LOCAL WEATHER

12, ఆగస్టు 2014, మంగళవారం

నేరం మాది కాదు ఎలినివొలది...!!!

ఇప్పుడు మనదేశంలో వస్తున్న వాతావరణ మార్పులకి ఎక్కడో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలొ ఏర్పడిన ఎల్‌నివోలది అని మన వారు తేల్చి పారేశారు... మరి ఇదే దేశంలో కొన్ని చోట్ల ఎల్నివో ప్రభావం ఉండి మరికొన్ని చోట్ల ఉండదా...ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌నకు  మాత్రమే ఎల్నివోల ప్రభావం ఉంటుందా ...??? నిజమే ఇక్కడి వాతావరణం మార్పులకి అది "కూడా" ఒక కారణం అవుతే అవ్వచ్చును... అయితే అదే కారణం అని చెప్పటం మనని మనమే మోసం చేసుకోవటమే...ఎందుకంటే అదే ప్రభావం ప్రక్క రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు మీద కూడా ఉండాలి కదా...

ఇదెలా ఉన్నదంటే, వెనుకటికి ఒక సినిమా వచ్చింది..."నేరం నాది కాదు ఆకలిది" అని... దానిలో నేరాలు చెయ్యటానికి కేవలం పేదరికమే కారణం అన్నట్లుగా చూపించారు... నిజమే... నేరాలకి వెనుకాల ఒక కారణం ఆకలిది కావచ్చును... కానీ, అన్ని నేరాలకీ కారణం పేదరికం కాదు కదా... అలా అయినట్లయ్యితే, మన దేశంలో 40 కోట్లమంది పేదలున్నారని ఈ మధ్యనే తేల్చారు... వారందరూ కనుక నేరస్తులైతే... కానీ, మన దేశంలో అంత మంది నేరస్తులు లేరు... నేరాలకి కారణం పేదరికమే అని కొందరు సామాజిక వేత్తలూ కూడా అనటం... కేవలం పేదలని అవమానించటమే...ఈ రోజు వరకూ పట్టుబడుతున్న వేల కోట్లు తిన్న బడా దొంగలెవరూ పేదలు కాదు....

సరే, విషయంలోనికి వస్తే... వాతావరణ మార్పులకి అనేక కారణాలలో ఎల్నివోలో లేక మరేదో ఆకశంలో బొక్క పడటమో ఒకటి రెండు కారణాలు కావచ్చునేమో... మిగిలిన అనేక కారణాలు మన దగ్గరే ఉన్నాయి....

ఈ క్రింద చూడండి... అతి దగ్గరదాకా వచ్చిన అల్ప పీడనం ఎవరో తోసేసి నట్లుగా వెనక్కు పోయి...ప్రక్కనే ఉన్న ఒరిస్సాకూ ఎక్కువగానూ...కొద్దిగా తమిళనాడుకూ పోయింది. గాలి తూర్పు నుండి పడమరకే ఉన్నది...దానికి సరిగ్గా పడమర వైపునే ఉన్న ఆంద్ర తీరానికి కాకుండా మధ్యలో ఎదో కొండ అడ్డం వచ్చినట్లుగా ఎక్కువగా అడవులు వ్యాపించి ఉన్న ఒరిస్సాకు... మిగిలినది దక్షిణానికి చీలినది తమిళనాడుకీ చేరింది. తమిళనాడులో మనకన్నా ఎక్కువగా నగరీకరణ ఉన్నప్పటికీ, అక్కడ వాతావరణాన్ని వ్యతిరేకించే కారణాలు తక్కువగా ఉండి ఉంటాయి. 

శుక్రవారం నుండి ఆదివారం వరకూ...
దగ్గరగా వచ్చి...
దూరంగా వెళ్ళిపోతున్న అల్పపీడనం....
కొన్ని సంవత్సరాలుగా ఇలా వెనక్కు పోవటం మామూలే అవుతోంది...
ఆంధ్ర ప్రదేశ్‌నకు కూడా వర్షాలు రావాలంటే
ఏ పెద్ద వాయుగుండం బలంగా ఉంటేగానీ వర్షాలు పడటం లేదు... 

సోమవారం [11-08-2014]సాయంత్రం...
ఆంధ్ర ప్రదేశ్‌ తీరం వెంబడి వాయుగుండం లాగా 
ఎదో అగ్ని గుండం ఏర్పడినట్లున్నది...

అటు ఒరిస్సా బెంగాలులకు, ఇటు తమిళనాడుకు కాకుండా, కేవలం ఆంధ్ర ప్రదేశ్‌నకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది...కారణాలు వెదకకుండానే బోలెడు కనపడతాయి... ఇష్టా రాజ్యంగా అడవుల నరికి వేత...అందులో..సముద్ర ఒడ్డునే ఉన్న మడ అడవులని తొలగించటం...చేపల చెరువులూ..రొయ్యల చెరువులూ వెయ్యటం...వ్యవసాయ భూములలో చెట్లని పూర్తిగా తొలగించి ఎడారులుగా మార్చటం లాంటివి ముఖ్య కారణాలు... పారిశ్రామీకరణ జరిగితే వచ్చే దుష్ఫలితాలని, మన వాళ్ళు వ్యవసాయంతోనే తెచ్చేస్తున్నారు....

వీటిలో ముఖ్యంగా చేపల చెరువుల విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక సారవంతమైన భూములని గోతుల క్రింద మార్చి వాటిలో చేపలు పెంచటమే కాకుండా అవి పెరగటానికి అడ్డమైన మందులూ కలుపుతున్నారు... ఆ మందులని...అవి తయారు చేసే దేశాలలోనే నిషేధించారు... అలాంటి వాటిని తెచ్చి మన వాళ్ళు ఇక్కడ వాడుతున్నారు... అవి నీళ్ళలో కలిసి...ఎండ వేడిమికి ఆవిరిగా మారి... వాతావరణాన్ని విషతుల్యంగా మార్చి వేస్తున్నాయి...

ఇలాంటి వారిని వెనకేసుకొస్తున్న వారు వాడేది ఒకేమాట...వరి, చెఱకూ లాంటివి వేస్తే రైతులు నష్టపోతున్నారని. అలా అయినట్లైతే గంజాయీ లాంటివి పెంచితే ఇంకా లాభాలొస్తాయి కదా... కానీ, కేవలం లాభాల కోసమే భూములని ఎలాపడితే అలా వాడటానికి ఈ దేశంలో ఎవరికీ హక్కు లేదు...

ఈ విధంగా రైతులే కాదు పట్టణాలలో, నగరాలలో విపరీతంగా ఇళ్ళకి పెరిగిన డిమాండుతో...గృహ యజమానులు కూడా తమ ఇళ్ళలోని చెట్లని కొట్టేసి అక్కడ గదులు నిర్మించి అద్దెలకిచ్చి తమ వంతు పాపాన్ని తాము మూట గడుతున్నారు...ఏమైనా అడిగితే బ్రతుకు తెరువు...అసలు బ్రతికుంటే కదా బ్రతుకు తెరువు గురించి ఆలోచించేది...తమకి తాముగా ఏమైనా చేసుకొవటానికి అందరికీ హక్కున్నా...అందరి ఆరోగ్యాన్ని హరించే పనులు చేసే హక్కు ఎవరికీ లేదు...

వీరికి తోడు, వాతావరణాన్ని విశ్లేషించే రాజకీయ మహామహ వాతావరణ వేత్తలు... ఒక మూఢ నమ్మకంతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారు.... ఆయనెవరో చెపితేనే వర్షాలు పడతాయని...ఆయన ఉంటేనే వర్షాలు వస్తాయని....ఇప్పుడు వచ్చిన ఒకాయన వలన వర్షాలు పడవని వీరి వాదన... ఇలాంటి పరిస్తితులు కాకతాళీయంగా రావటమే వీరి వాదనకి బలం.... ఇది కానీ నిజమైతే... వర్షాలు కురిపించే ఆయన 30 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన జిల్లా... కరువు జిల్లాగా ఎందుకు అయ్యింది....??? ఇదేదో ఒకరిని వెనకేసుకుని వచ్చి వేరొకరిని అవమానించటానికి కాదు.... పర్యావరణం గురించి ప్రజలని చైతన్యవంతులని చెయ్యవలసిన రాజకీయ నాయకులే ఇలాంటి మూఢనమ్మకాలని ప్రచారం చెయ్యటం వలన అసలు విషయం మరుగున పడి, తప్పు ఏదైతే ఉన్నదో... దానిని సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతోంది.

కాబట్టి, ఈ విషయంపై శ్రద్ద పెట్టి, చేతులు కాలక ముందే... ఆకులని[చెట్లని]పెంచితే... అవి మనకి కాలకుండా చేస్తాయి...దీనికి గానూ కొన్నిటిని ప్రభుత్వపరంగా చేస్తేనే తప్ప ప్రజలలో చైతన్యం రాదు. వీటి గురించి ఇంతకు ముందే ఈ బ్లాగులో @"అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా.....???"[లింకు నొక్కండి]@ లో వ్రాయటం జరిగింది...అవి:


"దీని కోసం మాములుగా చెపితే జనం మాట వినరు కాబట్టి, ప్రభుత్వమే చట్టాలు చెయ్యటం మరియు పెనాలిటీలు వెయ్యటం ద్వారా ప్రజలకి జ్ఞానొపదేశం చెయ్యాలి... ఈ క్రింది విధంగా చేస్తే, మనకి కాకపోయినా మన తరవాతి తరానికైనా ఎండ వేడిని తగ్గించిన వారం అవుతాము....

1] ప్రతీ ఇంట్లో ఓ చెట్టు... ఆయా స్థల వైశాల్యాన్ని బట్టి చెట్లూ వుండి తీరవలసిందే అని ఒక చట్టం చేసి, పాటించని వారికి  ఇంకం టాక్సులలోనూ, మునిసిపల్ టాక్సులలోనూ పెనాలిటీలు వెయ్యాలి.

2] ఇళ్ళలో ఒక గది వేస్తె వచ్చిన అద్దెకంటే, ఆ ప్రదేశంలో చెట్టు లేనందుకే ఎక్కువ ఇంటి పన్ను వాసులు చెయ్యాలి. దీని వలన ఉన్న చెట్లు కొట్టి, గదులు వేసి అద్దెకిచ్చుకొనే వారిని కంట్రోలు  చెయ్య వచ్చును.

3] ఒక ఇంట్లో ఉన్న చెట్ల సంఖ్య ఎక్కువైతే, ఆ ఇంటి ముందర రోడ్డు మీద కూడా చెట్లు ఉన్నట్లైతే ఆ ఇళ్ళకు, ఇళ్లలోని వారికి అనేక టాక్సులలో రాయతీలు కల్పించాలి.

4] ఒక చెట్టుని కొట్టాలంటే... అది ఎక్కడున్నా సరే, దానికి ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చెయ్యాలి...అనుమతి లేకుండా చెట్లు కొట్టే వారిని హత్యానేరం క్రిందే చూడాలి... ఎందుకంటే భవిష్యత్తు తరాల ప్రాణాలని కాపాడేవి ఈ చెట్లే కదా....

5] చేపల చెరువులు తవ్వటానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి చెయ్యాలి. చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద విపరీతమైన టాక్సులు వెయ్యాలి.......వీటిని వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోనికి మార్చాలి. వ్యవసాయ దారులకి ఇచ్చే ఏ సౌకర్యాలూ  ఇవ్వకూడదు. వీళ్ళకి ఇచ్చే నీళ్ళని, లీటర్ల లెక్కన అమ్మాలి... మనం తాగాటానికే లేక కొనుక్కుని తాగుతున్నప్పుడు... ఈ చెవుల పరిశ్రమ ద్వారా కోట్లు గడిస్తున్న వీరికి,  ఉచితంగా నీళ్ళు ఎందుకివ్వాలి....??? దీంతో పాటు... వారు వాడుతున్న మందులని నిషేధించాలి.

6] ముఖ్యంగా దేశంలోని అడవుల శాతం తగ్గకుండా చట్టాన్ని కఠిన తరం చెయ్యాలి." 

ఇవ్వే కాకుండా... పర్యావరణ శాస్త్రవేత్తలని ఒక కమిటిగా నియమించి, వారు సూచించిన విధంగా జరిగేట్టు చూడటానికి ఒక విభాగాన్ని ఏర్పాటుచేయ్యాలి. వీరికి చట్టబద్ధమైన గుర్తింపునిచ్చి... వీరు సూచించినవి చెయ్యని వారిని శిక్షలు పడేట్లు చెయ్యాలి... మాములుగా ఒక హత్య జరిగితే అది ఏ ఇద్దరు వ్యక్తులకో లేక అక్కడి ఒక పరిమిత ప్రాంతానికో మాత్రమే సంబంధం ఉంటుంది... అయితే, పర్యావరణాన్ని పాడు చేస్తే అది మొత్తం వాతావరణానికే/మానవ సమాజానికీ కీడు చేస్తుంది... ఇది ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది... ఇదివరకు తుఫానులు వస్తున్నాయి అంటే తెగ భయపడే వారు... కానీ ఇప్పుడు అవి రావటం లేదని దిగులు పడుతున్నారు... ఇక ముందు తుఫాను వస్తుందంటే పెద్ద పండగే నిర్వహించే అవకాశం ఉన్నది. 


@@@@@@@@@@@@@@@@@@@
weather report courtesy:
@@@@@@@@@@@@@@@@@@@
photos GIF by krk

21-08-2014న 

10 రోజుల తరవాత కూడా ఇదే పరిస్తితి... మధ్యలో ఆంధ్ర ప్రదేశ్‌ ఖాళి.

మధ్యకాలంలో కొద్దిగా మేఘాలు కమ్ముకున్నా వర్షం మాత్రం సున్నా...


@@@@@@@@@@@@@@@@@@@
weather report courtesy:
@@@@@@@@@@@@@@@@@@@
photos GIF by krk





దీనికి ముందు వచ్చిన వ్యాసం....[లింకు నొక్కండి]

రాజధాని మధ్యలోనే ఉండి తీరాలా...కర్నూలు, విశాఖలు పనికిరావా...???











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి