LOCAL WEATHER

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

"పైరసీ సామాజిక వేత్తలూ"...ఏది పైరసీ...??!!! [PIRACY]

ఈ మద్యన... ఎదో సినిమా ఇంకా రిలీజు కాకుండానే పైరసీకి గురైందని, మన బాధ్యత గల సామాజికవేత్తలు తెగ కంగారు పడిపోయి...తమ సామాజిక బాధ్యతగా ఆ పైరసీ చేసిన వాడిని.... అది చెయ్యాలి... ఇది చెయ్యాలి అనీ... చివరికి వాడిని ఉరి తియ్యాలి అనేదాకా వెళ్ళిపోయింది వారి "సామాజిక బాధ్యత". నిజమే, కష్టమొకరిదీ...అదే... సొమ్ము ఒకరిదీ సోకు మరొకరిదీ అయ్యేటప్పటికి అలానే కడుపుమండుతుంది మరి... 

అయితే, ఈ సామాజిక బాధ్యత కేవలం ఎవడో తీసిన సినిమాలకేనా లేక సమాజంలో ఉన్న అన్నిటికీ వర్తిస్తుందా...??? ఎవడో 3 గంటల సినిమా తీస్తే... దానికి పైరసీ వస్తేనే ఇంత హడావిడి చేస్తున్నవారు...... మరి, మిగిలిన పైరసీలు... అందునా ముఖ్యంగా తిండికి సంబంధించిన పైరసీ గురించి ఏమీ స్పృహ కలిగి ఉండరా...??? అయితే,  మన సామాజిక బాధ్యతగల వ్యక్తులని చూస్తే... అన్ని విషయాలలోనూ ఇదే ఉత్సాహం చూపిస్తారని  అనిపిస్తే,  మనం పైరసీలో కాలెట్టినట్లే...!!!

తిండికి సంబంధించిన పైరసీనా...!! అని అశ్చర్యపడకండి... రైతు ఏ కొన్ని రోజులో కాకుండా, నెలలకి నెలలూ... సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటను, "రైతు మార్కెట్టులో" వేలం పేరుతొ మోసంతో తేలిగ్గ కొట్టేసి... "ప్రజా మార్కెట్టులో" విపరీత రేటుకి అమ్ముతున్న పైరసీదార్ల గురించి అన్నమాట... ఉదాహరణకి... పైరసీ దారులు కుమ్మక్కై...రైతు దగ్గర నుండీ కిలో ఉల్లిపాయలని 4 లేక 5 రూపాయలకి కొని..."తమ మర్కెట్టులో" వేలం ద్వారా 30, 40 రూపాయలకి పెంచేసి...తీరా అవి మన దగ్గరకి వచ్చెటప్పటికి కిలో 50, 60 రూపాయలకి దొరికేట్టు చేసే వీరిని ఏమనాలి...? వీరిని, పైరసీ సామాజిక బాధ్యతగల  పౌరులు.. ఆపరా....??? ఇలాంటివే అన్ని రకాల నిత్యావసరాలు.

రోజు వారి నిత్యావసరాలే ఈ విధంగా పైరసీకి గురవుతుంటే మాట్లాడని మన సామాజిక వేత్తలు.... సమాజం మంచి కోరే వారేనా, లేక వీరు "పైరసి[కి] సామాజిక వేత్తలా"...??? వీరికి తోడు టీవీలలోనూ...న్యూస్ పేపర్లలోనూ ఒకటే గోల..... ఇలా వచ్చి అలా పొయ్యే సినిమాకే ఇంత గోల చేస్తున్నప్పుడూ....రోజు రోజుకీ విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగినా, వాటిని పండించే రైతులకీ ఆ ప్రతిఫలం అందకుండా చేసే.... రోజూ వారీ "నిత్యావసరాల పైరసీకి" ఇంకెంత గొడవ చెయ్యాలీ...?? ఏ మాత్రం బాధ్యతతో వ్యవహరించాలీ...??? అలాగే, నిత్యావసరాలని వాడే సామాన్య పౌరులకీ ఇబ్బంది కలిగించే బ్రోకర్ల పైరసిని ఎలా ఎదుర్కోవాలి...???

సరే, సినిమా వారికి, సమాజంలోని "వారి సమాజ సేవకులు" ఇంత సేవ చేస్తుంటే, ఇంతకీ...సమాజం పట్లా సినిమావారి అభిప్రాయం ఏమిటని చూస్తుంటే...మొన్నీ మధ్య ఓ టీవీ వారు... ఒక సినిమా ప్రతినిధిని; ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల గురించి ప్రస్తావించగా..."మేము కేవలం డబ్బు సంపాయించుకోటానికే సినిమాలు తీస్తున్నాము" అని నిస్సిగ్గుగా బహిరంగంగానే చెప్పి..."తమని సమాజంలో జరిగే గొడవలలోనికి లాగటం అన్యాయం" అని  కూడా వాపోయాడు. ఇదీ సినిమా వారికి, సమాజం పట్ల ఉన్న బాధ్యత.


*************************************************************************************
*****************************************************************************
పైరసీ అంటే  ఈ లింకు నొక్కితే వచ్చేఇంగ్లీషుకి ముఖ్యమైన అర్ధాలు... తెలుగులో ...
దోచుకొవటం, దోపిడీ చెయ్యటం, కాపీ కొట్టటం,   దొంగతనం,   ఉల్లంఘించుట, 
సాహిత్య దొంగతనం, గ్రంథచౌర్యం[ఈ రెండు సినిమా వారికి బాగా తెలిసినవే] 
దొంగిలించుట[వేరే భాషల నుండీ ట్యూన్లని, కధలని] ,
చట్ట వ్యతిరేకం, దోపిడీ,
మొదలైన...14 అర్ధాలు ఉన్నాయి.  
పైరసీకి ఇన్ని అర్ధాలు ఉండగా  
అది కేవలం సినిమా వాళ్ళ కోసమే... అనే  అర్ధం వచ్చేట్లుగా 
సినిమా వారే  పైరసిని పైరసి చేసిపారేసారు.
*****************************************************************************
*************************************************************************************
*****************************************************************************
మచ్చుకకి తెలుగు పైరసీకి ఒరిజినల్  సాంగు చూడండి 
*****************************************************************************
*************************************************************************************

ఓ సామాజిక వేత్తలూ, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న సినీవారి పైరసీ సేవేనా... లేక ఈ పైరసీలు కూడా చూస్తారా...???

1] నిత్యావసరాల పైరసీ...పైన చెప్పుకున్నాము.

2] గృహావసర/కట్టడాల పరికరాలూ వస్తువుల పైరసి... ఒకడు కష్టపడి మార్కెట్టింగు చేస్తే, దానికి పైరసీగా తక్కువ ధరలో....తక్కువ నాణ్యతతో అమ్మే పరిస్థితి. దీని వలన సినీ పైరసీలోలాగా... సినిమా తీసిన వాడి కొంపే కాకుండా.... అందరి కొంపలూ కూలే అవకాశం ఉన్నది....!!!

3]మందులలో పైరసీ...ప్రాణావసరాలకి సంబంధించిన మందుల గురించి చెప్పనే అఖర్లేదు...!!! దొంగ మందులు సప్లై చేసే అనేక పైరసీ కంపనీలూ ఉన్నాయి...అలాగే ఈ బొగస్ మందులనే వాడించే పైరసీ ఆసుపత్రులూ ఉన్నాయి...!!! ఇక, ఇంకో మందు... అంటే ప్రాణావసర మందులు కాదండోయ్... ఈ మందు వలన కూడా పైరసీ దార్ల కల్తీతో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు...

4] రాజకీయ పైరసీ...ఎవరో ఒక పార్టీని పెట్టి, నమ్మకాన్ని కలిగిస్తే... అది జరిగి  వందేళ్ళో లేక 30, 40 ఏళ్ళో అయినా కూడా...  అందులో ఉన్న వారు, "ఆ పార్టీ పెట్టిన/నడిపిన వారి పేరు పెట్టుకొని//చెప్పుకుని" చేసేదే రాజకీయ పైరసీ...దీని వలన సామాన్యులే కాదు... దేశమే తీవ్రంగా నష్టపోతోన్నది....

ఫెసుబూక్ సౌజన్యంతో...

5] పైరసీ ఉద్యమ[నాయకులు]కారులు...ప్రజా ఉద్యమాల పేరుతో... పైరసీ ఉద్యమాలు నడుపుతూ... ఒక్క రూపాయి లేకుండా ఉన్న వారు... వేల కోట్ల రూపాయలు సంపాయించు కొన్న//కొంటున్న వారు..., కనీసం తాము నివసించే సందులో కూడా గతి లేని వారు.... రాష్ట్ర నాయకులుగా ఎదిగేవారు. ఇలాంటి వారి వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలూ....రెండూ ఉన్నాయి.... విచిత్రం ఏమంటే...ఏ ప్రజలు, ఏ ప్రాంతం అంటే పడదంటారో... ఆ ప్రాంతం వారి పేర్లే పెట్టుకుంటారు.....ఆ ప్రాంతంలోనే ఆస్తులు కొంటారు. ఇది వారికి మాత్రమే పరిమితం...మిగిలిన సామాన్య ప్రజలెవ్వరు చెయ్యకూడదు....!!!

6] పైరసీ మీడియా... ప్రజల వార్తలని చూపించకుండా కేవలం రాజకీయ నాయకుల వెనుకాలే "హచ్చ్ కుక్కల్లాగే" తిరుగుతూ ఉన్న... కొన్ని[దరిదాపుల అన్నీ] స్పాన్సర్డు పైరసీ మీడియాలు....ఏదైనా ప్రకటన రావాలంటే "సెకండుకి ఇంత" "అంగుళానికి అంత" అనీ.... వేలు లక్షలు అడిగే ఈ మీడియా వారు.... ఎందుకనో మన రాజకీయ నాయకుల మీటింగులనే కాదు... వారి పర్సనల్ కామెంటులని కూడా "గంటలకి గంటలు లైవ్ చూపిస్తారు, అడుగుల కొద్దీ ప్రింటు చేసిపారేస్తారు"....ఏమీ లాభం లేకుండానే.....!!!!? 

7] పైరసీ మేధావులు.... సమాజం పట్ల అవగాహనతో మెలగాల్సిన వీరు, సమాజంపై తమ అభిప్రాయాన్ని రుద్ది... ప్రజల మధ్య విభేదాలూ...వైషమ్యాలూ పెంచిపోషించే వారు. ఈ పనిని వారు ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ మరీ చేస్తారు....!!!  

ఇలా చెప్పుకుంటూ పొతే అనేక పైరసీలు... దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటికేమీ ప్రతిస్పందించని "పైరసీ సామాజిక స్పృహ" కలిగిన వారు,  సామాన్యునికి ఏ మాత్రం సంబంధం లేని, ఏ కొందరి కోట్ల రూపాయల వ్యాపారాలకి సంబంధించిన వాటిపట్ల మాత్రమే, సామజిక చైతన్యం కలిగి ఉండటాన్ని ఏమనాలి...??? 

కాబట్టి, సామాన్యులకి ఏ మాత్రం సంబంధం లేని,  కొట్ల రూపాయల సిని వ్యాపార పైరసి కొసం... రెచ్చగొట్టే చైతన్యం తీసుకు రావటం కాదు... అసలు సిసలైన "సామాజిక పైరసీలపట్ల" అవగాహన వచ్చేటట్లుగా...  పైరసీ సామాజికవేత్తలూ,  సినిమా వారూ...అలాగే మన మీడియా వారూ... కృషి చెయ్యాలి.


ఫెసుబూక్ సౌజన్యంతో..

కొసమెరుపు ఏమంటే, 
ఈ పోష్టుకి సరిపొయ్యే బొమ్మలు వేద్దామని 
"గూగుల్ మంత్రగత్తెను" అడిగితే....
"పైరసీ అంటే... 
కేవలం సినిమాలు మరియు సాఫ్టువేర్లకి 
సంబంధించిన బొమ్మలు మాత్రమే" ఎక్కువగా వచ్చాయే కానీ.... 
"ప్రపంచంలో పైరసీకి గురవుతున్న మిగిలిన
 ఏ కష్టానికి సంబంధించిన విశేషాలు" కనపడలేదు. 
చివరికి దాని అసలు అర్ధం అయిన... 
సముద్ర దొంగతనం బొమ్మలు కూడా ఒకటో రెండో వచ్చాయి... 
పాపం ఎంత మంత్రగత్తె అయినా ఏమిచేస్తుంది...
పాత గాంధి కోసం సెర్చి చేస్తే... 
ప్రజెంటు గాంధీలని కూడా చూపిస్తుంది... 
మంచి చెడులు, నిజానిజాలు దానికేమి తెలుస్తాయి....
ఏది ఎక్కువ అప్లోడ్ చేస్తే, అదే చూపిస్తుంది.... 
సరే, ఏం చేస్తాం... 
ఈ పైరసీ విషయంలో 
మనవారిని మాత్రమే తిట్టుకోవాలిసిన పనిలేదు...!!! 




జై హింద్ 






3, సెప్టెంబర్ 2013, మంగళవారం

రాష్ట్రాలా లేక శత్రు దేశాలా...???

మిడిల్ ఈస్ట్ లోని దేశాలలాగానే భారత్ లోని రాష్ట్రాలు తయారైనాయా...???

మన దేశంలో పరిస్థితులు చూస్తుంటే ఇది మొత్తం ఒకటే దేశమా... లేక అనేక దేశాల సముదాయమా అని సందేహం లేకుండా నిజమనిపించక మానదు....   

ముఖ్యంగా ప్రక్క ప్రక్కన వున్న రాష్ట్రాల మధ్య సంబంధాలని పరిశీలిస్తే....ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు కనీసం మన దేశానికీ...చైనా పాకిస్థాన్ల మధ్య కూడా ఉండవేమో అని అనిపించక మానదు. ఆ దేశాల మధ్య సైనికులు కాపలా కాస్తుంటారు ఇక్కడ వారుండరు.... అంతకన్నా తేడా ఏమీ కనపడటం లేదు.  

ఉదాహరణకి నీళ్ళ విషయానికి వస్తే.....ఆంధ్రా వాళ్ళు నీళ్ళు కావాలని కర్నాటకా వాళ్ళని అడిగితే నిబంధనలు ఉన్నప్పటికీ, ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి [ధర్మ సింగు అనే ముఖ్య మంత్రి కన్నడానికి ఉన్నప్పుడు] నీళ్ళని విడుదల చెయ్యకపోగా  ఓ చుక్క నీరు కూడా వదలమని ఖండితంగా చెప్పేశాడు. ఆ తరవాత వరదలు వస్తే అప్పుడు కూడా..."మేము తప్పనిసరై వదులు తున్నామే కానీ, చుక్క నీరు కూడా దిగువకు వదలటం ఇష్టం లేదని" తేల్చి మరీ వదిలారు. ఇలాంటి సంబంధాలే దరిదాపుల అన్ని రాష్ట్రాల మధ్యా ఉన్నాయి.    

ఇక చదువుల విషయానికొస్తే...ఒక రాష్ట్రంలో చదివిన డిగ్రీకి మరో రాష్ట్రంలో విలువ లేదు. ఒక రాష్ట్రం నుండీ మరో రాష్ట్రానికి ఖర్మ కాలి ఎవరన్నా విధ్యార్ధి దశలోనే వెళ్ళ వలసి వస్తే... వాడికి దేశం మారిపోయినంత అనుభుతిని కలిగిస్తాయి మన రాష్ట్రాల సంబంధాలు. ఇలా ఉంటే వాడికి దేశం అంతా ఒకటే అని ఎలా అనిపిస్తుంది........?? దేశభక్తి ఎలా ఏర్పడుతుంది....??? దీనికి తోడూ భాషా ఆధిపత్యం....

వ్యాపార విషయానికి వస్తే యూరప్పులో ఏ రెండు దేశాల మధ్యా లేనన్ని నిబంధనలూ... చెక్ పోస్టులూ మన దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య కనపడతాయి. ఒక రాష్ట్రానికి చెందిన వస్తువు మరొక రాష్ట్రానికి రావాలంటే విపరీత నిబంధనలు ఉంటాయి. ఇలాంటి నిబంధనలు అంతర్జాతీయ వ్యాపారాలకి కూడా కనపడవు.  

ప్రజలు ఒక చోట నుండీ మరో చోటకి వారిష్ట ప్రకారం నివసించటానికి కూడా రాష్ట్రాల మధ్య అనేక ఆటంకాలు//నిబంధనలు ఉన్నాయి. వీటిలో కొన్ని అధికారికమైతే.......మరి కొన్ని అనదికారమైనవి.... ప్రజలు కూడా ఒకరినొకరు విదేశీయులని చూస్తున్నట్లుగా చూసుకోవటం చాలా సర్వ సామాన్యం. అంతెందుకు రెండు జిల్లాల అవతల నుండీ మరో చోటకి వచ్చి అక్కడ స్థిరపడితే అదొక నేరంగానే చూస్తారు తప్ప భారతీయుడిగా వాడిని చూసే ప్రశక్తే లేదు. దీనికి ఏ తెలంగాణా ఊరో ఉదాహరణగా తీసుకోవాల్సిన పనిలేదు; కోస్తాలోని విజయవాడని తీసుకున్నా... ఇక్కడ మార్వారిలు వ్యాపారాల వల్లనే పెద్ద మార్కెట్టు అయినది..... అయినప్పటికీ వీరి డామినేషన్ ఎక్కువ అయినది అని గోణుక్కుంటారు. ఇక్కడ క్రింది తరగతి వ్యాపారాలన్నీ తూర్పు ఆంధ్రా వారివే....వీరి వల్లనే లోకల్ బీదవాళ్ళు పైకి రావటం లేదని ఓ వాదన........ ఈ మార్వారిలు లాగా...తూర్పు ఆంధ్రా వారిలాగా కష్టపడే తత్వం ఉన్నవారు మనలో ఎంతమంది ఉన్నారన్న ప్రశ్న లేపక పోగా......ఈ క్రమంలో బ్రతుకు తెరువుకు సంబంధించిన వాటిలో ప్రజల మధ్య వచ్చిన విభేదాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న రాజకీయ నక్కలు ఉండనే ఉన్నాయి....

ఈ పై కారణాల వల్లనే దేశంలోని ప్రాంతాలని పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుందనో లేక అభివృద్ధి చెయ్యటానికో విభజన చేస్తే అవి కాస్తా ఒక సపరేటు స్వాతంత్ర దేశాలుగా తయారైపోతున్నాయి. వారి వారి రాష్ట్రాలలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలని రెండో రకం సిటిజన్లుగా గుర్తిస్తున్నాయి. ప్రభుత్వాలే అలాగుంటే... ప్రజలు మరొక అడుగు ముందరికి వేసి వారిని తమ రాష్ట్రం నుండీ తరిమెయ్యాలనే భావనలోనికి వస్తున్నారు.

ఇక విషయంలోకి వస్తే.... 
మన రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రాష్ట్రాల  ఫెడరల్ వ్యవస్తే లేదు.....!!!
"FEDERAL"అనే మాటని రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.....
అంటే దేశంలోని రాష్ట్రాలు అనేవి కేవలం పరిపాలన సౌలభ్యం కోసం విభజింప బడినవే కానీ... 
వీటికి పూర్తి స్వాతంత్రం లేదు... 
ఫెడరల్ వ్యవస్థని మన రాజ్యాంగం అమెరికన్ రాజ్యాంగం నుండి సంగ్రహించినా,  
అక్కడి పద్దతులని అనుసరించి మన రాష్ట్రాలకి పూర్తిగా అధికారాలని ఇవ్వలేదు......  
ఉదాహరణగా అమేరికా సమ్యుక్త రాష్ట్రాలలో  
రాష్ట్రాల బట్టీ.... అధికారాలు దగ్గర నుండి క్రిమినల్ లా'లు దాకా మారిపోతుంటాయి. 
ఎవరి రాష్ట్ర గవర్నెన్సు వారిదే...
అధికారాలు చాలా వరకూ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి. 

కానీ ఇలాంటి పరిస్థితులు భారత్‌లో లేవు. అలాగే ప్రత్యేక అధికారాలని మన దేశంలోని రాష్ట్రాలకి ఇవ్వబడలేదు. అయినప్పటికీ అమెరికాలో ఉన్న రాష్ట్రాలకన్నా ఎక్కువగా అధికారాలని మన రాజకీయ నాయకులు ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని అపహాస్యాన్ని చేస్తున్నారు. అలా అధికారాలని మంచి కోసం ఉపయోగిస్తే పర్వాలేదు...కానీ, కేవలం ప్రజల మధ్య విద్వేషాలని రగల్చటానికే రాజకీయ నాయకులు అధికారాలని దుర్వినియోగ పరచి....ప్రక్క రాష్ట్రాలనే కాకుండా... ఏకంగా భారత దేశాన్నే శత్రుదేశం క్రింద అభివర్ణిస్తూ ప్రజలలో ద్వేష భావాన్ని రగిలిస్తున్నారు. 

మనం దీనికి  ఫ్రెష్యుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నా రాయల్ ఆంధ్రా తెలంగాణ విభజనని ఉదాహరణగా చెప్పుకోవచ్చును. తెలంగాణా రాష్ట్రం అంటూ ఏర్పడితే ఇక అక్కడ మనం ఉండలేము అనే భావనని రాయలాంధ్రా నాయకులు తెచ్చి...... ప్రజలని అభద్రతాభావంలో పడేస్తున్నారు. దానికి తగ్గట్టే తెలంగాణా ప్రజా నాయకులు తెలంగాణా అనే రాష్ట్రం ఏర్పడితే అక్కడ ఉన్న ఇతర ప్రదేశాల వారిని తరిమేయ్యటమే అన్న భావన కలిగేట్లు మాట్లాడి అక్కడి ప్రజలని తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఇరు పక్షాల నాయకులూ తమ స్వప్రయోజనాల కోసం వారి వారి నొటికోచ్చినట్లుగా ప్రేలాపనలు పేలి, ప్రజల మధ్య విద్వేషాలని రగల్చటమే కాకుండా... వారిని భయభ్రాంతుల్ని చేస్తున్నారు.రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. 

ఇలా రాష్ట్రాల విపరీత భక్తి పరిధి దాటి... దేశ లక్షణాలని ఏర్పరుచుకొని, మరో రాష్ట్రం వారిని పరదేశీయులుగా చూడటం ఎంత ముదిరింది అంటే... ఒకడు "మీ" తెలంగాణాకి రావాలంటే వీసాలు కావాలా అని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడితే, మొన్నమరొకడు "మేము" భారతీయులమే కాదు... అని అన్నాడు....అక్కడితో ఊరుకోక..."భారత దేశం మమ్మల్ని ఆక్రమించింది" అని అనేశాడు. వీళ్ళేదో  బాధ్యత లేని మామూలు వ్యక్తులు కాదు....... రాజకీయ నాయకులే. వీళ్ళు మాట్లాడిన సందర్భం ఎదైనప్పట్టికి.......వారు అసందర్భపు ప్రేలాపనలు పేలేరు......... కేవలం కాంట్రాక్టుల కోసమో, లేక రాజకీయ పదవుల కోసమో దేశాన్నే విస్మరించే స్థితికి రాజకీయ నాయకులే దిగజారిపోతే...ఇక మామూలు వ్యక్తుల మాటేమిటీ....???   వీరిలో వీరికి... నెల చివరికల్లా  "పని చేసినా.. చెయ్యకపోయినా" జీతాలిచ్చే ఉద్యోగాల కోసం  పోటి ఉండనే ఉన్నది...... 

ఈ పరిణామాలన్నీ 
అవకాశవాదులకీ, కాంట్రాక్టు గుంటనక్క రాజకీయ నాయకులకీ లాభమే తప్ప...
కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఎదో అద్భుతాలు జరిగిపోతాయన్న భ్రాంతిలో 
భారతీయులు ఒకరినొకరు కించపరుచుకోవాలిసిన పనీలేదు... 
అలాగే, రాష్ట్రం ఏర్పడంగానే ఎదో కోల్పోతామనీ, 
భూమి రెండుగా విచ్చిపోయి అక్కడికి చేరుకోలేమన్న భ్రాంతినీ కలిగించుకొని 
అవతల వారిని అవమానించాల్సిన పనీ లేదు. 
మరొక విషయం, 
కేవలం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడే ఈ రాష్ట్రాలు ఏర్పడంగానే 
ఏవో అద్భుతాలు జరిగి ప్రతీ వాడికీ పైనుండి ఉద్యోగాలూ ఊడిపడవూ 
లేక కోట్ల రూపాయలూ ఆకాశం నుండీ రావు.....
అలాగే, ఉన్న ఉద్యోగాలూ ఊడిపోవు. 
కోట్లాది రూపాయలు నష్టమూ రాదు...
ఈ విషయాలని ఇప్పటికే విడిపోయిన రాష్ట్రలని చూస్తే... ఇట్టే అర్ధం అవుతుంది.... 
ఈ మొత్తంలో విపరీతంగా లాభం పొందేది 
గుంటనక్క కాంట్రాక్టు రాజకీయ నాయకులు తప్ప 
ప్రజలకి ఒరిగేదేమీ లేదని ప్రజలు స్పృహకలిగి ఉండాలి.  

దీనికి కావాలిసిన మంచి వాతావరణం కోసం,  భారత రాజ్యాంగం... ప్రజల మధ్య విభేదాలు కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించి;  ప్రజలందరికీ.... సపరేటు అన్నవారికి...సమైక్యం అన్నవారికి .... "రాష్ట్రాలు ఏర్పడటం అంటే దేశం నుండీ విడిపోయి కొత్త దేశంగా ఏర్పడటం కాదు" అనే నమ్మకాన్ని కలిగించాలి.  "సామాన్య ప్రజలకి  పొయ్యేది//వచ్చేది కేవలం ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న ఉద్యోగాలు మాత్రమే కానీ....... భారతీయ పౌరసత్వం కాదు"  అనే ధైర్యాన్ని ఇవ్వాలి.  తరవాత, ఏ రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి పంపకాలైనా రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా... ఆయా రాష్ట్రాలని పరిపాలించే రాజకీయ పార్టీల/నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించటం  ద్వారా.... వారికి దేశం పట్ల భయాన్ని రాజ్యాంగమే కలిగించాలి. 


అలాగే కొత్త రాష్ట్రాలు ఏర్పడినాక కూడా 
"ఉదయాన్నే సుర్యుడు మాములుగానే తూర్పునే ఉదయిస్తాడే కానీ 
పడమరనో దక్షిణాన్నో........ ఆకుపచ్చగానో లేక నీలంగానో ఉదయించడు" 
అని నమ్మకం కలిగించటమే కాదు...
అలా భ్రాంతికరమైన విషయాలని రెచ్చగొట్టే 
రాజకీయ నాయకులని  కఠినంగా శిక్షించి.....
మనమంతా భారతీయులమనే భావన ద్వారా 
ప్రజలకి ధైర్యం వచ్చేట్లు రాజ్యాంగ వ్యవస్థ వ్యవహరించాలి. 
అప్పుడే, ఏ "సపరేటు ఉద్యమాలూ....సమైక్య ఉద్యమాలంటూ" 
ప్రజలు ప్రలోభ పడకుండా ఉంటారు.  




జై హింద్ 





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???








చిత్రం గూగుల్ లోనిది