LOCAL WEATHER

28, ఆగస్టు 2014, గురువారం

హైదరాబాదులాంటి రాజధాని వద్దు...!!!

రాజధానిని ఒకే చోట పెట్టకుండా వికేంద్రికరణ చెయ్యాలని... 
రాజధానిని నిర్ణయించే "శివరామకృష్ణ కమిటి" తమ రిపోర్టులో పేర్కొన్నారు.... 
దీని గురించి ఇదే బ్లాగులో 
గత సంవత్సరం ఆగస్టు 9నేసూచించటం జరిగింది...
***************************************************************
దానిలోని ముఖ్యమైన అంశాలు:
***************************************************************

9 ఆగస్టు 2013 శుక్రవారం

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???


1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంద్ర రాష్ట్రం. కర్టేసి లింకు:[భద్రాచలంతో కలిపి]

రాజధాని గురించి మాట్లాడుతూ... మీడియా మేధావులు ... రాజధాని పెట్టాలంటే ... ఆంధ్రాలో ఎక్కడ పెట్టాలి...?    దానికి చాలా విశాలమైన ప్రాంతం కావాలనీ... పరిశ్రమలు అవీ పెట్టటానికి అనువైన ప్రదేశం ఉండాలనీ... దానికి ఎన్నో వేల/లక్షల ఎకరాల భూమి కావాలనీ... నీళ్ళు కూడా సమృద్ధిగా దొరకాలనీ... ఇలా ఒకటేమిటి... ఎవరికీ తోచినది వారు చెప్పేస్తున్నారు.... పరిశ్రమలకి...రాష్ట్ర పరిపాలనకి సంబంధం ఏమిటో ఈ తెలివిగల జ్ఞానులకే తెలియాలి....రాజధానిలో కావాలిసింది కేవలం పరిపాలనా భవనాలు మాత్రమే... దానికి సంబంధించిన ఉద్యోగులకి ఉండటానికి కాలనీలు ... ఇవి మాత్రం ఉంటే చాలు...

"రాజదాని అంటే అభివృద్దికి కేంద్రం... అనే మూఢనమ్మకం" నుండి బయటపడాలి. అభివృద్ధి వికేంద్రికరణ చెయ్యాలి. దీనివలన, ఎక్కువ ప్రాంతాలు బాగుపడతాయి. రాజధానికి వలసలు తగ్గుతాయి. అప్పుడు అనవసరమైన వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒకే చూట కుమ్మరించే దిక్కుమాలిన పరిస్థితి ఉండదు. ఆ డబ్బును రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగటంలేదో అక్కడ ఉపయోగించే అవకాశం ఉన్నది. సోషలిజం, కమ్యూనిజం అని మాట్లాడే మన నేతలు, ఆ భావాలు కేవలం మనుషుల కోసమే కాదు, ప్రాంతాలకి కూడా అన్వయించాలి....ఆ భావాలు మనుషుల మీద ఉపయోగిస్తే కోట్ల ఖర్చుకి వందలమందే బాగుపడతారు...కానీ, ఇదే భావం వెనుకబడిన ప్రాంతాల మీద ఉపయోగిస్తే, కోట్లు ఖర్చు పెడితే లక్షల మంది బాగుపడే అవకాశం ఉన్నది.

 రాజధాని అనగానే ఒకే చోట పెట్టకుండా...  ప్రాంతీయ అవసరాలుగా రాజధానిని విభజించి, అనేక ప్రాంతాలలో పెట్టినట్లయితే... అన్ని ప్రాంతాలు ఒకే సారి అభివృద్ధి అయ్యేందుకు చాలా చక్కటి అవకాశం ఉన్నది. ఇలా ఒకే చోట రాజధాని లేకపోవటం వలన అన్ని రంగాలవారు దీనినే ఆదర్శంగా తీసుకొని, అన్ని ప్రాంతాలలో తమ అబివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. "ఎక్కడైనా ఒకే రకమైన సౌకర్యాలు ఉంటే అందరు ఒకే చోటుకి ఎందుకు పరిగెడతారు"...!!!

దీని వలన రాజధాని మా ప్రాంతంలో పెట్టండి, మా ప్రాంతంలో పెట్టండి అని వివాదాస్పదంగా కొట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకో ముక్క విడిపోవాలన్నా కేవలం ఒక్క రోజులోనే విడిపోయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అన్నిప్రాంతాలు సమంగానే ఉంటాయి కాబట్టి ఎదో పోతోందన్న బాధ ఎవరిలో ఉండదు. అయితే అసలు విడిపోయ్యే భావన కూడా పుట్టదనుకోండి...!!! ఈ ప్రయోగం ....రాష్ట్రం అంటే కేవలం రాజధాని మాత్రమే అనే మూర్ఖత్వం నుండి బయటపడేసి, దేశంలోని అన్ని రాష్ట్రాలకి మార్గ దర్శకంగా ఉండి, కనువిప్పు కలిగించేట్లు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పూర్తిగా అవగాహన ఉన్న నిపుణుల కమిటి కనుక సరైన ప్రాంతాలని నిర్ణయించి పెట్టినట్లయితే బాగుంటుంది. అనువుగాని చోట వ్యవసాయం, అడవులలో//వ్యవసాయభూములలో పరిశ్రమలు పెట్టాలనే....రాజకీయ నాయకుల కెలుకుడు లేకుండా, పూర్తిగా నిపుణుల కమిటికే సంపూర్ణ అధికారాలిస్తే మంచిది.

ఇవన్ని చెయ్యాలంటే, 
దమ్మున్న రాజకీయ నాయకులు కావాలి...
జావకారిన.. పదవులని నమ్ముకున్న నాయకులు కాదు....
అలాంటి కాపినం ఉన్న నాయకులు తక్షణమే రాజకీయాల నుండి తొలగి...
తమ అసలు ప్రవ్రుత్తి  అయిన కాంట్రాక్టు  పనులు చెసుకుని బ్రతికితే, 
అదే రాయల్ ఆంధ్రా ప్రజలకి... వారు చేసే గొప్ప మేలు... 

***************************************************************
ఈ పైన విషయాలతోబాటు... ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో వివరించటం జరిగింది.... అలాగే రాజధాని ఎక్కడ పెట్ట కూడదో కూడా 

24 ఫిబ్రవరి 2014 న వివరించటం జరిగింది.

ఈ రోజున దరిదాపుల ఇదే రకమైన అభిప్రాయాన్ని
 రాష్ట్రమంతా పర్యటించిన శివరామకృష్ణన్ కమిటి వెలిబుచ్చింది....


కర్టేసి:ఈనాడు 

కర్టేసి:సాక్షి 

***************************************************************
సరే బాగానే ఉన్నది.... 
మరి ఈ కమిటీ... శ్రీకృష్ణ కమిటిలాగా మారి-పోతుందా
 లేక 
కమిటి మాట ప్రకారమే చేస్తారా అనేది 
ఇప్పటి ప్రభుత్వం చేతుల్లో ఉన్నది... 
అయితే, 
దీనికి ప్రజలందరి సహకారం అవసరముంటుంది. 
ఎందుకంటే రాజధాని అనగానే దాని మీద పడిపోయి 
అక్కడ లభించే సౌకర్యాలని అనుభవించాలని అనుకునే వారే ఎక్కువ... 
దీని ఫలితంగానే  హైదరాబాదుకి వలసలు వరసబెట్టి
 ఆంధ్రప్రదేశ్‌లోని 22 జిల్లాలని పాడుబెట్టారు.
విపరీత ఉద్యమాలకి మూలం అయ్యారు...
కాబట్టి, ప్రజలు కూడా 
జరిగిన అభివృద్ధిని అనుభవించాలానే  కాకుండా 
జరగాలిసిన అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని అనుకుంటే బాగుంటుంది.
దీనికోసం రాజధాని వికేంద్రికరణతోబాటు 
అభివృద్ధి వికేంద్రికరణ కూడా చాలా అవసరం.
అయితే,
విచారకరమైన విషయం ఏమంటే...
కొందరు రాజకీయనాయకులతోబాటు ప్రజలు కూడా 
రాజధాని అంటే ఎదో రియలెస్టేట్ వ్యాపారంగా  చూస్తున్నారేగానే
రాష్ట్ర ప్రజలందరి అవసరాలు తీర్చేదిగా చూడటం లేదు.
ఈ వ్యాపార దృష్టి మారినప్పుడే 
ఆంధ్రప్రదేశ్‌నకు
ఆరోగ్యకరమైన రాజధాని వస్తుంది. @@@@@@@@@@@@
                                                                            
అంరికీ 
వినా వితి శుభాకాంక్షలు 
                                                                           
@@@@@@@@@@@@
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???@@@@@@@@@@@@23, ఆగస్టు 2014, శనివారం

భక్తి అంటే అష్టోత్రాలూ...సహస్రాలు చెయ్యటమేనా...???


ఈ రోజున ఏ పండగ వచ్చినా చెట్టులు పుట్టలు కొట్టేసి మరీ ఆర్భాటంగా చేసేయ్యటం, ఆ ప్రత్యేకించిన రోజునే దేవాలయాల మీద పడిపోవటం జరుగుతోంది... ఇదంతా ఒక దశాబ్ద కాలంగా బాగా పెరిగింది... అంతకు ముందు ఒకటి రెండు దశాబ్దాలపాటు పూజలకి/దేవాలయాలకి దూరంగా ఉన్న వారు కూడా చాలా భక్తిగా అన్నీ చేస్తున్నారు....దీనితోబాటు అనేక అనుమానాలు..."ఇది చెయ్యచ్చా...అది చెయ్యచ్చా...ఫలానా రోజున ఇది చెయ్యకూడదా" లాంటి సందేహాలు తీర్చటానికి... ఇప్పుడు అనేక తెలుగు ఛానళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి...వీటిలో బాగా మేకప్పు చేసుకున్న ఒక మోడల్‌తోబాటూ బాగా గడ్డం పెరిగిన జ్ఞానులు...అజ్ఞానులైన ప్రేక్షకులకి తమ జ్ఞానబోధ ద్వారా సందేహాలని తీరుస్తున్నారు. 


అంతా బాగానే ఉన్నది...
ఇదంతా చూస్తుంటే "ప్రజలలో భక్తీ భావం పెరిగిపోయింది" అని అనిపిస్తుంది....
అయితే ఇదంతా భక్తేనా అని అనిపిస్తుంది...
ఇది భక్తీ అవునో కాదో అనుకోవటానికి, 
అసలు భక్తీ అంటే ఏమిటో తెలియాలి కదా...
భక్తి అంటే పూజలు చెయ్యటం, అభిషేకాలు చెయ్యటం, 
మడికట్టుకోవటాలు, అష్టోత్రాలూ...సహస్రాలు చెయ్యటమేనా ...? 
భక్తి అనేది దేనికి సంబంధించినది...??
 దేవునికా లేక మనకా...??? 
అసలు ఈ భక్తిగా ఉండటం అనేది దైవికమా లేక మానవ-తత్వమా.. 
ఇలా అనేక సందేహాలు భక్తి మీద కలుగుతాయి....

చిన్నప్పటి నుండీ తల్లిదండ్రుల వలన ఏర్పడిన అలవాటుతో...
ఆలయాలకి వెళ్ళటం, 
 దేవుడికి దణ్ణం పెట్టుకోవటంతో మొదలై, కొంచం పెద్దయిన తరవాత...
 అవసరార్ధం మొక్కులు మొక్కటం వరకూ జరుగుతూ ఉన్నది...
అంటే... 
ఈ పని అయితే కొబ్బరికాయ కొడతా, గుండు చేయించుకుంటా, 
మోకాళ్ళ మీద నడుస్తూ దేవాలయానికి వస్తా, 
వంటి మీద ఉన్న నగలన్నీ నిలువు దోపిడీ ఇస్తాలాంటి 
ఆధునిక మొక్కులే కాకుండా...
మనుష్యులని, జంతువులని లేక తమ అవయవాలని బలివ్వటంలాంటి 
పురాతన మొక్కులూ ఉన్నాయి... 
వీటన్నిటి ఉద్దేశ్యం వారి వారి కోర్కెలు తీర్చుకోవటానికి
దేవునికి"నువ్వు నా పని చేస్తే ఈ లంచం ఇస్తాను, 
లేక  
నా పని కానట్లైతే నిన్ను నేను నమ్మను అనే బెదిరింపు"... 
ఇలా నయానో భయానో దేవుణ్ణి లొంగదీసుకొని 
తమ తమ పనులని చేసుకోవటాన్ని భక్తి అంటారా....?
దేవుణ్ణి కోరికలు కోరటం కోసం హుండీలో కానుకలు వెయ్యటం, 
రీరాన్ని రకరకాలుగా కష్టపెట్టుకోవటం ఇవన్నీ భక్తి క్రిందకి వస్తాయా...??

మరి ఇవన్నీ భక్తి క్రిందకి రాకపోతే 
"భక్తి అంటే ఏమిటీ" [లింకు నొక్కండి]అని అనుకుంటుంటే... 
అసలు భక్తి అనేది ఎందుకుండాలీ...
అనే విపరీత ప్రశ్నకొందరు నాస్తికులనబడేవారివలన ఉద్భవిస్తోంది...
"భక్తీ అనేది దారి తప్పటం వలననే 
నాస్తికులనబడే వారికి అవకాశం వచ్చింది"అని అనిపించి, 
భక్తీ కోసం భక్తిగా గూగుల్ దేవత సహాయం తీసుకోని 
మన పాత గ్రంధాలని తిరగేస్తే...
భక్తీ అంటే దరిదాపుల అన్నింటిలోనూ ఒకే రకమైన అర్ధం కనపడింది..
వాటిలో ఒక దాని నుండి దొరికింది...

అది:[లింకు నొక్కండి] "Bhakti", says Nârada in his explanation of the Bhakti-aphorisms, "is intense love to God"; "When a man gets it, he loves all, hates none; he becomes satisfied for ever"; "This love cannot be reduced to any earthly benefit", because so long as worldly desires last, that kind of love does not come; "Bhakti is greater than karma, greater than Yoga, because these are intended for an object in view, while Bhakti is its own fruition, its own means and its own end." 

"భక్తీ గురించి నారదులవారు వివరిస్తు...
భక్తీ అంటే దేవుని ప్రేమించటం...
ఒక సారి అది కుదిరిన తరవాత...
అతను అందరినీ, అన్నిటినీ ప్రేమిస్తాడు...దేనిని ద్వేషించడు.. 
పూర్తిగా సంతృప్తి చెందిన భక్తీ అనేది భౌతిక సుఖాలని కోరుకోదు......
అలా కోరుకొనేది భక్తీ క్రిందకి రాదు...
భక్తీ అంటే..... 
దేవుణ్ణి...తద్వారా లోకాన్ని...సమాజాన్నీ ప్రేమించటం. 
ఇది యోగ మరియు కర్మల కన్నా గొప్పది....
ఈ భక్తికి సాటి అయినది మరేది లేదు..."

కాబట్టి, దేవాలయాలకి వెళ్ళటం...దేవుణ్ణి కొలవటం లాంటివి  తమ స్వార్ధ ప్రయోజనాల గురించి కాకుండా....సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించటం...తద్వారా  ప్రక్క వారికి కనీస సహాయం చేయకున్నా కనీసం వారి గురించి మన[సు]లో ఒక ఆలోచనని రానియ్యటం లాంటవి భక్తిని సాధించే క్రమంలో మొదట ఉండవలసిన లక్షణాలు.....

ఇందులో మరొక విషయం కూడా ఉన్నది. 
దేవుని ప్రేమించటం అంటే ఆయనకీ దగ్గరగా వెళ్ళటం...
దీని ద్వారా ఆయన అంటే మనకి భక్తీ అనగా ప్రేమే కలగాలే కానీ... 
భయం కాదు. భయం అనేది దేవునికి వ్యతిరేక పదం....
దీంతో దేవుడికి సంబంధం కలిగించటం ద్వారా... 
మనం దేవుని అవమానించిన వారము అవుతాము... 
అంటే కొంత వివరణగా... 

దేవుని పేరు లక్ష సార్లు వ్రాయి లేకపోతె ఏదో అయిపోతావు...
ఇలాంటివి ఇదివరకు పోస్టు కార్డులు వచ్చేవి....
ఇప్పుడు కంప్యుటర్ యుగం కదా... 
మెయిల్స్ లోను, ఫేస్ బుక్ లోను వస్తున్నాయి...
ఈ రకమైనవే కాకుండా, 
"తమ" దేవుని నమ్మకపోతే ప్రపంచం మునిగిపోతుందని భయపెట్టి, 
దేవునికి దగ్గర చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది.... 
అయితే
 భయం ద్వారా భక్తులని దేవునికి దగ్గర చెయ్యటం అంటే.. 
దేవుణ్ణి వ్యతిరేకించటమే....

మరొక ప్రచారంలో, 
దేవుని పూజలు విధి విధానంగా సక్రమంగా చేయి, లేకపోతే ఎదో కోల్పోతావు...
ఇవి కొన్ని పూజా మరియు వ్రత కదల పుస్తకాలలో కనపడతాయి...  
దేవుడు... తనకి పూజ సరిగా చెయ్యకపోతే 
కోపం తెచ్చుకొని భక్తుని శపించేట్లుగా ఉంటాడా....???  
ఇవేమీ క్షుద్ర పూజలు కాదు కదా... 
అవి సరిగా చెయ్యకపోతే క్షుద్ర శక్తి 
పూజ చేసేవారినే కబళించటానికి[సినిమా కధల ప్రకారం].... 
దేవుడికి పూజలు చేసే క్రమంలో భయపడితే అది భక్తీ ఎలా అవుతుంది...? 
"దేవుడు ప్రేమిస్తాడే కానీ ద్వేషించడు...
అందుకనే ఆయన దేవుడు అయినాడు" 
అని 
మనం నమ్మకపోవటం ద్వారా... 
దేవుణ్ణి అవమానించిన వారం అవుతాము... 
దేవునికి భయపడేది పూజలు చేసేప్పుడు కాదు... 
చెడ్డపనులు చేసేప్పుడు మాత్రమే...
 చెడ్డ పనులు అంటే.... మన చర్యల ద్వారా...
మనకి మనం, 
మన కుటుంబానికి, సమాజానికి కీడు తలపెట్టటం...

మరొక భయానుమానం...
దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళే ప్రతీ సారి అతి శుభ్రంగా ఉండాలి.... 
లేకపోతే ఆలయం అపవిత్రం అయిపోతుంది....
ఇది కొందరి భావం.... 
అయితే, 
శుభ్రం అనేదానికి ఎక్కడ అంతున్నది...? 
మన చర్మం క్రింద ఉన్నదంతా చీము, నెత్తురు మంసమే కదా...
శుభ్రం అనేదానికి రోజుకి ఒకటో రెండుసార్లు స్నానం చేస్తాము...
అయితే అంతటితో శుభ్రం అయిపోతుందా...??
అవదు.
దేవుడు భావం అనేది మానసికమైనది కాబట్టి
శరీర శుబ్రంతోబాటు ముఖ్యంగా ఉండాలిసింది మానశిక శుభ్రత...
అది లేకుండా ఎన్ని సార్లు స్నానం చేసినా 
దేవుడి మీద గురి కుదరదు.

ఇక అతి ఆచారాల వ్యవహారాలలో 
చొక్కాలు తీసి... లుంగీలు 
అందులో 
తెల్ల లుంగిలే కట్టుకొని ఆలయాలకి రావాలి... 
ఇది కేరళా లోని ప్రతీ ఆలయంలోను కనపడుతుంది....
ఈ ఆచారాల్ని పాటించని వారిని 
గుడి బయటి నుండే ఒక కన్నం లాంటి దానిలో నుండి మాత్రమే 
దేవుని దర్శనం  చేయమనటం...
మరొకటేమిటంటే, 
కొందరికైతే ఎలా వచ్చినా బయటి దర్శనమే దిక్కు.... 
బహుశా దీనివల్లన్నేమో 
ఆ రాష్టంలో మత మార్పిడుల ద్వారా ఇతర మతస్తులు ఎక్కవ అయ్యారు....
నిజమే దేవాలయాలకి వెళ్ళేప్పుడు డ్రస్ కోడ్ అవసరమే 
కానీ...
అది అతిగా ఉండకూడదు. 

ఇక్కడి దేవాలయాలలో ఇన్ని కట్టుబాట్లు పెట్టి, భక్తులు హుండీ ద్వారా సమర్పించిన ఆదాయాన్ని
 ప్రభుత్వం కొట్టేస్తుంటే మాత్రం నోరెత్తరు... పోనీ ఈ డబ్బులని కేరళాలోని ఆలయాలకి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం వాడతారా అంటే వాడరు. శబరిమలకి ఎంత ఆదాయం వస్తుందంటే కేరళా బడ్జెట్టే దాని మీద ఆధార పడి ఉంటుంది. సరే ప్రజా శ్రేయస్సు మంచిదే.... కానీ, స్వంతంగా చెయ్యగలిగినంత డబ్బు ఉన్నప్పటికీ...శబరిమలకి పైకి ఎక్కే మార్గాన్ని సరి చెయ్యటానికి బ్రాంది విస్కిల వ్యాపారాలున్న  
విజయమాల్యగారి సౌజన్యంతో పూర్తీ చెయ్యవలసిన ఖర్మపట్టటం......
మనని బాధిస్తుంది.  


విషయంలోనికి వస్తే...
చాలా మంది 
దేవుని గురించి ఆలోచనని 
స్వార్ధ ప్రయోజనాలకి ముడిపెట్టటం ద్వారా 
దేవునికి దగ్గరకి వెళుతున్నామని అనుకుంటూనే 
ఆయనకి దూరమైపోతున్నారు...
చాలా మంది చెప్పే ఆచారాలు, 
ఎటువంటి మతగ్రంధలలోను ప్రస్తావించబడవు... 
కనీసం అవి ఎవరు చెప్పారో కూడా తెలియదు... 
ఎవరికీ తోచిన అంతరార్ధం వారు చెప్పేస్తూ, 
భక్తీ అనేది కేవలం వ్యక్తిగతం అన్నట్లుగా చేసేస్తున్నారు. 
అలా చెయ్యచ్చా... ఇలా చెయ్యచ్చా... 
అని రకరకాలైన ప్రశ్నలని పుట్టించేకన్నా... 
"మనం చేసే దాని వల్లన 
ఎవరికైనా/వేటికైనా ఇబ్బంది కలుగుతోందా" 
అని మాత్రం ఆలోచిస్తే చాలు...
అలా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా 
అందరిని ప్రేమించగలిగితే 
అదే 
నిజమైన భక్తీ...


సర్వే జనా సుఖినో భవంతు@@@@@@@@@@@@@@@
12, ఆగస్టు 2014, మంగళవారం

నేరం మాది కాదు ఎలినివొలది...!!!

ఇప్పుడు మనదేశంలో వస్తున్న వాతావరణ మార్పులకి ఎక్కడో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలొ ఏర్పడిన ఎల్‌నివోలది అని మన వారు తేల్చి పారేశారు... మరి ఇదే దేశంలో కొన్ని చోట్ల ఎల్నివో ప్రభావం ఉండి మరికొన్ని చోట్ల ఉండదా...ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌నకు  మాత్రమే ఎల్నివోల ప్రభావం ఉంటుందా ...??? నిజమే ఇక్కడి వాతావరణం మార్పులకి అది "కూడా" ఒక కారణం అవుతే అవ్వచ్చును... అయితే అదే కారణం అని చెప్పటం మనని మనమే మోసం చేసుకోవటమే...ఎందుకంటే అదే ప్రభావం ప్రక్క రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు మీద కూడా ఉండాలి కదా...

ఇదెలా ఉన్నదంటే, వెనుకటికి ఒక సినిమా వచ్చింది..."నేరం నాది కాదు ఆకలిది" అని... దానిలో నేరాలు చెయ్యటానికి కేవలం పేదరికమే కారణం అన్నట్లుగా చూపించారు... నిజమే... నేరాలకి వెనుకాల ఒక కారణం ఆకలిది కావచ్చును... కానీ, అన్ని నేరాలకీ కారణం పేదరికం కాదు కదా... అలా అయినట్లయ్యితే, మన దేశంలో 40 కోట్లమంది పేదలున్నారని ఈ మధ్యనే తేల్చారు... వారందరూ కనుక నేరస్తులైతే... కానీ, మన దేశంలో అంత మంది నేరస్తులు లేరు... నేరాలకి కారణం పేదరికమే అని కొందరు సామాజిక వేత్తలూ కూడా అనటం... కేవలం పేదలని అవమానించటమే...ఈ రోజు వరకూ పట్టుబడుతున్న వేల కోట్లు తిన్న బడా దొంగలెవరూ పేదలు కాదు....

సరే, విషయంలోనికి వస్తే... వాతావరణ మార్పులకి అనేక కారణాలలో ఎల్నివోలో లేక మరేదో ఆకశంలో బొక్క పడటమో ఒకటి రెండు కారణాలు కావచ్చునేమో... మిగిలిన అనేక కారణాలు మన దగ్గరే ఉన్నాయి....

ఈ క్రింద చూడండి... అతి దగ్గరదాకా వచ్చిన అల్ప పీడనం ఎవరో తోసేసి నట్లుగా వెనక్కు పోయి...ప్రక్కనే ఉన్న ఒరిస్సాకూ ఎక్కువగానూ...కొద్దిగా తమిళనాడుకూ పోయింది. గాలి తూర్పు నుండి పడమరకే ఉన్నది...దానికి సరిగ్గా పడమర వైపునే ఉన్న ఆంద్ర తీరానికి కాకుండా మధ్యలో ఎదో కొండ అడ్డం వచ్చినట్లుగా ఎక్కువగా అడవులు వ్యాపించి ఉన్న ఒరిస్సాకు... మిగిలినది దక్షిణానికి చీలినది తమిళనాడుకీ చేరింది. తమిళనాడులో మనకన్నా ఎక్కువగా నగరీకరణ ఉన్నప్పటికీ, అక్కడ వాతావరణాన్ని వ్యతిరేకించే కారణాలు తక్కువగా ఉండి ఉంటాయి. 

శుక్రవారం నుండి ఆదివారం వరకూ...
దగ్గరగా వచ్చి...
దూరంగా వెళ్ళిపోతున్న అల్పపీడనం....
కొన్ని సంవత్సరాలుగా ఇలా వెనక్కు పోవటం మామూలే అవుతోంది...
ఆంధ్ర ప్రదేశ్‌నకు కూడా వర్షాలు రావాలంటే
ఏ పెద్ద వాయుగుండం బలంగా ఉంటేగానీ వర్షాలు పడటం లేదు... 

సోమవారం [11-08-2014]సాయంత్రం...
ఆంధ్ర ప్రదేశ్‌ తీరం వెంబడి వాయుగుండం లాగా 
ఎదో అగ్ని గుండం ఏర్పడినట్లున్నది...

అటు ఒరిస్సా బెంగాలులకు, ఇటు తమిళనాడుకు కాకుండా, కేవలం ఆంధ్ర ప్రదేశ్‌నకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది...కారణాలు వెదకకుండానే బోలెడు కనపడతాయి... ఇష్టా రాజ్యంగా అడవుల నరికి వేత...అందులో..సముద్ర ఒడ్డునే ఉన్న మడ అడవులని తొలగించటం...చేపల చెరువులూ..రొయ్యల చెరువులూ వెయ్యటం...వ్యవసాయ భూములలో చెట్లని పూర్తిగా తొలగించి ఎడారులుగా మార్చటం లాంటివి ముఖ్య కారణాలు... పారిశ్రామీకరణ జరిగితే వచ్చే దుష్ఫలితాలని, మన వాళ్ళు వ్యవసాయంతోనే తెచ్చేస్తున్నారు....

వీటిలో ముఖ్యంగా చేపల చెరువుల విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక సారవంతమైన భూములని గోతుల క్రింద మార్చి వాటిలో చేపలు పెంచటమే కాకుండా అవి పెరగటానికి అడ్డమైన మందులూ కలుపుతున్నారు... ఆ మందులని...అవి తయారు చేసే దేశాలలోనే నిషేధించారు... అలాంటి వాటిని తెచ్చి మన వాళ్ళు ఇక్కడ వాడుతున్నారు... అవి నీళ్ళలో కలిసి...ఎండ వేడిమికి ఆవిరిగా మారి... వాతావరణాన్ని విషతుల్యంగా మార్చి వేస్తున్నాయి...

ఇలాంటి వారిని వెనకేసుకొస్తున్న వారు వాడేది ఒకేమాట...వరి, చెఱకూ లాంటివి వేస్తే రైతులు నష్టపోతున్నారని. అలా అయినట్లైతే గంజాయీ లాంటివి పెంచితే ఇంకా లాభాలొస్తాయి కదా... కానీ, కేవలం లాభాల కోసమే భూములని ఎలాపడితే అలా వాడటానికి ఈ దేశంలో ఎవరికీ హక్కు లేదు...

ఈ విధంగా రైతులే కాదు పట్టణాలలో, నగరాలలో విపరీతంగా ఇళ్ళకి పెరిగిన డిమాండుతో...గృహ యజమానులు కూడా తమ ఇళ్ళలోని చెట్లని కొట్టేసి అక్కడ గదులు నిర్మించి అద్దెలకిచ్చి తమ వంతు పాపాన్ని తాము మూట గడుతున్నారు...ఏమైనా అడిగితే బ్రతుకు తెరువు...అసలు బ్రతికుంటే కదా బ్రతుకు తెరువు గురించి ఆలోచించేది...తమకి తాముగా ఏమైనా చేసుకొవటానికి అందరికీ హక్కున్నా...అందరి ఆరోగ్యాన్ని హరించే పనులు చేసే హక్కు ఎవరికీ లేదు...

వీరికి తోడు, వాతావరణాన్ని విశ్లేషించే రాజకీయ మహామహ వాతావరణ వేత్తలు... ఒక మూఢ నమ్మకంతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారు.... ఆయనెవరో చెపితేనే వర్షాలు పడతాయని...ఆయన ఉంటేనే వర్షాలు వస్తాయని....ఇప్పుడు వచ్చిన ఒకాయన వలన వర్షాలు పడవని వీరి వాదన... ఇలాంటి పరిస్తితులు కాకతాళీయంగా రావటమే వీరి వాదనకి బలం.... ఇది కానీ నిజమైతే... వర్షాలు కురిపించే ఆయన 30 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన జిల్లా... కరువు జిల్లాగా ఎందుకు అయ్యింది....??? ఇదేదో ఒకరిని వెనకేసుకుని వచ్చి వేరొకరిని అవమానించటానికి కాదు.... పర్యావరణం గురించి ప్రజలని చైతన్యవంతులని చెయ్యవలసిన రాజకీయ నాయకులే ఇలాంటి మూఢనమ్మకాలని ప్రచారం చెయ్యటం వలన అసలు విషయం మరుగున పడి, తప్పు ఏదైతే ఉన్నదో... దానిని సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతోంది.

కాబట్టి, ఈ విషయంపై శ్రద్ద పెట్టి, చేతులు కాలక ముందే... ఆకులని[చెట్లని]పెంచితే... అవి మనకి కాలకుండా చేస్తాయి...దీనికి గానూ కొన్నిటిని ప్రభుత్వపరంగా చేస్తేనే తప్ప ప్రజలలో చైతన్యం రాదు. వీటి గురించి ఇంతకు ముందే ఈ బ్లాగులో @"అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా.....???"[లింకు నొక్కండి]@ లో వ్రాయటం జరిగింది...అవి:


"దీని కోసం మాములుగా చెపితే జనం మాట వినరు కాబట్టి, ప్రభుత్వమే చట్టాలు చెయ్యటం మరియు పెనాలిటీలు వెయ్యటం ద్వారా ప్రజలకి జ్ఞానొపదేశం చెయ్యాలి... ఈ క్రింది విధంగా చేస్తే, మనకి కాకపోయినా మన తరవాతి తరానికైనా ఎండ వేడిని తగ్గించిన వారం అవుతాము....

1] ప్రతీ ఇంట్లో ఓ చెట్టు... ఆయా స్థల వైశాల్యాన్ని బట్టి చెట్లూ వుండి తీరవలసిందే అని ఒక చట్టం చేసి, పాటించని వారికి  ఇంకం టాక్సులలోనూ, మునిసిపల్ టాక్సులలోనూ పెనాలిటీలు వెయ్యాలి.

2] ఇళ్ళలో ఒక గది వేస్తె వచ్చిన అద్దెకంటే, ఆ ప్రదేశంలో చెట్టు లేనందుకే ఎక్కువ ఇంటి పన్ను వాసులు చెయ్యాలి. దీని వలన ఉన్న చెట్లు కొట్టి, గదులు వేసి అద్దెకిచ్చుకొనే వారిని కంట్రోలు  చెయ్య వచ్చును.

3] ఒక ఇంట్లో ఉన్న చెట్ల సంఖ్య ఎక్కువైతే, ఆ ఇంటి ముందర రోడ్డు మీద కూడా చెట్లు ఉన్నట్లైతే ఆ ఇళ్ళకు, ఇళ్లలోని వారికి అనేక టాక్సులలో రాయతీలు కల్పించాలి.

4] ఒక చెట్టుని కొట్టాలంటే... అది ఎక్కడున్నా సరే, దానికి ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చెయ్యాలి...అనుమతి లేకుండా చెట్లు కొట్టే వారిని హత్యానేరం క్రిందే చూడాలి... ఎందుకంటే భవిష్యత్తు తరాల ప్రాణాలని కాపాడేవి ఈ చెట్లే కదా....

5] చేపల చెరువులు తవ్వటానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి చెయ్యాలి. చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద విపరీతమైన టాక్సులు వెయ్యాలి.......వీటిని వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోనికి మార్చాలి. వ్యవసాయ దారులకి ఇచ్చే ఏ సౌకర్యాలూ  ఇవ్వకూడదు. వీళ్ళకి ఇచ్చే నీళ్ళని, లీటర్ల లెక్కన అమ్మాలి... మనం తాగాటానికే లేక కొనుక్కుని తాగుతున్నప్పుడు... ఈ చెవుల పరిశ్రమ ద్వారా కోట్లు గడిస్తున్న వీరికి,  ఉచితంగా నీళ్ళు ఎందుకివ్వాలి....??? దీంతో పాటు... వారు వాడుతున్న మందులని నిషేధించాలి.

6] ముఖ్యంగా దేశంలోని అడవుల శాతం తగ్గకుండా చట్టాన్ని కఠిన తరం చెయ్యాలి." 

ఇవ్వే కాకుండా... పర్యావరణ శాస్త్రవేత్తలని ఒక కమిటిగా నియమించి, వారు సూచించిన విధంగా జరిగేట్టు చూడటానికి ఒక విభాగాన్ని ఏర్పాటుచేయ్యాలి. వీరికి చట్టబద్ధమైన గుర్తింపునిచ్చి... వీరు సూచించినవి చెయ్యని వారిని శిక్షలు పడేట్లు చెయ్యాలి... మాములుగా ఒక హత్య జరిగితే అది ఏ ఇద్దరు వ్యక్తులకో లేక అక్కడి ఒక పరిమిత ప్రాంతానికో మాత్రమే సంబంధం ఉంటుంది... అయితే, పర్యావరణాన్ని పాడు చేస్తే అది మొత్తం వాతావరణానికే/మానవ సమాజానికీ కీడు చేస్తుంది... ఇది ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది... ఇదివరకు తుఫానులు వస్తున్నాయి అంటే తెగ భయపడే వారు... కానీ ఇప్పుడు అవి రావటం లేదని దిగులు పడుతున్నారు... ఇక ముందు తుఫాను వస్తుందంటే పెద్ద పండగే నిర్వహించే అవకాశం ఉన్నది. 


@@@@@@@@@@@@@@@@@@@
weather report courtesy:
@@@@@@@@@@@@@@@@@@@
photos GIF by krk

21-08-2014న 

10 రోజుల తరవాత కూడా ఇదే పరిస్తితి... మధ్యలో ఆంధ్ర ప్రదేశ్‌ ఖాళి.

మధ్యకాలంలో కొద్దిగా మేఘాలు కమ్ముకున్నా వర్షం మాత్రం సున్నా...


@@@@@@@@@@@@@@@@@@@
weather report courtesy:
@@@@@@@@@@@@@@@@@@@
photos GIF by krk

దీనికి ముందు వచ్చిన వ్యాసం....[లింకు నొక్కండి]

రాజధాని మధ్యలోనే ఉండి తీరాలా...కర్నూలు, విశాఖలు పనికిరావా...???1, ఆగస్టు 2014, శుక్రవారం

రాజధాని మధ్యలోనే ఉండి తీరాలా...కర్నూలు, విశాఖలు పనికిరావా...???

ఈ మధ్యన, విడిపోయి "రాజధానిని పోగొట్టుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలి" అనే విపరీత చర్చలు జరిపోతున్నాయి....ఈ చర్చలాగ్నికి మన మీడియాలు చాలా చక్కగా ఆజ్యం పోస్తూ తమ రేటింగుని పెంచుకుంటున్నాయి.... ఈ చర్చలకి అసలు కారణం "రాజధాని ఎక్కడ" అని బాధ్యత కలిగిన మన నాయకులు ప్రకటించకపోవటమే... ఇప్పటికే విజయవాడ మరియూ గుంటూరుల మధ్యే రాజధాని అని చెప్పకనే చెపుతూ ... మరల ఆ మాట మీద నిలబడటం లేదు... దానితో నిమ్మదిగా "రాజధాని ఎక్కడ పెట్టాలీ అనే విషయంపై ... సమైక్యాంద్రులలో అనైక్యత మొదలైయ్యింది...

మన వాళ్లకి ఇతరుల విషయంలో విశాల హృదయం ఎక్కువే...ఇది ఇతరుల రాజధానులు కట్టటంలో ఉన్నట్లుగా ... మన రాజధాని విషయంలో కనపడటం లేదు. దీని వల్లనే ఎవరి పంతం వారిదిగా చర్చిస్తున్నారే గాని, "ఇది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుందా" అని ఆలోచించటం లేదు. వీరి వాదనలు ఎలా ఉన్నా కర్నూలు విశాఖలో మాత్రం రాజధాని పెట్టటం సమంజసం కాదు... అలాగని ఏ విజయవాడలోనో పెట్టమని కాదు... దీని గురించి [లింకు నొక్కండి] "సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు...?!?!?" అని ఈ బ్లాగులోనే అయిదు నెలల క్రిందటే సూచించటం జరిగింది.  

ఈ చర్చల విషయానికొస్తే, 
ఇంతకు ముందు కర్నూలు ఉంది కాబట్టి అక్కడే పెట్టాలని ఒకరూ, 
మరొకరు విశాఖలో పెట్టాలనీ....
కాదు కాదు అందరికీ మధ్యలో ఉంది కాబట్టి 
విజయవాడా గుంటూరుల మధ్యే పెట్టాలనీ మరికొందరూ అంటున్నారు.... 
మధ్యలో పెట్టాలి అనే వారి వాదనను వ్యతిరేకించే వారు 
మధ్యలోనే రాజధాని ఎందుకని ఉండాలీ...
తమిళనాడుకి, మహారాష్ట్రకీ, వెస్టుబెంగాలుకీ 
రాజధానులు మధ్యలో ఉన్నాయా...
అమెరికా రాజధాని ఓ ప్రక్కన లేదా, 
అంత దాకా ఎందుకూ "మన దేశ రాజధాని మధ్యలో ఉన్నదా"?
 అని కొందరు ప్రశ్నిస్తున్నారు...
చరిత్ర తెలియకపోవటం వల్లనే
ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి.
ఏదైనా దేశానికి గానీ, 
రాష్ట్రాలకి గానీ రాజధానులు మధ్యలోనే ఉండటమే జరుగుతోంది. 
ఒక వేళ అలా లేకపొతే 
వాటికి మూడు కారణాలు కనపడుతున్నాయి:


1] భౌగోళికమైనది 
2] ఆక్రమణలకి గురైన ప్రాంతం  
3] రాష్ట్ర విభజనలు/కలయికలు


1]భౌగోళికమైనది: 

ఈ కారణం తీసుకుంటే... ఇలా ప్రక్కగా రాజధానులు ఉన్న రాష్ట్రాలలో అక్కడి భౌగోళికమైన పరిస్థితులే కారణంగా కనపడతాయి. రాష్ట్రంలో విపరీతంగా పర్వతాలూ, అడవులు, ఎడారులూ కనుక ఉంటే, అలాంటి రాష్ట్రాలలో మాత్రమే రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నాయి...రాజస్థాన్, అరుణాచలప్రదేశ్, ఝార్ఖండ్, హిమచలప్రదేశ్, త్రిపురా లాంటి 8 రాష్ట్రాలున్నాయి. వీటిలో 6 రాష్ట్రాలు దాకా కొత్తగా ఏర్పడినా...అక్కడున్న భోగోళిక పరిస్తితుల వలన మధ్యలో రాజధానులు రాలేదు.  ఉదాహరణకి...

పడమర ప్రాంతమంతా ఎడారిగా ఉన్న రాజస్థానులో 
జైపురు ఉత్తరంగా ఉన్నప్పటికీ, 
ఎడారిలేని ప్రాంతాలకి మాత్రం మధ్యలోనే ఉన్నది.
రాజధాని మధ్యలో లేకపోయినా, ఎడారికి దూరంగా జనాలకి దగ్గరగా ఉన్నది.  

అలాగే, 
హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌నకు 
డెహ్రాడూన్ పడమరగా ఉన్నప్పటికీ...
ఎక్కువ జన సమర్ధంగల అన్ని ప్రాంతాలకీ అందుబాటులోనే ఉన్నది.
పర్వతాల వలన ప్రక్కన ఉండాలిసి వచ్చిన ఉత్తరాఖండ్ రాజధాని 


2]క్రమణలకి గురైప్రాంతం: 


ఇది ఒకరకంగా చారిత్రాత్మకమైనది...ఇందులో బయటివారి ఆక్రమణల నేపధ్యం ఇమిడి ఉన్నది... 
ఇది రాష్ట్రాలకి, దేశాలకీ సంబంధించినది. 

ఉదాహరణకి అమెరికా తీసుకుంటే...
యూరోపియన్లు చేరుకుని 
మొదలు ఆక్రమించినది అమెరికాలోని తూర్పు ప్రాంతమే... 
మొదటగా స్వతంత్రం ప్రకటించుకున్నది కూడా అదే ప్రాంతం. 
ఈ క్రమంలోనే అమెరికాకి తూర్పున ఉన్న 
వాషింగ్‌టన్ ప్రాంతం... రాజధాని అయినది...
ఇందులో ఇంకో విషయం ఏమంటే 
ఇప్పుడు కనపడే యూ.ఎస్.ఏ రావటానికి చాలా దశాబ్దాలు పట్టింది...
దానికి ముందరే వాషింగ్‌టన్ రాజధానిగా ఉన్నది కాబట్టి, 
దానిని అలాగే ఉంచారు...
అదీకాక, తరవాత కలిసిన పశ్చిమంలో ఎక్కువ  భాగంలో ఎడారే...
అప్పుడున్న అమెరికాకి రాజధాని మధ్యనే ఉన్నది.

 మరొక ఉదాహరణలో 
మన దేశాన్ని ఈస్టు ఇండియా/బ్రిటీషువారు ఆక్రమించినది కలకత్తా వైపు నుండే...
కాబట్టి కలకత్తా 1911 సంవత్సరం వరకూ రాజధానిగా ఉంచారు... 
తరవాతి కాలంలో దేశం మొత్తానికీ అందుబాటులో లేదనీ 
మరియూ తూర్పు నుండీ యుద్ధ భయంతో, 
తమ రాజధానిని ఢిల్లీకి మార్చారు.... 
అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లోని కొంత భాగం, పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్ లు 
బ్రిటీష్ ఇండియాలో కలిసి ఉండేవి...
ఆ మొత్తం ప్రదేశాలకి ఢిల్లీ మధ్యలోనే ఉన్నది.
అఖండ  భారత్‌కు మధ్యలొనే ఉన్న ఢిల్లి

అలాగే రష్యాకి మాస్కో  రాజధానిగా మధ్యలోనే ఉన్నది... అయితే తరవాతి కాలంలో వారు ఆక్రమించిన ఆసియా దేశాలు కలిసిన తరవాత రాజధాని ఆ దేశంలో పడమరగా ఉన్నట్లుగా అయ్యింది. బ్రిటీషువారి రాజధాని లండనుదీ ఇదే చరిత్ర. నిజానికి ఇంగ్లాండ్ మరియూ వేల్స్ కలిపి మాత్రమే ఇంగ్లిషు రాజ్యంగా ఉండేది...తరవాత స్కాట్లేండునీ, ఐర్లాండునీ ఆక్రమించటంతో ఆ దేశ రాజధాని కూడా ఓ ప్రక్కగా ఉన్నట్లు అయ్యింది...


అలాగే, పంజాబు రాజధాని లాహోర్ ఒకప్పుడు మధ్యలో ఉండేది...
అయితే, 
దేశ విభజన సందర్భంగా పంజాబ్ రెండు ముక్కలుగా అయి...
ఒకటి భారత్ లో మిగలగా...
రెండవది పాకిస్తాన్ లోనికి వెళ్ళింది... 
పాకిస్తాన్ లో ఉన్న పంజాబుకి లాహోర్ రాజధాని అయినప్పటికీ...
అది ఆ రాష్ట్రం తూర్పు దిక్కున భారత సరిహద్దులో ఉన్నది.


ఒకప్పటి కాశ్మీరుకు శ్రీనగర్ మధ్యలోనే ఉన్నది...
ఆక్రమణలకి గురై 
మిగిలిన కాశ్మీరుకి ప్రక్కన రాజధాని అయ్యింది.


3] రాష్ట్ర విభజనలు/కలయికలు

అంటే... ఏదైతే ఇప్పుడు రాజధాని ఒక మూలగా ఉన్నదో, ఆ రాజధాని ఒకప్పుడు మధ్యలోనే ఉండి...తరవాతి కాలంలో జరిగిన పరిణామాల వలన, కొన్ని ప్రాంతాలు సపరేటు రాష్ట్రాలుగా ఏర్పడటంతో లేక కొన్ని ప్రాంతాలు కలవటం వలన, ప్రక్కగా ఉన్న రాజధానులుగా మారిపొయ్యాయి...ఇలాంటి దుర్గతి పట్టిన మహారాష్ట్రా, తమిళనాడు, వెస్టు బెంగాలు, కర్నాటకా, అస్సాము లాంటి 8 రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈ రాష్ట్రాలలో రాజధానులు మధ్యలో లేవు కదా అని అనటం, సరిగా చారిత్రకంగా ఆయా రాష్ట్రాల గురించి తెలియకపోవటమే... 


తమిళనాడు...ఇదివరలో మదరాసు రాష్ట్రంగా  పిలిచే పేద్ద ప్రదేశం. 
ఇప్పుడున్నదే కాకుండా, కోస్తా ఆంధ్రా, రాయలసీమా 
మరియూ దక్షిణ ఒరిస్సా ప్రాంతమైన బెరహంపూర్, రాయగడా లాంటి ప్రాంతాలతో ఉండేది... 
ఈ మొత్తం ప్రదేశాలకి చూసుకుంటే మద్రాసు నగరం సరిగ్గా మధ్యలోనే ఉన్నది.
తరవాత మదరాసుకి ఉత్తరాన ఉన్నది మొత్తం సపరేటు రాష్ట్రంగా విడిపోవటంతో
మద్రాస్ మిగిలిన రాష్ట్రానికి ఉత్తర అంచులో ఉన్న రాజధాని అయ్యింది.
రాష్ట్రంలో మధ్యలోనే ఉన్న మదరాసు 


మహారాష్ట్ర...ఇది తరవాత ఏర్పడిన రాష్ట్రం, 
మొదలులో బాంబే, ద. గుజరాతులతో కలిపి బాంబే రాష్ట్రంగా పిలిచే వారు... 
ఆ మొత్తం ప్రదేశానికి కూడా బాంబే మధ్యలోనే ఉన్నది.
 బాంబే రాష్ట్ర విభజనానంతరం... కొంత హైదరాబాదులో, 
మరికొంత సెంట్రల్ ప్రావిన్సులో
ఉండే భాగాలు కలిసి 
ముంబాయికి తూర్పున ఉన్న ప్రాంతం పెరిగిపోయింది.
బోంబే రాష్ట్రానికి బాంబేనే సెంటర్ పాయింటు 

హైదరాబాదు...ఇది కూడా ఉత్తర కర్నాటకా, తూర్పు మహారాష్ట్రా, 
ఇప్పుడున్న 10 జిల్లాలతో ఉండేది. 
ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హైదరాబాదు తూర్పుమధ్యలో ఉండినా... 
అందుబాటులోనే ఉండేది.
తరవాత,కన్నడ, మరాఠా ముక్కలు ఊడి...
తెలుగు ముక్క కలవటంతో పడమర ప్రక్కకి పోయింది.
అయితే, 
తిరిగి విభజన అవటంతో...రాజధాని మధ్యకొచ్చింది.
ఒకప్పటి హైదరాబాదూ ఇంతే...
.
 కలకత్తా: ఇప్పుడు వెస్టు బెంగాలు రాజధాని అయిన ఈ నగరం
 ఒకప్పుడు మహా బెంగాలు రాష్ట్రంగా ఉండేది ... 
దానిలో ఇప్పుడున్న బీహారు[ఝార్ఖండ్ కలిపి], ఉత్తర ఒరిస్సా, వెస్టుబెంగాలు,
 బంగ్లాదేశ్, అస్సాము[7 చిన్న రాష్ట్రాలతో కలిపి]ఉండేది...
 ఆ మొత్తం ప్రదేశాలకీ మధ్యలోనే ఉన్నది 
ఇప్పుడు కోల్కకతాగా పిలవబడుతున్న కలకత్తా. 
తరవాత బెంగాలు విభజనతో...
బీహారు, ఒరిస్సా, ఆస్సాము లాంటి రాష్ట్రాలు విడిపోవటం....
బంగ్లాదేశ్ విడి దేశంగా మారటం జరిగినాయి...
ఈ పరిణామాల వలన కలకత్తా  మూలగా ఉన్న రాజధాని అయ్యింది.
మహాబెంగాలుకు మధ్యలోనే ఉన్న కలకత్తా 

అలాగే, మైసూరు రాష్ట్రం ఉండేది. 
దాని చుట్టూ ఉన్న ప్రదేశాలకి 
బెంగళూరు కానీ మైసూరు కాని అందుబాటులో ఉండేవి... 
తరవాతి కాలంలో దానిలో హైదరాబాదు/బాంబే రాష్ట్రంలలో ఉన్న
 ఉత్తర కర్నాటకా కలియటంతో ఆ రాష్ట్ర రాజధాని మరీ క్రిందకి మారినట్టు అయ్యింది.
కేరళా కూడా రెండు రాజ్యాలుగా ఉండి, 
రెండు రాజధానులు ఉన్నాయి.
తరవాత రెండు కలిసి ఒకటై... క్రింది రాజధాని మిగిలింది.


ఇకపోతే,  ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్,  లాంటి 
11 రాష్ట్రాలలో రాజధాని మధ్యలోనే ఉన్నది. 
ఇందులో 9 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినవే...
అందువలన, రాజధాని మధ్యలోనే ఉండి తీరాలే కానీ 
ఏ కర్నూలులో ఉండి ఆంధ్రుల కన్నా తెలంగాణావారికీ, 
కర్నాటకా వారికీ అందుబాటులో ఉండకూడదు.... 
అలాగే,  మరో ప్రక్కన ఉండి 
ఇప్పటికే ఒరియా మరియూ చత్తిష్ ఘడ్ వారితో నిండిన విశాఖలో కూడా 
రాజధానిని పెట్టటం సమంజసం కాదు... 
అంతెందుకు, 
ఆంధ్రా రాజధానిగా ఒక మూలగా ఉన్న కర్నూలు అవటం వల్లనే...
దానిని కొత్తగా కలిసిన హైదరాబాదు రాష్ట్రంలోనికి మార్చారు ... 
ఎక్కువ మంది ప్రజల నుండీ ఎటువంటి వ్యతిరేకతా రాలేదు... 
దానికి జనామోదం కూడా లభించింది. 
కారణం 
కర్నూలు కన్నా హైదరాబాదు అందుబాటులో ఉండటమే.
అయితే,
రాష్ట్రాల కలయిక తరవాత కూడా కర్నులే ఉండి ఉంటే ఏ గొడవలు వచ్చేవి కావు.
లేదా... 
అప్పటి పోటిలో విజయవాడ రాజధాని అయి, మార్చకుండా ఉన్నా 
ఏ ఉద్యమాలు వచ్చేవి కావు.
దీనికి కారణం...
అప్పటి నాయకుల 
అసమర్ధ రాజకీయ నిర్ణయమే...

ఏది ఏమైనా
పైన ఉన్న కారణాల వల్లకానీ, 
మరే కారణాల వలనగానీ, 
రాజధానిని 
తప్పనిసరిగా 
ఓ ప్రక్కన  నిర్మించాలిసిన పరిస్థితి 
ఇప్పుడున్న
ఆంధ్రప్రదేశ్‌కు లేదు.

కాబట్టి,

రాజధానిని ఎక్కడ నిర్మిస్తే
అందరికీ అన్నివిధాలా అందుబాటులో ఉంటుందో 
చూసి మరీ నిర్మించటానికి
కావాలిసినంత 
స్వాతంత్రం ఉన్నది.

అనవసర లోకల్ సెంటిమెంటులకో 
బూజుపట్టిన ఒప్పందాలకో లొంగో
ప్రాంతీయ దురభిమానాలకి లోనయో
వెనకబడ్డారనే సాకుతోనో, 
[ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్ర నాయకులు ఇలానే అన్నారు]
మరల అసమర్ధ నిర్ణయాలు తీసుకోకుండా
మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని 
ఏ ఒక్క ప్రాంతానికో కట్టబెట్టకుండా,
రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే నిర్మించి;

మద్రాస్-హైదరాబాదులలో మోసపోయినట్లు 
మరోసారి మోసపోకుండా
రాజధాని ప్రాంతం మొత్తాన్ని 
13 జిల్లాల  ప్రజలందరికి "లోకల్ క్రింద"
హక్కు వచ్చేట్లుగా ఒక చట్టం చేస్తే
భవిష్యత్తులో మరో రాజధాని నిర్మించాలిసిన గతి పట్టదు.

 "స్వంతంగా నగరాలు నిర్మించుకోవటం తెలిసి
ఇప్పటికే 
మదరాసు-హైదరాబాదు లాంటి మహా నగరాల నిర్మాణంలో 
ప్రముఖ పాత్ర వహించిన సీమాంధ్రులకు 
కొత్త రాజధాని నిర్మాణం పెద్ద సమస్య కాబోదు".
ఈ విషయంలో అనవసర నాన్చుడు లేకుండా 
రాజధాని ఎక్కడో తేలిస్తే 
మిగిలినది సీమాంధ్ర ప్రజలే చూసుకుంటారు.

దీని గురించి
[లింకు నొక్కండి]  
అని ఈ బ్లాగులో 
ఒక సంవత్సరం క్రిందట
 సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు కాకముందే 
సూచించటం జరిగింది... 
దాని ప్రకారం అందరికీ అందుబాటుగా
రాజధానిని ప్రకాశం లేక కడప జిల్లాలలోని
  ప్రదేశాలలో పెడితే బాగుంటుందని వివరించటమే కాకుండా... 
ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యాలయాలని 
ఒకే చోట పెట్టకుండా 13 జిల్లాలలో పెడితే 
అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని 
వివరించటం జరిగింది.భారతదేశంలోని 28 రాష్ట్రాలలోరాజధానుల పారిస్థితి

[ఆంధ్రప్రదేశ్ కాకుండా]

11 రాష్ట్రాలలో రాజధానులు మధ్యలోనే ఉన్నవి.  ఇందులో కొత్తవి 9


ఉత్తర ప్రదేశ్ 
బీహార్ 
ఝార్ఖండ్ 
మధ్యప్రదేశ్
ఛత్తీస్ ఘర్ 
గుజరాత్ 
గోవా 
తెలంగాణా 
సిక్కిం 
నాగాలాండ్ 
మణిపూర్ ఎడారి/కొండలు/అడవులు వలన 8 రాష్ట్రాలలో రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నా...

జనసమర్ధం గల ప్రాంతాలకి దగ్గరలోనే ఉన్నాయి. .కొత్తవి 6


రాజస్థాన్ 
హిమాచల్ ప్రదేశ్ 
ఉత్తరాఖండ్
ఒరిస్సా
అరుణాచల్ ప్రదేశ్ 
మేఘాలయ 
మిజోరాం 
త్రిపుర 


మంచు/కొండలు మరియు ఆక్రమణ వలన 1[3]  రాష్ట్రాల రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నాయి.జమ్మూ అండ్ కాశ్మీర్ 
అరుణాచల్ ప్రదేశ్ [1]
పంజాబ్ [1]


విభజన వలన 8 రాష్ట్రాల రాజధానులు ప్రక్కకి ఉన్నాయి. అస్సాం 
హర్యానా 
పంజాబ్ 
మహారాష్ట్ర 
వెస్ట్ బెంగాల్ 
తమిళనాడు 
కేరళ 
కర్నాటక లింకులు నొక్కండి:
@@@@@@@@@@@@@@@@@@

  కర్టేసి:ఇందులోని మేపులన్ని గూగుల్ లోనివే...
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@