LOCAL WEATHER

8, నవంబర్ 2013, శుక్రవారం

రాష్ట్ర విభజన అంటే ఎందుకు ఇన్ని భయాందోళనలు.....?!?!

రాష్ట్ర విభజన అందరు ఎదో భయంకరమైనదేదో జరిగిపోతున్నట్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రాష్ట్ర విభజన అంటే దేశం నుండి విడిపోయి వేరే దేశంగా మారటం కాదుకదా...!!! మరి ఎందుకు ఈ ఆందోళనలు....?? దీనికి భారత దేశ విభజన సమయంలో ఏర్పడిన గాయమే కారణం.... దీనికి దానికి ఏమిటి సంబంధం... అంటారా.... అప్పుడు భారత్ పాకిస్తానులుగా విడిపోయినప్పుడు ఏర్పడిన ఆందోళన కరమైన వాతావరణాన్ని కొందరు నాయకులు కల్పిస్తున్నారు. అప్పట్లో ఒక దేశం నుండి మరో దేశానికి కనపడిన వాహనాన్ని ఎక్కి పారిపోయినట్లుగా పోవాలి అని అనిపించే విధంగా కొందరు తమ స్వార్ధం కోసం దుర్మార్గమైన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ కారణం చేతనే విభజనలో హైదరాబాదు కేంద్ర బిందువు అయ్యింది... 

ఇప్పటి దాకా జరిగిన ఉద్యమ క్రమంలో కొందరు దుష్ట శక్తుల ప్రాపకంతో ... బయట వారిని తరిమేస్తాం.... మా నీళ్ళని క్రింద వారు దోచేస్తున్నారు.... వారు కుక్కలు.... మెడలు నరకాలి.... తలలు కొయ్యాలి... మా మాట ఒప్పుకోకపోతే  తీవ్ర పరిణామాలు ఉంటాయి.... మాది మాకొచ్చిన తరవాత ఇక్కడ బయటవారినెవ్వరిని ఉండనియ్యం.... పండక్కి వెళ్ళినవారు తిరిగి రారు....మా చేతికి వచ్చాక అంతుచూస్తాం...ఒక్క చుక్క నీరు వెళ్ళనియ్యం...నదులలో గోడలు కట్టేస్తాం...[ఇలాంటి దుడుకు మాటల వలన నమ్మకం పోయి నీళ్ళ పంపిణి కూడా ఒక సమస్య అయింది....]ఇలా పలు విధాలుగా చిన్న గల్లి నాయకుల దగ్గర నుండి... జాతీయ పార్టికి చెందిన నాయకులదాకా ప్రేలనలు పేలి,  సామాన్య ప్రజలందరినీ భయభ్రాంతులని చేశారు.  వీరి వలన ఇప్పటికి కూడా ప్రశాంతంగానే బ్రతుకుతున్న "ఇతరుల రక్షణ కోసం ఒక చట్టం చెయ్యాలి"  అని ప్రభుత్వమే ఆలోచనలో పడాలిసి వచ్చింది...!!!

ఇదే క్రమంలో రాజ్యాంగాన్ని పూర్తిగా స్కేన్ చెసినా దొరకని మాటలని వాడుతూ  ఈ నేతలూ... కొందరు అతితెలివిగల మేధావులూ.... చదువురాని ప్రజల లాగా మాట్లాడుతున్నారు. అదే మీ ప్రాంతం... మా ప్రాంతం... సెటిలర్స్. వలసదారులు... అంటే ఎవరూ... ఇలాంటి మాటలని మన భారత ప్రభుత్వం సహిస్తుందా...??? రాజ్యాంగం అమోదించినదా....??? ఎదో కొన్ని ప్రాంతాలకి రక్షణ కల్పించే నిమిత్తం కొన్ని ఆర్టికల్స్‌ని రాజ్యాంగంలో పెట్టినంత మాత్రాన... ఆ ఆర్టికల్స్ రక్షణ ఉన్న ప్రదేశాలలోనూ...లేని ప్రదేశాలలోనూ భారతీయ పౌరులందరూ రాజ్యాంగం ముందర సమానులే... వారికి ఇచ్చింది ఒకే రకమైన పౌరసత్వం.... అదే భారతీయ పౌరసత్వం మాత్రమే.....భారత దేశంలొ బానిసత్వపు పౌరసత్వం...అదే సెకండు సిటిజన్ షిప్పు  అనేది లేదు కదా ....!?!?!

రాష్ట్ర విభజన అంటే దేశం నుండి విడిపోవటం కాదు. స్వంత రాజ్యాంగం ఉండటం కాదు. కేవలం  అక్కడి ప్రభుత్వం నుండి వచ్చే లాభాలని లోకల్ గా ఉన్న వారికి అందివ్వటానికి మాత్రమే... ఆ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఇతరులకి రావు. అంతే.. ఇక మిగిలినవి అన్నీ... దేశంలోని ప్రజలందరితో పాటు సమానంగా అనుభవించాలిసిందే కానీ.... లోకల్ గా ఉండే వారు వేరొక బయట నుండి వచ్చిన రాష్ట్ర ప్రజల కన్నా అతీతులేమీ కాదు.. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల వారికి సమానమే...అసలు ఎవరు ఎక్కడికి కదలకుండా ఉంటే దేశంలో నగరాలు అభివృద్ధి చెందవు... దేశమూ అభివృద్ధి చెందదు.

ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా, దేశాన్ని పరిపాలనకో లేక స్వార్ధ నాయకుల పదవులకోసమో దేని కోసమైనా ముక్కలు చెయ్య వచ్చునేమోగానీ... ప్రజలని విభజించే హక్కుని రాజ్యాంగం ఎవ్వరికీ ఇవ్వలేదు.  ఫలానా వారు ఇక్కడ ఉండచ్చు... లేదా వెళ్లిపోవాలి అనే మాటలు మాట్లాడుతున్న వారికి రాజ్యాంగం శక్తి ఏమిటో తెలుసా...?  లేక ఎవరు ఏమి చేస్తారు మేమే మొనార్కులం అని అనుకుంటున్నారా...  ఒకడేమో పొమ్మంటాడు. మరొకడు అభయ హస్తం ఇస్తాడు... వీళ్ళెవరు పోమ్మంటానికి... లేక అభయం ఇవ్వటానికి... అందరిని కాపాడేందుకు చట్టాలున్నాయి.. దేశం ఉన్నది... రాజ్యాంగం ఉన్నది... వీళ్ళు వాటికన్నా అతీతులా....??? ఇంత ఆందోళనకరంగా విడిపోయేటప్పుడు రాష్ట్ర సరిహద్దుల గురించి, ఉద్యోగ వాటాల గురించి... నీటి వాడకం గురించి ఏవిధమైన సానుకూల వాతావరణంలో చర్చించగలరు...? ఏ విధంగా పరస్పర నమ్మకాన్ని పొందగలరు...?? 

మొన్నటికి మొన్న, ముంబాయిలో ఓ పార్టీవారు.... వేరొక రాష్ట్రంవారు రావటాన్ని వ్యతిరేకించటం కోసమే పుట్టిని ఈ పార్టి వారు... బయట నుండి ముంబాయికి వచ్చినవారిని తరిమిగోట్టే ప్రయత్నం చేశారు...వారి పార్టీ పుట్టుకే రాజ్యంగా విరుద్దం... వారు రాజ్యాంగం ప్రకారం ఎలా నడుచుకుంటారు...??ముంబాయి అనే మత్యకారుల పల్లె... బాంబేగా మారటానికి మరాఠిలు మాత్రమే కారణం కాదు అన్న సంగతి వీరికి తెలియదా..??? తెలుసు... కానీ,  వీరు లోకల్ అన్న ఫీలింగుతో తమ  ప్రతాపం చూపించారు... వీరు తమ రాష్ట్రం దాటితే ఎందుకు పనికి రారు.  వీరికి చట్టం రుచి చూపించటంతో వెనక్కి తగ్గారు.

కేవలం ముంబాయే కాదు దేశంలోని నగరాలే కాదు... ప్రపంచంలో ఏ పెద్ద నగరం అయినా నగరంగా అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ప్రాంతీయులవల్లన మాత్రమే కుదరదు. ప్రపంచం మానవ సంఘటితంతోనే అది సాధ్యం. ఇది తెలుసుకోకుండా తమ ప్రాంతం అభివృద్ధి చెందగానే... అప్పటిదాకా ఇటుకలు పేర్చిన వారిని పరాయి వారుగా చూడటం కన్నా కృతఘ్నత ఇంకోటి లేదు. అందుకనే,  దశాబ్ద కాలం క్రిందటే హాంకాంగు చైనాలో కలిసినా దానిని అలానే ఉంచారు మన నిరంకుశ చైనా వారు కూడా.... ఎందుకంటే అందులోని అభివృద్ధికి అనేక దేశాల వారికి పాత్ర ఉన్నది... దానిని కనుక చైనా పద్దతిలో కెలికితే అది విచ్చిన్నం అవుతుందన్న సంగతి మన నిరంకుశ చైనా వారికి తెలుసు. "ఆ నష్టం కూడా వారికే" అన్న సంగతి తెలుసును... అందుకనే ఇచ్చిన మాటని నిలుపుకుంటున్నారు. 

ఇక విషయానికి వస్తే.... ఆంద్ర రాష్ట్ర విభజన సమయంలో  సెటిలర్స్ అనే మాటని తెలిసో తెలియకో విరివిగా అందరూ వాడేస్తున్నారు. ఎలాగు వాడుతున్నారు కదా అని ఏకంగా "సెటిలర్స్ ఫోరం" అని ఒక సంఘమే ఏర్పడిపోయింది. ఈ పేరు దేశంలోని ప్రజలని ఉద్దేశించి ఉచ్చరించటానికే రాజ్యాంగం అనుమతించదు... అలాంటిది ఒక సంఘమే ఏర్పడి పోయింది... ఇది దేశ దుర్గతి. ఎవడో ఎదో అన్నాడని ఆ పేరుతోనే సంఘం పెట్టుకోటానికి... ఈ సంఘం పెద్దలు ఏమి చదువుకోని వారేమి కాదు. కాకపొతే వారికి భద్రత లేకపోవటం వలన... అలా వారికి వారుగా సెకండ్ సిటిజన్ షిప్పుని పుచ్చేసుకున్నారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ఒక్క రాజకీయ దురంధర దుర్మార్గులు లేకపొగా...వారిని అలాగే పిలుస్తున్నారు. విచిత్రం ఏమంటే ఇలా పిలిపించుకునే వారందరూ రెండు మూడు జిల్లాల నుండి వచ్చిన ఈ రాష్ట్రం వారే కానీ బయట రాష్ట్రం వారు కాదు. ఆ బయట రాష్ట్రం వారిని కూడా సెటిలర్స్ అని పిలవటం లేదు ... కాబట్టి వీరేమి చేస్తారు.. చుట్టూ ఉన్న పరిస్థితులకి లొంగక...!!! 

ఇంతకీ "సెటిలర్స్" అంటే అలా మాట్లాడే ఏ నాయకుడికైనా, రాజకీయ నాయకుడికైనా అర్ధం తెలుసా...? ఏ అర్ధంతో [లింకు నొక్కండి] వాడతారో తెలుసా...???  [ మాట అర్ధం కన్నా... ఏ భావంతో ఆ మాట వాడుతున్నారురొ చూస్తే... ఆ మాటని వాడే వారందరూ శిక్షార్హులే.....] ఒకే భాష వారు, రెండు మూడు జిల్లాలు అవతల నుండి వచ్చినవారిని పట్టుకొని "సెటిలర్స్" అనే మాటని వాడటం ఎంతవరకూ సమంజసం.  ఒకే దేశంలో నివసించే వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళగానే సేటిలర్స్ అయిపోతారా....??? ఆ మాటకొస్తే, ఎవరిని తీసుకున్నా వెనక్కి రెండు మూడు తరాలు చూస్తే ఎక్కడి నుండో తరలివచ్చిన వారే....!!! అలా రెండు జిల్లాల దాటి వచ్చిన వారే సెటిలర్స్ అవుతే మరి హైదరాబాదులో ఉన్న భిన్న దేశాల సంస్కృతులు కలిగిన వారిని ఏమనాలి... ఏమిటీ సంకుచిత్వం... కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేక రాజకీయ పదవుల కోసమో, లేక కోట్లు గడించే అవకాశాలు ఉన్న కాంట్రాక్టుల కోసం సాటి భారతీయులని రెండో తరగతి సిటిజన్లుగా గుర్తించటం ఎంతవరకూ సమంజసం?? 

ఇలాంటివి దేశంలో ఎన్నో... కొన్ని టీవీలు పేపర్ల దాకా వస్తాయి... చాలా వరకు అన్ని సమాజాలలో ఇటువంటి వివక్షతలు నడుస్తూనే ఉన్నాయి. మతపరమైనవి, కులపరమైన వారికంటే ఇలాంటి వితండ వాదుల వల్లనే దేశానికి ప్రమాదం. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే వారు దేశంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతికే వీలున్నప్పుడే వారికి దేశ స్వేచ్చ మీద నమ్మకం ఉండి... దేశాన్ని గౌరవిస్తారు. ఎలాంటి హక్కులు లేకుండా... జిల్లా దాటంగానే వివక్షత మొదలైతే ప్రజలలో దేశభక్తి ఉండటానికి అవకాశం ఎక్కడున్నది...?

ఇక అసలు విషయానికి వస్తే....  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు భయపడటం వల్లనే ఈ విభజన వివాదాస్పదం అయినది. ఏదేని రాష్ట్రం విడిపోతే పొయ్యేది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే.... కానీ, ఇక్కడ కొందరు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మాట్లాడటం....వారిని సమర్ధించేవారే కానీ, వారించే వారు కరువు అవ్వటంతో మరియు  ఈ విభజన ఏదో దేశం విడిపోతుందన్న స్థాయికి దిగజారటంతో  ప్రజలలో అభద్రతా భావం ఏర్పడింది. ,  

కాబట్టి, 
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 
ఇటువంటి విషయాలలో శ్రద్ద తీసుకొని కఠినంగా వ్యవహరించి,
 ఇలాంటి వివక్షత కలిగినవారికి దేశం పట్ల భయం కలిగించి
 తగిన శిక్షలు వెయ్యటం ద్వారా
జిల్లాల భక్తీ లేక రాష్ట్రాల భక్తీ ముదరకుండా చేసి,
 దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల భయాందోళనలు పోగొట్టి... 
వారిలో దేశం పట్ల భక్తీ ఏర్పడేట్లు చెయ్యాలి. 
అలా చేసి, 
ప్రజల భయాన్ని తొలగిస్తే 
ఒక రాష్ట్రం ఏమిటి... పది రాష్ట్రాలు ఏర్పడినా ఎవరు కలత చెందరు.
లేకపోతే,
 పాతకాలపు సంస్థానాల వాసనలు తిరిగి మొదలై 
దేశ సమగ్రతకి, భద్రతకి ముప్పు తెచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. 





జైహింద్ 





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???






--------------------------------------------------------------------------------------------------------------------


[మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కి ఎడం ప్రక్కకి స్క్రోల్ చెయ్యండి ఫిలిప్పైన్స్  తుఫాను శాటిలైట్ ఫోటో కనపడుతుంది] 
బహుశా... దీని వలన మనకు కొద్ది రోజులలో చలి పెరిగే అవకాశం ఉన్నది.

కర్టేసి:accuweather.com
--------------------------------------------------------------------------------------------------------------------


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి