LOCAL WEATHER

30, మే 2013, గురువారం

అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా.....????

అబ్బో ఎండలు, బాబోయ్ ఎండలు అనే మాటలు ఎటుచూసినా... ఎక్కడికి వెళ్ళినా వినపడుతున్నాయి....... అవును ఎండలే ఎండలు.... ఇలా అనేస్తున్న వారిలో ఎంత మందికి ఇలా అనే అర్హత ఉన్నదీ...????

అబ్బో ఎండలు మండిపోతున్నాయి అని అనటానికి కూడా అర్హత కావాలా... అవును కావాల్సిందే... ఇలా అనే వాళ్ళలో ఎంతమంది తమ జీవితంలో ఒక్క మొక్కనైనా నాటారు... తమ జీవిత కాలంలో ఆ చెట్టు తమ ఎత్తుకు దాటిపోతుంటే చూసి సంతోషించారు... సరేలే పోనీ... కనీసం ఇంట్లో ఉన్న చెట్లు కొట్టెయ్యకుండా ఉన్నారు.... కనీసం.. కనీసం ఇంట్లో కాకపోయినా రోడ్డుమీద తమ ఇంటిముందరైనా చెట్టుని పెంచినవారు ఉన్నారు... లేక ఉన్న చెట్టు ఇంటికి అడ్డమని కొట్టెయ్యకుండా ఉన్నారూ.... అలాంటి వారికి మాత్రమే ఇలా బాధపడే హక్కు, అర్హత ఉన్నది...

మిగిలిన వాళ్ళకి.... అంటే పేపరు మరియూ టీవీల నాలడ్జితొనో, చిన్నప్పటి నుండీ చేతికి మట్టి అంటకుండా ఉన్నవారు, జీవితకాలంలో ఒక్క మొక్కనైనా నాటని వారు,  మొక్కలు అంటే చెత్త అనుకునేవారు, వాస్తులూ...సిద్ధాంతాలూ అంటూ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్న చెట్లు కొట్టించేవారు,  ఇంటికో లేక తమ షాపుకో అడ్డంవొస్తోందని చెట్లుకొట్టించేవారు,...వీరు బాధపడాలిసిందే కానీ, ఏమిటీ ఎండలూ అని ప్రశ్నించే హక్కు లేదు....!!!


చెట్లతో కళగా ఉన్న ఇల్లు.........చేట్లుంటే చెత్త అనే అనాధ ఇల్లు[మోడల్].

ఇక గ్రామాల్లోనికి వెళితే, మాములుగా వ్యవసాయం చేస్తే ఎంతొస్తుందీ అని అనుకొని...ఏ చేపల చెరువులో, రొయ్యల చెరువులో తవ్వించుకొని లక్షలూ కోట్లూ గడిస్తున్న వారికి బాధపడే అర్హత లేదు. పైగా, ఇంతమందిని ఏడిపిస్తున్నందుకు శిక్షలకి మాత్రం అర్హులే....ఎందుకంటే వీరు తవ్వే చెరువుల్లో నానారకాలైన మందులూ.... అవికూడా విదేశాల్లో నిషేధానికి గురైన మందులు కలిపి, కలుషితమైన వాతావరణాన్ని సృష్టించుతున్నారు... ఈ పాపాన్ని కోస్తాలో నెల్లూరి నుండీ శ్రీకాకుళం వరకూ... చెరువులనీ, కుంటలనీ మాత్రమే కాకుండా కృష్ణా, గోదావరీ లాంటి నదులని కూడా ఆక్రమించి మరీ చేస్తున్నారు. ఇదొక అంటువ్యాధి; ఒక గ్రామంలో ఒకడుగానీ ఈ వ్యాధికి గురైతే మిగిలిన ప్రక్కనున్న వారు కూడా తమ పోలాల్ని తవ్వించెయ్యవలసిందే...రికార్డుల్లో వరి పండిస్తున్నట్లుగా ఉంటుంది....కానీ, డబ్బాశతో వారు   పండించేది  వాతావరణ కాలుష్యాన్ని......

విషమయమైన మందులని కలిపిన చేపల చెరువు....ఆ నీటి నుండి వచ్చిన ఆవిరి గాలికి దాని ఒడ్డునే ఉన్న కొబ్బరి మట్టలు[ఆకులు]మాడిపోయినాయి. ఆ గాలినే మనమూ పీలుస్తున్నాము.

ఈ క్రింది వీడియో చూడండి.....అది చెరువు కాదు...ఎవరి పోలంలోనో వేసిన చేపల చెరువు కాదు....అక్షరాలా గోదావరి నదిలో చక్కగా నిర్వహిస్తున్న చేపల చెరువులు.... మా దృష్టికి వస్తే చర్యలు తిసుకొంటాము అనే దృష్టి దోషం ఉన్న అధికారులకి ఇది కనపడలేదా...? చక్కగా ప్రక్కనే ఉన్న బ్రిడ్జి మీద నుండి వెళ్ళే అన్ని వాహనాల వారికి కనపడుతోనే ఉన్నాయి..........ఇది పాలకొల్లు...రాజోలు మధ్య ఉన్న గోదావరి నదిపై ఉన్న చించినాడ బ్రిడ్జి వద్ద వీడియో......

చేపల చెరువు కాదు......గోదావరి నదే.........

అబ్బే, అసలు పోల్యుషన్ అంతా పరిశ్రమల నుండీ, మనం వాడే ఫ్రిడ్జీలూ, ఏసిలు వలన ఎక్కువ వాతావరణం వేడెక్కుతోందనీ, ఎదో వాయువులూ అంటూ పేద్ద పేద్ద మాటలు వాడేసి తమ బాధ్యత ఏమీ లేనట్లుగా చేతులూ, నోరూ దులిపేసుకుంటున్నారు కొందరు కాస్త సైన్సు తెలిసిన విజ్ఞానులు....!!! మిగిలిన ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పరిశ్రమలూ, కాలుష్య గృహోపకరణాలూ తక్కువే... మన రాష్ట్రంలో మహా అయితే 5 లేక 6 చోట్ల మాత్రమే పరిశ్రమలు బాగా కేంద్రీకృతం  అయి ఉన్నాయి... మరి మిగిలిన ప్రదేశాల మాటామిటీ...??? ఇది వేరే వాటిమీదకి తప్పుని తోసేసి, మనదేమీ బాధ్యత లేదు అని అనిపించటానికి చేసే ప్రయత్నమే కదా.......


వీటినే మడ అడవులు అంటారు...ఇవి సముద్రం ఒడ్డున ఉండి వాతావరణ సమతౌల్యాన్ని ఇస్తాయి. వీటిని కొట్టేసి రొయ్యల చెరువులు వేస్తున్నారు.......

ఇలా అనేక పాపాల్ని, ఇటు నగరాల్లోనూ, అటు పల్లెల్లోనూ చేస్తూ ఉంటే ఎండాకాలంలో ఎండలు మండటం మనకి తెలియకుండా ఎలా ఉంటుందీ...??? ఆ మండే ఎండల తాపాన్ని తెలియకుండా చెయ్యగలిగేది ఒక్క వృక్ష రాజమే....!!! కానీ, ఆ చెట్ల జాతినే తమ డబ్బు దురాశకు ఓ ప్రక్క అంతమొందిస్తో... మరో ప్రక్కన ఎండలు బాబోయ్ అనే అర్హత ఎక్కడున్నదీ....???
ఇవి ప్రకాశం జిల్లా చిమకుర్తిలోని గ్రానైట్ త్రవ్వకాలు........ఇలా అడ్డగోలుగా తవ్వటం వలన, జిల్లాలో వేడి పెరిగి వర్షపాతం తగ్గిందని చెపుతున్నారు....కేవలం జిల్లాలోనే కాదు వీటి మీదుగా వచ్చే గాలుల వల్లనే గుంటూరు, విజయవాడల్లో కూడా  ఉష్ణోగ్రతలు పెరిగినాయట.....

కాబట్టీ, ఈ ఎండల వేడిని అధిగమించటానికి చెట్లు పెంచటంమే మార్గం... ఎందుకంటే పరిశ్రమలని తీసి వెయ్యలేము, మిగిలిన గృహొపకరణాలని వాడకుండా ఉండలేము...మిగిలిన వారిని అడ్డుకొనే పరిస్థితి లేదు.  అందువలన వాటికి విరుగుడుగా కనీసం ఒక్కో మనిషి, అతని జీవితంలో ఒక్క చెట్టునైనా నాటి, దానిని  అతని కంటే ఎత్తుగా చూడటమే దీనికి తరుణోపాయం.

"దీని కోసం మాములుగా చెపితే జనం మాట వినరు కాబట్టి, ప్రభుత్వమే చట్టాలు చెయ్యటం మరియు పెనాలిటీలు వెయ్యటం ద్వారా ప్రజలకి జ్ఞానొపదేశం చెయ్యాలి...  ఈ క్రింది విధంగా చేస్తే, మనకి కాకపోయినా మన తరవాతి తరానికైనా ఎండ వేడిని తగ్గించిన వారం అవుతాము....

1] ప్రతీ ఇంట్లో ఓ చెట్టు... ఆయా స్థల వైశాల్యాన్ని బట్టి చెట్లూ వుండి తీరవలసిందే అని ఒక చట్టం చేసి, పాటించని వారికి  ఇంకం టాక్సులలోనూ, మునిసిపల్ టాక్సులలోనూ పెనాలిటీలు వెయ్యాలి.

2] ఇళ్ళలో ఒక గది వేస్తె వచ్చిన అద్దెకంటే, ఆ ప్రదేశంలో చెట్టు లేనందుకే ఎక్కువ ఇంటి పన్ను వాసులు చెయ్యాలి. దీని వలన ఉన్న చెట్లు కొట్టి, గదులు వేసి అద్దెకిచ్చుకొనే వారిని కంట్రోలు  చెయ్య వచ్చును.

3] ఒక ఇంట్లో ఉన్న చెట్ల సంఖ్య ఎక్కువైతే, ఆ ఇంటి ముందర రోడ్డు మీద కూడా చెట్లు ఉన్నట్లైతే ఆ ఇళ్ళకు, ఇళ్లలోని వారికి అనేక టాక్సులలో రాయతీలు కల్పించాలి.

4] ఒక చెట్టుని కొట్టాలంటే... అది ఎక్కడున్నా సరే, దానికి ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చెయ్యాలి...అనుమతి లేకుండా చెట్లు కొట్టే వారిని హత్యానేరం క్రిందే చూడాలి... ఎందుకంటే భవిష్యత్తు తరాల ప్రాణాలని కాపాడేవి ఈ చెట్లే కదా....

5] చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద విపరీతమైన టాక్సులు వెయ్యాలి.......వీటిని వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోనికి మార్చాలి. వ్యవసాయ దారులకి ఇచ్చే ఏ సౌకర్యాలూ  ఇవ్వకూడదు. వీళ్ళకి ఇచ్చే నీళ్ళని, లీటర్ల లెక్కన అమ్మాలి........మనం తాగాటానికే లేక కొనుక్కుని తాగుతున్నప్పుడు.....ఈ చెరువుల పరిశ్రమ ద్వారా కోట్లు గడిస్తున్నా వీరికి,  ఉచితంగా నీళ్ళు ఎందుకివ్వాలి....???

6] ముఖ్యంగా దేశంలోని అడవుల శాతం తగ్గకుండా చట్టాన్ని కఠిన తరం చెయ్యాలి. వీటిని కొట్టే వారిని దేశాన్ని ఆక్రమించే వారి జాబితాలోనికి చేర్చాలి.

ఆ ఇదేమీ అయ్యే పనికాదులే, ఓ నెల రోజులు ఎండలని భరిస్తే ఆ తరవాత దానిని మర్చిపోవచ్చు, అని అనుకుంటే...అంతకన్నా తెలివితక్కువతనం లేదు... ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతున్న వేడి, రాబోయే రోజులలో ఒక నెలే ఉండాలని లేదు; సంవత్సరం పొడవునా ఉండచ్చు...అప్పుడు ఏ చెట్లు పాతిపెట్టినా పరిస్థితి చెయ్యదాటి, అవి బ్రతికే వాతావరణం లేక, నీరు లేక ఆ చెట్లతో బాటూ మనిషి జాతికూడా అంతరించే ప్రమాదం ఉన్నది......"చేతులు కాలేక ఆకులని పట్టుకొనే కన్నా,  ముందరే ఆకులకి చేతులు జోడిస్తే,  రాబోయే ప్రమాదాన్ని నివారించినట్లవుతుంది".......


బెంగళూరులో ఒక రోడ్డు చెట్లతో  ... ఈ పోలీసులు టెర్రరిస్టుల మీదకి దాడికి వెళ్ళబోవటం లేదు, విజయవాడలో ఒక ఎడారి రోడ్డు మిద
 ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. .......

ఈ చెట్ల విషయంలో బంగళూరు వారిని చూసి ఎంతైనా నేర్చుకోవాలి.........అక్కడ ఉన్నఇళ్ళ స్తలం 500 గజాలా లేక 50 గజాలా అని ఉండదు.......సాధ్యమైనంతవరకు చెట్లు పెంచాలనే చూస్తారు......రోడ్ల మీద చెట్లని కూడా అలానే కాపాడుకుంటారు....... అందుకనే నగరం ఎంత పారిశ్రామికంగా పెరిగినా... అది చల్లని నగరం అయినది. మనకు తెలియకపోయినా చూసినా నేర్చుకోవచ్చును కదా... పెద్దగా ఖర్చులేని పని కూడా...........కనీసం ఒక్కో మనిషి ఒక్క చేట్టునైనా పాతితే అదే భవిష్యత్తు తరాల వారికి  శ్రీరామ రక్ష.......

చివరిగా చల్లని వర్షం.......ఈ వీడియోలోని వర్షం శ్రీకాకుళం జిల్లా పలాస[కాశిబుగ్గ] లోనిది.....ఎండాకాలం ఎంత వేడిగా ఉన్నా, సాయంత్రం అయ్యేప్పటికి వర్షం కురుస్తుంది.....కారణం... ఈ ఊరు దగ్గరలో అడవులు ఉండటమే....ఈ మధ్య కాలంలో జీడి[జీడిపప్పు] పరిశ్రమల వలన వాతావరణం కలుషితం అవుతోందని వాటిని నిర్దాక్షణ్యంగా ఊరికి దూరంగా తరిమేస్తున్నారు.....

కాశిబుగ్గ బస్సు స్టాండు దగ్గర చల్లని వర్షం... 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 

ఇందులోని ఒకటో రెండో  బొమ్మలు గూగుల్ లోనివి 
  


ఈ రోజున వ్రాసిన 
 "అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా".....
 చదివిన అందరికి ధన్యవాదాలు.