస్థితి కాబట్టి... అక్కడి రాజకియ పరిస్తితి బట్టే సీమాంధ్రలోని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది... ఎవరైనా విడాకులు తీసుకోవాలని అనుకున్నా... ఒక పరిస్థితిలో కనీసం ఒక సంవత్సరం కలిసి ఉండి...అప్పుడు తీసుకోమని అంటుంటారు... కానీ, సీమాంధ్రులు విడాకులు తీసుకొన్న తరవాత కూడా తప్పనిసరిగా 10 ఏళ్ళు కలిసి బ్రతకమని, బ్రిటీషు తెలివితేటలున్న రాజకీయ నాయకులు పెట్టేశారు. అందుకనే సీమాంధ్రకు తెలంగాణా రాజకీయం కావాలి... అలాగే తెలంగాణాకి సీమాంధ్ర రాజకీయం కావాలి...ఇరువైపులా సమర్ధ ఐకమత్య రాజకీయ  నాయకత్వం ఉన్నప్పుడే ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరుగదు...అదిగాని బాలెన్సు తప్పిందో...అంతే సంగతులు...

తెలంగాణాలో ఏకపార్టీ పరిపాలన రాబోతుండగా...సీమాంధ్రలో ఐకమత్యం  మరియూ  నీతి జాతి లేని రాజకీయ నాయకులు...కనీసం ద్వి పార్టీ కాకుండా కూడా చేసేశారు... ఎవరి దారి వారిదే.. ఎవరికి వారికి తమ రాజకీయ భవితవ్యం మీద ఆందోళనేగానీ... విడిపోయి, రాజధాని లేక అల్లల్లాడుతున్న సీమాంధ్ర గురించి ఎవరికీ పట్టటంలేదు... ఇలా కొట్టుకు చచ్చే పార్టీలు అనేకం ఉండటంతో సీమాంధ్రలో ఏ సంకీర్ణమో కనుక వస్తే... సీమాంధ్రకి తీరని నష్టం వస్తుంది...వీరి అనైకత్యంతో ... మళ్ళి ఐకమత్యంగా హైదరాబాదునే అభివృద్ధి చేస్తారు...వీరు ఇప్పటికీ సీమాంధ్ర అవసరాలు...కరెంటు తదితరాల పట్ల ఉదాసినంగా ఉండటానికి కారణం...హైదరాబాదులో ఉన్న వారి ఆస్తులు...పరిశ్రమలే....

ఇక విషయంలోనికి వస్తే, కొత్తగా విడిపోయిన తెలంగాణాలో బలమైన ఏకపార్టీ పరిపాలనతో వారు తమకి కావాలిసినవన్నీ సమకూర్చుకుంటారు...ఇది ఎన్నికల తరవాతే చెప్పనఖర్లేదు...ఇప్పటికే భద్రాచలం విషయంలో తేటతెల్లం అయ్యింది... తమది కాని భధ్రాచలాన్ని వీరు సాధించుకుంటుంటే... ఇప్పటికి కూడా తమ గొడవలే కానీ...తిరిగి ఆ పట్టణాన్ని అడుగుదాము...అక్కడి ప్రజలని ఆకట్టుకుందామన్న జ్ఞానం లేని రాజకియ నాయకులతో సీమాంధ్ర నిండి ఉన్నది...కేవలం ఒక్క పట్టణాన్ని కూడా సాధించుకోలేని... ఇలాంటి అసమర్ధ-స్వార్ధ-పనికిమాలిన నాయకులతో సీమాంధ్ర ఉన్నది...ఇది రాబోయే అయిదేళ్ళ పాలనలో కూడా కనపడుతుంది... సీమాంధ్రకి భవిష్యత్తు పునాదికి కావాలిసింది కూడా రాబోయ్యే అయిదేళ్ళ పాలనే... ఆ అయిదేళ్ళ పాలన కూడా సీమాంధ్ర మూర్ఖ-స్వార్ధ పాలకులతోనే గడచిపోతే,  ఇక సీమాంధ్ర కోలుకోవటం ఇప్పట్లో సాధ్యపడదు...

కాబట్టి, సీమాంధ్ర రాజకీయ నాయకులారా... 
ఇప్పటికైనా ఇక్కడి అన్ని పార్టీలు కలసి 
సీమాంధ్రకి కావాలిసినవి సాధించేట్లుగా 
ఒక కూటమిగా ఏర్పడి...
ఒకరినొకరు తిట్టుకోవటం మాని...
ఏక నాయకత్వం క్రిందకి తప్పనిసరిగా వచ్చేట్లుగా నిర్ణయం తిసుకోండి... 
మీ స్వార్ధ రాజకీయ భవిష్యత్తుని గురించి ఆలోచించటం మానండి... 
సీమాంధ్రుల కష్టం తిరిగి ఏ మదరాసులోనో, హైదరాబాదులోనో
 లేక ఏ మురికి గుంటలోనో పడిపోకుండా 
చూసుకొనే విధంగా రాజకీయాలు నడిపి, 
సీమాంధ్ర ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించండీ... 
సీమాంధ్రులకి కావాలిసింది డబ్బులో లేక పేకేజీలో కావు... 
వీరికి అవ్వి సంపాయించే తెలివితేటలు చదువూ అన్నీ ఉన్నాయి... 
లేనిదల్లా ఆత్మ విశ్వాసమే... 
దానిని పొగొట్టింది కూడా మీరే...

ఇకపోతే హైదరాబాదు మీడియా...
సీమాంధ్రుల ఆత్మవిశ్వాసం పోగొట్టటంలో ప్రముఖ పాత్రని పోషించింది...
కాబట్టి,
 సీమాంధ్ర బాగుపడాలంటే 
హైదరాబాదులో ఏ గూడాలోనో కురిసిన భారి వర్షాన్ని 
రాష్ట్ర వ్యాప్తంగా  లైవ్ చేసే 
భావిలో కప్పలైన హైదరాబాదు మీడియా కాదు...
"స్వంతంగా సీమాంధ్ర ప్రాంతంలో నుండీ వచ్చే సీమాంధ్ర మీడియా కావాలి"...
ఈ మీడియా మాత్రమే 
సీమాంధ్రుల మనోభావాలని ప్రతిబింబించి, వాటికి గౌరవం పెంచుతుంది...
ఇది ఖచ్చితంగా జరగాలిసినదే...
ఎందుకంటే,
ట్రాయ్ కధలో గుర్రం బొమ్మతో గ్రీకు వారు మోసం చేసినట్లుగా...
 తమ వార్తలు, డైలీ సిరియల్సుతో
దిక్కుమాలిన హైదరాబాదు మీడియాలు
సీమాంధ్రులను మోసం చేస్తున్నాయి...చేస్తాయి.

సీమాంధ్ర ప్రజలూ తస్మాత్ జాగ్రత్త...!!!
"పొత్తులు అంటూ రాజకీయ వెర్రిని, 
 డైలీ సీరియల్స్, రియాలిటి షోలు అంటూ సుత్తులని కొట్టే "
హైదరాబాదు పిచ్చి మీడియాని వదిలించుకోండి...!!!



జై హింద్




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???





24, ఫిబ్రవరి 2014, సోమవారం

సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు...?!?!?

ఇదేమిటీ, రాజధాని ఎక్కడ పెట్టాలీ అని అందరు తలలు బాదుకునే పరిస్థితులు వస్తుంటే "ఎక్కడ పెట్టకూడదు" అని వ్రాయటమేమిటా అనా సందేహం...

రాజధాని ఎక్కడ పెట్టాలి...ఎలా పెట్టాలి...దానికి కావాలిసినవి ఏమిటీ...అని ఇంతకు ముందే ఈ బ్లాగులో  9 ఆగస్టు 2013 న వ్రాయటం జరిగింది....[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] అలా  దీని ప్రకారం పెట్టాలంటే మనవారికి చాలా విశాల హృదయంకావాలి...కానీ, ఇప్పుడు జరుగుతున్నా పరిస్తితులు చూస్తుంటే "సమైక్య ఉద్యమ్మాన్ని నడిపిన రాజకీయ వేత్తలకి" ఇంత కాకపోయినా...కొద్దిగా అయినా విశాలమైన ఆలోచన ఉందా అని అనిపిస్తోంది...

ఆగస్టు 2013 మొదటి వారం తరవాత, ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగినాయి... మద్రాసు విభజన జరిగిన సమయంలో లేని వాళ్లకి..అది ఎలా జరిగింది...అప్పుడు మనవాళ్ళు ఎలా ప్రవర్తించారు...అనే విశేషాలని మనవాళ్ళు ప్రత్యేక్ష ప్రసారం చేసి మరీ చూపించారు...అప్పట్లో టీవీలు..విపరీత మీడియాలు లేకపోవటంతో... జనంలో జరిగిన పోరాటాలే తెలిసినాయి కానీ, తెర వెనుక జరిగిన కుళ్ళు రాజకీయ కంపు తెలియలేదు... కానీ, ఇప్పుడు ఆ కొరత లేదు కదా...అన్నం తిన్న తరవాత మధ్యలో ఎన్ని తిరుగుళ్ళు తిరిగి అది క్రిందకి ఎలా వస్తుందో ప్రత్యేక్షంగా చూపించే [ఇది చూపించ వచ్చు...చూపించకూడదు అనే విచక్షణ లేని] మీడియాలు...  రాజకీయ కుళ్ళు మొత్తం చూపించేసినాయి. అప్పట్లోలాగానే యధావిధిగా సీమాంధ్ర రాజకీయ వేత్తలు మరో మాయ... సమైక్యాంధ్ర పేరుతొ హైదరాబాదు గొడవలో పడి తమకు కొత్తగా రావాలిసిన వాటి మాట అటుంచి...1956కు ముందున్నవి కూడా పోగొట్టుకొని వీరవిజయులై కొత్త హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటులో తమ వంతు కృషి తాము చేశారు....

ఈ కృషిలో ఎక్కువ భాగం పాలు పంచుకున్నది...అంతిమ ముఖ్య మంత్రి గారే..."హైదరాబాదులో తాను తిన్న ఉప్పుకి గౌరవం ఇచ్చారు". అలాగే మరొకరు... మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా....తన ప్రాణాలని హైదరాబాదులో పెట్టి... మా విజయవాడకి ఎందుకు పనికి రాకపోయినా, ఏదో స్వాతంత్ర యోధుడిగా తనకు తానే ముద్ర వేసుకొని...తన నాటకాన్ని తానే పండించి, చివరకు సన్నాసి అయినట్లుగా... మొఖం చాటేశాడు. ఇక ముఖ్యంగా మూడో వారిగా ఉన్న సీమాంధ్ర పంచ కట్టిన పెద్ద మనుషులు... "విభజన పాపం జరిగినప్పుడు అక్కడకి మమ్మల్ని రానియ్యలేదు" అని జనాలకి చెప్పుకోవటానికి, తమ కాపి స్లిప్పుని తామే అందించి... తమకితామే పరిక్ష నుండి డిబారు అయిపోయినట్లుగా నటించారు...ఇలా ఎవరి నాటకం వారు ఆడి జనాలతో ఆడుకున్నారు...


ఇదంతా ఎందుకు అంటే...ఇప్పుడు ఇలా అనవసర గొడవలు జరిగి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిన తరవాత విభజన జరిగేకంటే...మొదటి ప్రకటన జూలై 31 వచ్చినప్పుడే...సరైన పద్ధతిలో చేసినట్లయితే బాగుండేది కదా...ఇలా పనికి మాలిన నాటకాలు ఎవరి కోసం... పోనీ, ఇన్ని నాటకాల తరవాత అయినా సీమాంధ్రకి, న్యాయం మాట అటుంచి, కనీసం 1956కి ముందు రూపం వచ్చిందా అంటే అదీ రాలేదు. ఈ సారి విభజనలో భద్రాచలంతో పాటు కొన్ని ఊళ్ళని ఊడగోట్టించుకొన్నారు...ఈ విషయాన్ని ఇదే బ్లాగులో ఇంతకు ముందే 9 ఆగస్టు 2013 న హెచ్చరించటం జరిగింది...[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] ఇందులోని విషయం:                                      

"ఇది ఆంధ్రా వారికి అడిగే సమయం. కావాలిసింది కఠినంగా అడిగి, వత్తిడి చేసి తీసుకోవలిసిన టైమిదే...ఒకప్పుడు ఆంద్రా ఏర్పడేప్పుడు... మదరాసు మాయలో పడి, ఆంధ్రాలో కలవవలసిన చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుండీ జిల్లాల వరకు, ప్రక్క రాష్ట్రాల వారికి  నీళ్ళొదులుకున్నారు.... ఇప్పుడు కూడా హైదరాబాదు మాయలో పడి... రాష్ట్రానికి చెందిన అనేక ఊళ్ళ దగ్గర నుండీ, నీరు, వనరుల పంపిణీ ...ముఖ్యమైన ఆదాయ-వ్యయ లెక్కల్ని విస్మరిస్తున్నారు.  ఏది జరిగినా విభజన సమయలోనే జరగాలి... ఆతరవాత ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే...ఈ సంగతి గుర్తెరిగి బుద్ధి కలిగి ఉంటే మంచిది. ."

మామూలుగా ఉన్న మనలాంటి వారికే తెలుస్తుంటే....రాజకీయాల్లో పండిపోయి ఉన్న ఈ పనికి మాలినవారికి తెలియదా...??? నిన్నో మొన్నో కొందరు సీమాంధ్ర రాజకీయ  పెద్దలు "సమైక్య ఆంద్ర మాయలో పడి, రావాలిసినవి సరిగా అడగలేకపోయ్యామని" వాపోయ్యారు ట...ఇప్పుడు ఏమి ఏడిస్తే ఏం లాభం...!

ఈ ఏడుపుల వెనుక రకరకాలైన బెయిళ్ళూ...విడుదల బేరసారాలు కూడా బాగానే జరిగినాయి...ఒకరు ఆంధ్రాలో విడుదల అయితే, మరొకరు చిన్నమ్మగారి శిష్యుడు కన్నడంలో విడుదల అయినారు... అయితే, ఇప్పటి రాజకీయ నాయకులు కూడా 1953/56లలో రాజకీయనాయకుల కన్నా కొత్తగా ద్రోహం చేసిందేమీలేదనుకోండి...అప్పుడు ముఖ్యమంత్రి పదవికోసం ఒక పేద్ద నాయకుడు...బళ్ళారి, రాయచూరు జిల్లాలని వదిలివేస్తే, ఇప్పుడు తాము చేసిన తప్పిదనాలనుండీ బయటపడటానికి రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టారు.                                 
సరే, అసలు విషయానికి వస్తే...ఇంత జరిగినా ఇప్పటికైనా వీరికి బుద్ధి వచ్చిందా అంటే... రాలేదనే అనిపిస్తోంది... ఇది "రాజధాని మా ప్రాంతంలోనే పెట్టాలి అని మన లోకల్ సమైక్య రాజకీయ నాయకులు డిమాండులు చూస్తే తెలుస్తుంది... ఎక్కడ పెట్ట కూడదు అని అనుకుంటామో, అక్కడే పెట్టాలని వీరు... "ఊరు భక్తిని" చూపిస్తున్నారు... ఇన్నాళ్ళు సమైక్యాధ్రకి ఉద్యమం చేసిన వీరి విశాల హృదయం విశాల రాష్ట్రం నుండి...తమ ప్రాంతం...అక్కడి నుండి తమ జిల్లా...అక్కడి నుండి తమ ఊరు దాకా ఎందుకనో కుంచించుకొని పోయింది... కాబట్టి, ఇప్పటికైనా  సమైక్యాంద్ర స్పూర్తిని కలిగి...ఎక్కడ పెడితే రాష్ట్రం మొత్తానికి, మరియూ పెట్టిన చోట లాభం ఉంటుందో అక్కడ పెడితే బాగుంటుంది. ఇక వీరు సూచిస్తున్న ప్రాంతాలలో ఎందుకు పెట్టకూడదో చూద్దాం...

1] విశాఖపట్టణం...ఇక్కడ పెట్టాలని ఆటే గొడవల్లో పాల్గొనని అక్కడి ఓ పెద్ద మనిషి రాజకీయ వేత్త అంటాడు...అక్కడ పెట్టటానికి అన్ని వసతులు ఉన్నాయట....  "మీ ప్రాంతాన్ని రాజధాని పేరుతొ అభివృద్ధి పరచుకొండిరా" అని వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం అంటుంటే... అంత డబ్బు మాకు అవసరం లేదు అని...ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని కట్టమని అడగటంలో ఆయనగారి రాజకీయ అనుభవేమిటో మనకి అర్ధంకాదు...ఒక ప్రాంతీయ దురభిమానం తప్ప. మరొక విషయం ఏమిటంటే...ఈ విశాఖ పట్టణం మిగిలిన తెలుగు వారికి దూరం, ఒరియా వారికి దగ్గర. ఇక్కడగాని రాజధాని పేరుతొ వందల కిలోమీటర్లు అభివృద్ధి చెందితే...అందులో తెలుగువారికన్నా ఒరియా/హిందీ వారికే లాభం ఎక్కువగా ఉంటుంది....మూడవది ముఖ్యమైనది ఏమంటే..."ఇక్కడి ప్రజలకి కూడా హైదరాబాదు జనం లాగే బయట ప్రజలని భరించే శక్తి తక్కువ...కొన్నాళ్ళకి పొమ్మన్నా పొమ్మంటారు"....

2] కర్నూలు...ఇక్కడ అంతకు ముందే వుండేది అనీ, అందుకని అక్కడే పెట్టాలి అనీ... కొందరు సీమా రాజకీయాలలో పండిపోయ్యామని అనుకున్నవారు అంటున్నారు... అసలు ముందర అక్కడ పెట్టటమే తప్పు...మరల ఆ తప్పుని చెయ్యాలా...??? అక్కడ పెట్టటం వల్లనే హైదరాబాదు కలసిన తరవాత, రాజధాని అక్కడికి తరలిపోయింది. అదీకాక, నది దాటితే వేరొక రాష్ట్రం...అక్కడ పరిస్తితులు కూడా బాగున్నవి కావు...దాంతో అక్కడి ప్రజలు వెల్లువలా ఈ రాజధాని మీదకి దండెత్తే అవకాశం ఉన్నది. ఊరు పెరిగితే...పెరగటానికి వీలు లేకుండా నది ప్రక్కనే వేరొక రాష్ట్రం... దీనివల్లన నదికి అవతల ప్రక్కన పెరిగినా...ఆ ప్రాంతంల్లో సీమాంధ్రుల ప్రయోజనాలు ఏమీ ఉండవు...ఇలా మరొకసారి సీమాంధ్రుల కష్టం నదిలో కలిసిపోతుంది...       

3] విజయవాడ...[ఏలూరు నుండి గుంటూరు దాకా]"ఈ ఊరు అన్నిటికి చాలా బాగుంటుంది కదా" అని అనుకుంటున్నారా....ఇక్కడ ఉన్నంత కుళ్ళు కుల రాజకీయాలు మరెక్కడా ఉండవు... చివరికి విజయవాడకి లాభం చేకూర్చే విషయాలలో కూడా వీరు కొట్టుకుని, అది వేరొకరికి పోయ్యేట్లుగా చేస్తారుగానీ, ఆ పనిని మడుకు సక్రమంగా జరగనియ్యారు... ఇక్కడి రాజకీయ నాయకులే సరైన వారైనట్లయితే...మద్రాసు నుండి విడిపోయినప్పుడే ఇక్కడ రాజధాని ఏర్పాటులో కృషి చేసి ఉండాలిసింది... కానీ, అలా జరగలేదు. వీరికి పదవులిచ్చి, వాటితో పాటు ఇక్కడకి వచ్చే ప్రాజెక్టుల కాంట్రాక్టులు వీరికే కనుక ఇస్తే... తమ లాభం కోసం ఆ ప్రాజెక్ట్లులని మరో రాష్ట్రంలో కట్టటానికైనా వెనుదియ్యారు...ఇది ఇక్కడి రాజకీయ నాయకుల "విశాల హృదయం".    రేపు ఇక్కడ రాజధాని పెడితే, ఇక్కడికి వచ్చే ప్రాజెక్టులని పరాయి రాష్ట్రాలకి తాకేట్టేసెంత గొప్ప రాజకీయ వేత్తలున్నారు... మరొకటి, సీమాంధ్ర రాజధానిని ఇక్కడ పెట్టకుండా ఎక్కడ పెట్టినా కూడా తనంత తాను బాగుపడటానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఉన్నది... కాబట్టి, ఇక్కడ రాజధాని పెట్టి మరీ తొయ్యవలసిన పనిలేదు...రాజధానిగా లేకపోతేనే రాజకీయాలకి దూరంగా ఉండటం వలన తొందరగా మరింత అభివృద్ధి చెందుతుంది....                               

ఇప్పుడు చర్చలో ఉన్న ఈ మూడు నగరాల పరిస్థితి ఇలా ఉన్నది... కాబట్టి, నిజాయతీగా, కేంద్రం కనుక వేలకోట్లు మన కొత్త రాజధాని  కోసం ఇస్తే...వాటిని పూర్తిగా ఖర్చుపెట్టటానికి వీలున్న ప్రదేశంలోనే రాజధానిని పెట్టాలే కానీ, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలలో పెట్టి...ఆ ఊళ్ళని డిస్ట్రబ్  చెయ్యటం మంచిది కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో మన రాజధానిని ప్రక్క రాష్ట్రం వారికి ఉపయోగ పడేంత దగ్గర ఉంచటం కూడా సరైన పద్దతి కాదు...                     

అందువల్ల...సీమాంధ్రలోని ఆంధ్రలో  రాజధాని పెట్టాలంటే ప్రకాశం జిల్లాలోనూ, సీమలో పెట్టాలంటే కడప జిల్లాలో పెట్టినట్లయితే, కేంద్ర నిధులు అన్నీ ఉపయోగించే వీలు ఉన్నది... ఇతర రాష్ట్రాల దాడి ఉండదు...ఇక్కడ కొద్దిగా లోకల్ రాజకీయాలు ఉన్నప్పటికీ...బయట నుండి వచ్చి పడే వారిని నిర్దేశించే శక్తి లేనివే కాబట్టి ప్రమాదం లేదు...


సీమాంధ్ర దేశం  ....కర్టేసి ఫేస్ బుక్  

రాజకీయ పెద్దలారా ప్రజలు 
మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇప్పటికే నాశనం చేసేశారు...
ఇల్లు తగలడుతుంటే...
మీరు అంటించారు అంటే... మీరు అంటించారు అని గొడవలు పడి...
ఇల్లు తగలడే వరకు కొట్టుకున్నారు...
మీ పరస్పర ఆరోపణలని చూస్తుంటే 
జనాలకి అసహ్యం పుడుతోంది...

సీమాంద్ర జెండా ట... కర్టేసి ఫేస్ బుక్ 

ఇప్పుడున్న వాతావరణంలో... మరోసారి రాయల సీమ, ఆంధ్రలోని ఏ ప్రాంతం వారికైనా  పెట్టె బేడా సర్దుకోనే పరిస్థితి వస్తే 
అది ఉగ్రవాదానికి తెరతియ్యవచ్చును...
ఇప్పటికే పార్లమెంటులో వివక్షతకి గురైయ్యాము అన్న బాధతో 
 ఫేస్ బుక్ లో  
సీమాంధ్ర దేశం, దానికి జెండాని కూడా తయారు చేసేశారు 
మన యువత...
"ఇది ఇప్పటికి జోక్ గా తేలిగ్గా తీసిపారేసినా, 
తరవాత కాలంలో పశ్చాత్తాప పడవలసి ఉంటుంది"... 




రాజకీయ నాయకులారా కనీసం....ఇప్పటికైనా మీ రాజకీయాల గురించి కాకుండా, 
మిగిలిన రాష్ట్రం మరియు ప్రజల యొక్క అబివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కలిసికట్టుగా పనిచేసి... 
తిరిగి ప్రజలలో నమ్మకాన్ని పెంచుకుంటే మంచిది..., 
లేకపోతే "మీ వంశపారంపర ఉద్యోగాలు అంతరించి పోతాయి"....!!! 



జైహింద్





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???





17, ఫిబ్రవరి 2014, సోమవారం

ఉత్తరాది వాళ్ళా మనకు బుద్దులు చెప్పేది.?? చివరికి బిహారీ వాళ్ళు కూడానా ...

పై వార్త కర్టేసి ఈనాడు...


మొన్న జరిగిన పార్లమెంటు గొడవలో మన దేశ పార్లమెంటు పరువు పోయిందని... పాపం ఒక బిహారీ గారు, బిహారులోనే కోర్టుకెళ్ళాడుట... ఆయనేదో ఒక సోషల్ వర్కరో లేక ఒక చిరుద్యోగో అయ్యుంటే, పాపం ఏదో లోక జ్ఞానం లేక కేసు పెట్టాడని అనుకోవచ్చును. కానీ, ఆయన సాక్షాత్తూ ఒక న్యాయవాది[లాయరు]. బీహారు గొడవలు గురించి బాగా తెలియటానికి వీలున్న వృత్తి.... అయినా ఆయన గారికి, బిహారీల కన్నా కూడా మన తెలుగు వారి గొడవే ఎక్కువగా కనపడిందిట....కనీసం పేసెంజరు రైల్లొ  కూడా రెండు రూపాయల టిక్కెట్లు కొనని వాళ్ళకి, ఆంధ్రా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైనట్లు కనపడింది... అసలు బిహారులో ప్రభుత్వము, చట్టము లాంటివి ఉంటాయా... అని దేశ వాసులే ఆశ్చర్యపొయ్యెట్లుగా ఉండే బీహారులోని ఒక బిహారీ గారికి... మన పార్లమెంటు ఎంపీల భాగోతం దౌర్జన్యంగా కనపడింది...!!! బహుశా వాళ్ళలాగా గొడ్డళ్ళు, కత్తులూ, తుపాకులూ వాడలేదని, అందుకనే "దౌర్జన్యం యొక్క పరువు పోయిందని" ఆయనగారి ఉద్దేశ్యం అయ్యుంటుంది...!!! 

చట్టాలని చేసేదే మేము, మాకు ఏ చట్టం వర్తించదు... అన్నట్లు ప్రవర్తిస్తారు ఉత్తరదేశీయులు. వీరు వచ్చి మనవారికి నీతులు చెప్పే అర్హత ఉన్నదా...? అందులోనూ బీహారీలు అంటేనే చట్టాన్ని ఎంత బాగా గౌరవిస్తారో భారతీయులందరికీ తెలిసిందే... ఒకప్పుడు, బీహారులో ఒక ప్రకృతి విలయం సంభవిస్తే, మన కేంద్రం స్పందించే లోపలే, అక్కడి కాంగ్రెస్సు ముఖ్యమంత్రి చైనా వారి సహాయం కోరాడు... ఇదీ బీహారీయుల దేశ భక్తి...చివరికి వీళ్ళా మన దక్షిణ దేశం వారికి నీతులు చెప్పేది...!!!

అందుకనే అనిపిస్తుంది, ఇదంతా హిందీ మరియూ ఉత్తర దేశం వారి కుట్ర అని. ఎందుకంటే; జగన్, గాలి జనార్ధన్ రెడ్డీ, రాజా, కనిమోళీ లాంటి వారి ఆర్ధిక నేరాలని... ఉత్తర దేశ నాయకులు/ప్రజల అవినీతితో పోలిస్తే...వారి ముందు మన వారు చిన్న పిల్లలు లాంటి వారుగా కనపడతారు. శాంతి భద్రతల విషయంలోనూ మనకంటే వెయ్యాకులు ఎక్కువ చదివిన వారే... ఉత్తర దేశంతో పోలిస్తే, దక్షిణ దేశం దేవలోకం లాంటిదే... అయినప్పటికీ, దక్షిణ దేశం వారిని వేలెత్తి చూపించి....తామెంతో మహా పతివ్రతలైనట్లు మహ ఫోజు కొడతారు ఈ హిందీ బానిసలు. ఎన్నో వేల కోట్లు అడ్డగోలుగా సంపాయించుకుంటున్న ఉత్తరాదివారు...తమలాంటి పనే దక్షిణాది నుండి ఎవరైనా చేస్తే మాత్రం వారికి చట్టం, రాజ్యాంగం రుచి చూపిస్తారు. తమదాకా వస్తే...సాధ్యమైనంతవరకు చట్టాన్ని పట్టించుకోరు... కుదరకపోతే, చట్టాన్నే మార్చివేస్తారు... ఇక దక్షిణ దేశం నుండీ ఎవరైనా ఎదిగితే వీరికి పడదు. వారిని ఎదో విధంగా పడదొయ్యాలనే చూస్తారు.  

దక్షిణాది వారిని పడదోసి వారు పైకి రావాలనే ఉద్దేశ్యం, ఉత్తరాది వారి ప్రతీ కదలికలోను కనపడుతుంది. ముఖ్యమైన పరిశ్రమలన్నీ వారివైపే పెట్టుకున్నారు. అలాంటి పరిశ్రమలు మనకి రాకుండా మన వారి చేతే నాటకాలు ఆడిస్తారు. అలా వారికి మడుగులు ఒత్తుతూ ఉన్న దక్షినాదివారినే వారు రాజకీయాలలో పైకి రానిస్తారు. ఈ విషయంలో... దక్షిణాదిలో మిగిలిన వారి కన్నా తమిళులు తెలివైన వారు. వీరు కూడా హిందీ వారి ఆధిపత్యాన్ని ముందరగా ఎదిరించినా, అది కుదరదని గ్రహించి... లౌక్యంగా లొంగి నట్లుగా కనపడి...వారి పనులు వారు చేసుకుని, మిగిలిన వారికన్నా పైకి వచ్చారు... అలా దేశానికి పనికొచ్చే వస్తువుల పరిశ్రమలని సాధించుకున్నారు. అయితే, వీరికి కూడా హిందీవారి  ఆధిపత్య  జాడ్యం లాంటిది ఉండటం వల్లనే వీరు హిందీ వారితో స్నేహం చెయ్యగలిగారు.

అలా  చెన్నయి, బెంగళూరు, కొచ్చిన్ అభివృద్ధి పధంలోనికి నడుస్తుంటే...అవి ఎలాగు బాగుపడుతున్నాయి... కానీ, దానిలో భాగాసామ్యం అక్కడి వారి కన్నా బయట నుండి వచ్చిన రాజస్తాన్, బిహార్, యు.పీ., గుజరాత్ వారికి పనికొచ్చేట్లుగా తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు మన ఉత్తరాది వారు. దీనికి చిన్న ఉదాహరణ....మనం ఎన్ని నాళ్ళుగా మొత్తుకున్నా మనకు వెయ్యని రైళ్ళను.... వారి ప్రాంతం యువతకి పనికొచ్చేట్లుగా రైళ్ళని వేసి, ఆక్కడి వారు తేలిగ్గా దక్షిణాదిన అభివృద్ధి చెందిన ప్రాంతానికి చేరుకునేట్లుగా తెలివిగా రైళ్ళని వేస్తారు....వేస్తున్నారు... ఎక్కువ భాగం రైళ్ళు, ఉత్తరాది వెనుకబడిన ప్రాంతాల నుండి చెన్నయికి, బెంగళూరుకి, ఎర్నాకుళానికి[కొచ్చిన్] మరియు యశ్వంత్‌పూర్ [బెంగళూరు]కి ఉంటాయి. అదే, మన వెనుకబడిన ప్రాంతాల నుండి ముంబాయి నుండి కాన్పూర్ వరకు ఉన్న అభివృద్ధి చెందిన కారిడార్లకి రైళ్ళు వేస్తారా...?? వెయ్యమని అడిగినా కూడా వెయ్యరు. ఎందుకంటే, వారి యువతకి దక్షిణాది యువత కాంపిటిషన్ వస్తుంది కదా.... ఇలా ఉంటాయి ఉత్తరాది కుళ్ళు రాజకీయాలు.

ఈ విషయంలో రాజకీయ పార్టీలలో అది కాంగ్రేసు అయినా మరే ఉత్తరాది పార్టీలు అయినా ఒకటే... చివరికి బిజెపి అయినా... వీరందరికీ కావాలిసింది హిందీ'స్తానే కానీ, హిందూస్తాన్ కాదు..... అందుకని, మన ప్రాంతపు రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన ప్రాంతాలకి జరుగుతున్నా అన్యాయాన్ని, వివక్షతని గమనించి మెలగాలి. మనమంటే లెక్కలేని ఆ ఉత్తరాది వారిని న్యాయం అడిగితే... వారేమి చెపుతారు... వారికేది లాభమో అదే చెపుతారు. ఇక దక్షిణాన్నే ఉన్న ఆషాడ భూతులైన కొందరు ఇతర భాషల వారికి కావాలిసింది కూడా మనం నాశనం అవటమే...కారణం...హైదరాబాదు నగరం కూడా మిగిలిన నగరాలలాగానే అబివృద్ధి వెలుగులనివ్వటమే... అందుకనే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని వ్యంగంగానే అందరు చూస్తున్నారే కానీ, అందులో నిజాయతీ లేదు. మన దిక్కుమాలిన నాయకులకేమో కాళ్ళు పట్టుకుని పదవి సంపాయించటం...కాంట్రాక్టులు సంపాయించటం తప్ప, ఉత్తరాది వారి వెకిలి నవ్వుల, దక్షిణాది ఆషాడభూతుల  కుళ్ళు రాజకీయం తెలియని మూర్ఖులు.  వీరికల్లా ఉన్నది విపరీత స్వార్ధం అంతే....దీనికి వీరు... రాష్ట్ర ప్రజలనే తాకట్టు పెట్టేస్తారు....

ఇక్కడ మన నాయకులనో లేక అవినీతి పరులనో సపోర్టు చేస్తున్నామని కాదు. ఒకే నేరానికి ఉత్తరాది వారికో న్యాయం, దక్షినాది వారికో న్యాయం కనపడుతుంది. దీనికి ఉదాహరణగా రాజానో, లేక గాలినో ఉదాహరణ తీసుకోవలసిన పనిలేదు.... చిన్న రైలు సంఘటనని తీసుకుంటే చాలు... టిక్కెట్టు లేకుండా వందల కొద్ది బీహారీలు రిజర్వేషన్ బోగిలలోనికి ఎక్కితే... గోడవై తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో  వారిని అదుపులోనికి తీసుకున్నారు... వారిలో కొందరు ఫోన్ ద్వారా "పై వారిని" సంప్రదించారు... అంతే...వారిని తక్షణం విడిచి పెట్టమని సాక్షాత్తు రైల్వే మంత్రి ఫోన్ చేసి మరి విడిపించే ఏర్పాటు చేసేశాడు. ఇలా మన వారికి ఉత్తరాదిన న్యాయం  జరిగే అవకాశం ఉన్నదా....???

"లేదు" అని దేశం అంతా వినిపించెట్లుగా అరచి చెప్పే సంఘటన మొన్నీ మధ్యన జరిగింది..... అదే ఉత్తరాఖండ్ వరదలు.... వాటిలో చిక్కుకుని మనవారు ఎన్నో వేలమంది ఉంటే...  మన వారిని పట్టుకుని బాధలో ఉన్నారని కూడా చూడకుండా, బూతులు తిడుతూ... "మీరు మా ప్రాంతానికి ఎందుకొచ్చారు...?? మీ ఖర్మ, మీ చావులు మీరు చావండి" అని ఎన్నో వేలమంది సాక్ష్యంగా నిర్భయంగా నిర్లక్ష్యంగా వారు  అనటం చూస్తే.... మనం అంటే ఉత్తరాది వారికి ఎంత గౌరవమో తెలుస్తుంది....ఇక అక్కడి ప్రజలు ఎన్నివిధాల మన వారిని దోచారో ఆ దేవుడికే తెలియాలి....అక్కడివారే కాకుండా సైన్యానికి చెందిన కొందరు వారు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మన వారు చెపుతుంటే...."అసలు మనని ఈ దేశం వారిగా చూస్తున్నారా ఈ ఉత్తరాది మూఢులు...?" అని అనుమానం రాక తప్పదు...

ఉత్తరాది వారు రాజకీయంగా అలా ఉంటే ...ఇక అక్కడి పారిశ్రామిక వేత్తలకి కూడా మనమంటే లోకువే... వారికి కావాలిసింది దక్షిణాది నుండి వినియోగదారులే కానీ, ఉద్యోగులు కాదు. ఒక వేళ ఉద్యోగాలు ఇచ్చినా... అవి షాప్ కీపింగ్ పనులే... రిలయన్సు అంబానిలకి కావాలిసింది మన గేస్ మాత్రమే, వారు స్థాపించే పరిశ్రమ ఎదో... ఇక్కడే గేస్ దొరికే చోటే పెట్టచ్చు కదా... పెట్టారు... ఎందుకంటే, అందులో ఉత్తరాది వారికి ఎక్కువ ఉద్యోగాలు రావు కదా... ఈ విషయంలో టాటా వారి మనస్సు కూడా కఠినమే...టాటా నానోని బెంగాలు వారు పొమ్మన్నా కూడా వారి మీద కొద్దిగా కూడా కోపం రాలేదు...ఆ ప్రాజెక్టు మా రాష్ట్రంలో పెట్టండి మహాప్రభో అని మన రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంత మొత్తుకున్నా వినకుండా తీసుకెళ్ళి గుజరాత్ లో పెట్టారు... ఎంతైనా వారు వారు భాయి భాయి కదా... వీరే కాదు బజాజ్, జిందాల్ లాంటి మొదలైన వారికి... మన వనరులు మాత్రమే కావాలి కానీ, మన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం మనసొప్పదు.. వీరు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించబడే పెద్ద  పరిశ్రమలని మన ప్రాంతంలో నెలకొల్పరు...ఒక వేళా ఏదైనా చిన్నా చితకా పరిశ్రమలు వారు స్థాపిస్తే, వారి రాష్ట్రం వారిని తెప్పించుకుని మరీ పెడతారు. ఇంతెందుకు, మన రాష్ట్రంలో తిండి తప్పితే, మిగిలిన వస్తువులు 90 శాతం దాకా బయటి రాష్ట్రాల నుండి వస్తున్నాయి అంటే... ఇంకా చెప్పేదేమున్నది. చివరికి హోళీకి వాడే రంగులు, రాకిలు, దీపావళి టపాసులు, చిన్న పిల్లలు ఆడుకునే రంగు కాయితాలు కూడా బయట రాష్ట్రం నుండి వస్తుంటే...మనం దేనిలో అభివృద్ధి చెందినట్లు...?? 

ఇకపోతే, ఉత్తరాది ప్రజల గురించి చెప్పాలిసిన పనిలేదు... వారిలో వారు ఎంత స్నేహంగా ఉంటారు. అయితే దక్షినాది వారంటే మాత్రం చులకనే.... వీరికి మనవారంటే ఎంత చులకనంటే... ఒకసారి విజయనగరం బస్‌స్టేండులో ఒక హిందీ వాడు గొణుక్కుంటున్నాదు... "క్యా లోగ్ హై, ఇస్ లోగ్ కో హిందీ భి నహి జాంతా హై"....కేసే దేశ్ వాసీ హై.... అని. ఇంతకీ వాడి గోలేమిటంటే... మన బస్సుల మీద అంతా తెలుగులోనే ఉన్నది. వాడు అడగబోతే... సామాన్యులకి హిందీ రాదు. వాడి అవసరం కోసం మన వూరు వచ్చి... మన వాళ్ళు వాడి భాషలో మాట్లాడటం లేదు అనే అహంకారాన్ని చూపించాడు. అంటే, దిక్కుమాలిన హిందీ రాకపోతే భారతీయులు కానట్లనా...??? ఆ హిందీ అహంకారికి సమాధానంగా ఒక ప్రయాణీకుడు అన్నాడు..."టెర్రరిస్టులు అందరు హిందీలోనే మాట్లాడతారు కానీ, తెలుగులోనూ, కన్నడంలోనూ మాట్లాడరుగా"  అని.

ఇక పార్లమెంటు గోడవ దగ్గరికొస్తే...నిజంగా చిత్త శుద్ధి వుంటే తెలంగాణా పార్టీల వారు, సీమాంధ్ర పార్టీల వారు, కొందరు ప్రాంతీయంగా అనుభవం ఉన్నవారు[మేథావులు కాదు] ఒక చోట కూర్చుని, ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలో చక్కటి నిర్ణయం చేసుకొంటే బాగుంటుంది కానీ....ఎవరు కొట్టుకొని క్రిదపడితే మింగుదామా అనే అడవి నక్కలులాగా ఉన్న వారి దగ్గరికా... మనలో మనం కొట్టుకొని న్యాయానికి వెళ్ళేది...???

కాబట్టి, అలాంటి చోట మన తెలుగు నాయకులు వీధిన  పడి గొడవ చెయ్యకుండా,  మన సమస్యని పద్దతిగా పరిష్కరించుకున్నట్లయితే, పాకిస్తాన్ వారి నుండి యుద్ద  నీతులు, చైనా వారి నుండి ప్రజాసామ్యం, అమెరికా వారి నుండి స్వేచ్చ, యురప్పు వారి నుండి చట్టాల గురించి, చివరికి... దేశానికే అపకీర్తి కిరీట ధారులైన బిహారీల నుండి కీర్తి, పరువు మర్యాదల గురించి చెప్పించుకోవలసిన ఖర్మ పట్టదు కదా...!!!  




జై హింద్ 



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???