LOCAL WEATHER

11, జులై 2013, గురువారం

ఏది నాగరిక భాష....??? వావి వరుసలకి పేరే పెట్టుకోలేనిదా....!!!!!!

మాది నాగరిక భాష, మాది నాగరిక భాష అని రకరకాల భాషల వాళ్ళు గప్పాలు కొట్టుకుంటున్నారు..... మరి మానవ భాషలొ ఆ "నాగరికం" అంటే ఏమిటో తెలియదు......కానీ, మానవుల మధ్య  ఒకరి భావాన్ని మరొకరికి తెలియచేసే ముఖ్యమైన మాధ్యమం అయిన "భాషలో", మానవుల మధ్య వావి వరుసలు తెలియచేసే మానవ సంబంధాల్ని నిర్ధారించుకోలేక, వాటికి పేరే పెట్టలేని భాషలు అనేకం "నాగరిక భాషలుగా" చలామణి అవుతున్నాయి.

అయితే, ప్రపంచ నాగరీకులేకాదు, కొంతమంది తెలుగువారి గుర్తింపు లేని.......మన భాషలో.... అంటే తెలుగులో.......దరిదాపుల ప్రతీ మానవ సంబంధానికీ ఓ గుర్తింపు పదం ఉన్నది....... ఏదో కొద్ది సంబందాలకి ఒకే పేరు పెట్టినప్పటికీ.........పిలుపులలో గౌరవం ద్వనించేట్లుగా చేసి విభజన చూపింది. తెలుగులొ ఆడవారికే ఎక్కువ గుర్తింపునిచ్చారు....ఉదాహరణకి... "అత్తగారింటికి వెళ్ళాను" అని చెపుతారే కానీ, మామగారి పేరెత్తరు ఆయనెంతటి ఆఫీసరైనా సరే...అలాగే బంధుత్వాల పేర్లలో మొగ వారికన్నా...ఆడవారి గుర్తింపే ఒకింత మొగ్గటం కనపడుతుంది......ఒక్క బాబాయ్.....మామయ్యలు తప్ప...........

తరవాత, అన్నదమ్ముల పిల్లలు ఒకరికొకరు తమ బంధం  చెప్పుకున్నప్పుడు  "వేలువిడిచిన" అని వాడుకలో ఉండేది.....కానీ, ఇప్పుడు దానినే కజిన్ అని వాడుతున్నారు.  అయితే ఈ "వేలువిడిచిన" అనేదానికి కాస్త విస్తృతమైన అర్ధమే ఉన్నట్లు కనపడుతుంది. కేవలం అన్నదమ్ముల పిల్లల మధ్య ఉన్న బంధాన్నే కాకుండా, దూరపు వరుస అయిన చుట్టరికాన్ని కూడా చెప్పుకునేప్పుడు దీనిని వాడతారు. ఉదాహరణకి వేలు విడిచిన మామ అని అంటారు. అంటే అతడు బీరకాయపీచు చుట్టరికం ద్వారా మామయ్యా అన్నమాట. 
  

మొగవారి  రూపాలు......

1]ముత్తాత, తాత, తండ్రి/నాన్న, పెదనాన్న, బాబాయి, 
2]మొగుడు/భర్త, 
3]మేనమామ[అమ్మ సోదరుదు], మామయ్య[మేనత్త మొగుడు], 
4]మామగారు[భార్యకి/భర్తకి  తండ్రి], వియ్యంకుడు[కొడుకు/కూతురుకి పిల్లా/పిల్లాడినిచ్చినాయన],
5]అల్లుడు,  మరిది[మొగుడి తమ్ముడు], బావగారు[సోదరి భర్త], మరిదిగారు[చెల్లెలు మొగుడు...అక్కకి ]  
6]బావ[అత్త/మామ కొడుకు], , బావ మరిది[భార్య సోదరుడు], అన్నయ్య గారు[భర్త సోదరి మొగుడు],
7]అన్నయ్య,  తమ్ముడు, తోడల్లుడు[అక్క చెళ్ళెళ్ళ భర్తలు],
8]పెళ్ళి కొడుకు,
9]కొడుకు, మేనల్లుడు[సోదరి కొడుకు], 
10]మనవడు, ముని మనవడు,   

ఆడవారి  స్వరూపాలు...

1]ముత్తవ్వ, బామ్మ/నాన్నమ్మ, అమ్మమ్మ, తల్లి/అమ్మ, అమ్మక్కయ్య/పెద్దమ్మ, పిన్ని/చిన్నమ్మ,   
2]పెళ్ళాం/భార్య, సవితి[బహు భార్యలలో ఒకరికొకరు], సవితి తల్లి[తండ్రి యొక్క మరో భార్య], 
3]మేనత్త[నాన్న సోదరి], అత్తయ్య[మేనమామ భార్య],
4]అత్తగారు[భార్యకి/భర్తకి తల్లి], వియ్యపురాలు[కూతురుకి/కొడుకుకి పిల్లాడు/పిల్లని ఇచ్చినావిడ] 
5]కూతురు, వదినగారు[భార్య అక్కయ్య], 
6] అక్కయ్య, చెల్లెలు, తోడి కోడళ్ళు[అన్నదమ్ముల భార్యలు],  ఆడ బిడ్డ[భర్త సోదరి], 
7] వదిన[అన్నయ్య భార్య],  మరదలు[భార్య చెల్లెలు/మామ కూతురు/తమ్ముడి భార్య], 
8]పెళ్ళి కూతురు, 
9]కోడలు,  మేన కోడలు[సోదరి కూతురు],  
10]మనవరాలు, ముని మనవరాలు.   

పైన ఉన్న సంబంధాల పేర్లే కాకుండా.....అవ్వ, మామ్మ, దొడ్డమ్మ, కక్కి, పెత్తండ్రి, పినతండ్రి, పెత్తల్లి, పినతల్లి, షడ్డకుడు[తోడల్లుడు] లాంటివి...... ప్రాంతాల బట్టీ వాడుకలో ఉన్న పదాలు కూడా తెలుగులో అనేకం....... 

తెలుగు ఈ సంబంధాల మధ్య కొన్ని విచిత్రమైన విభజనలు చేసింది....కొన్నిటికి రెండక్షరాలు మార్చటం వల్లా, మరికొన్నిటికి "గౌరవం" చేర్చటం ద్వారా ఒకేలాగా కనపడే బంధుత్వాన్ని దూరం మరియూ దగ్గర అనుబంధంగా సూచించబడింది....ఉదాహరణకి అత్తయ్య అంటే అమ్మ సోదరుడి భార్య, మేనత్త అంటే మా ఆత్తమ్మ అని అనిపించేట్లుగా....తండ్రి సోదరిని పిలవటం; అత్తగారు అని గౌరవం ఇచ్చి పిల్లా/పిల్లాడిని ఇచ్చిన ఆవిడకి గౌరవం ఇస్తున్నట్లే కనపడినా...ఆ బంధాన్ని కొద్దిగా దూరం ఉండటం మంచిదేమో అని సూచించటం....మన తెలుగులోనే ఉన్నది. 

అలాగే,  మేనమామ...అంటే తల్లి సోదరుడిగా అతిదగ్గరున్న అనుబంధాన్నిచ్చి, మామయ్య అని మేనత్త మొగుడిని కొంచం దూరంలో పెట్టింది మన తెలుగు. ఇక పిల్లా/పిల్లాడిని ఇచ్చిన ఆయనను మామగారు అని గౌరవం అనే సంకెళ్ళు వేసి, పెద్దమనిషిగా చేసేసింది తెలుగు భాష. అదేవిధంగా, అత్త కొడుకైన బావని చనువిచ్చి..... దగ్గరివాడిగానూ, అక్క మొగుడైన వానిని బావగారుగా చేసి......అంత చనువు పనికిరాదనే హెచ్చరికని తెలియ చేసింది. వరుసకి అన్నయ్య అయినవారికి కూడా "గారు" అనే గౌరవం ఇచ్చి కట్టడి చేసింది తెలుగులోనే......మరిది గారు కూడా అలాంటిదే.........  "విచిత్రమేమంటే  గారు అని గౌరవం ఇచ్చిన వారందరూ, కుటుంబం లోనికి బయట నుండీ వచ్చినవారే,  లేక  [అతి చనువుతో ఉండకుండా] కొద్దిగా ఎడంగా పెట్టవలసిన వారై ఉంటారు". 


ఇంగ్లీషులో అయితే నా అంకుళ్ళు ముగ్గురు.....
తెలుగులో అయితే ఇద్దరు మేనమామలు......మధ్యలో ఒక బాబాయి

ఇకపోతే, బాగా చనువునిచ్చే రెండే రెండు సంబంధాలని మనం తెలుగులో చూడవచ్చును. అమ్మ సోదరుడు మామ ఒకరైతే, రెండవ వారు నాన్న తమ్ముడైన బాబాయ్. పిల్లలకి వీరితో ఎంత చనువు ఉంటుందంటే, అమ్మా నాన్నలతో చెప్పని విషయాలని వీరికి చెప్పుకుంటారు. పిల్లలతో వీరి మధ్య చుట్టరికం కన్నా స్నేహమే కనపడుతుంది.  ఈ చనువు వల్లనే...."ఒరే మామా ఏమిటిరా సంగతులు..." అనీ,   "ఎంట్రా బాబై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు....." అనీ స్నేహితుల మధ్య సంభాషణలలో వస్తుంటాయి. 

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక బంధుత్వాలకీ, వాటితో ఉండవలసిన సంబంధాలకీ చాలా చక్కటి వివరణలే తెలుగులో కనపడతాయి. తెలుగులో మానవ సంబంధాలకి ఇచ్చినంత గౌరవం మరే భాషలోనూ కనపడదు. ఆ మాటకొస్తే భారతీయ భాషలలో కూడా ఇన్ని సంబంధాల పేర్లు లేవేమో అనిపిస్తుంది.... ఈ విధంగా ప్రతీ మానవసంబంధానికీ ఓ గుర్తింపునిచ్చిన తెలుగు ఎంత నాగరిక భాషో, ఆ నాగరిక భాషగా అనుకున్న........ అ'నాగరిక బాష వారికి  తెలియచేప్పాలిసి ఉన్నది......... దయచేసి పైన ఉదాహరరించబడని బంధుత్వాల పేర్లు లేక ప్రాంతీయంగా పిలిచే ఇతర పేర్లు తెలుపగలరు. 


   
  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి