LOCAL WEATHER

30, మే 2013, గురువారం

అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా.....????

అబ్బో ఎండలు, బాబోయ్ ఎండలు అనే మాటలు ఎటుచూసినా... ఎక్కడికి వెళ్ళినా వినపడుతున్నాయి....... అవును ఎండలే ఎండలు.... ఇలా అనేస్తున్న వారిలో ఎంత మందికి ఇలా అనే అర్హత ఉన్నదీ...????

అబ్బో ఎండలు మండిపోతున్నాయి అని అనటానికి కూడా అర్హత కావాలా... అవును కావాల్సిందే... ఇలా అనే వాళ్ళలో ఎంతమంది తమ జీవితంలో ఒక్క మొక్కనైనా నాటారు... తమ జీవిత కాలంలో ఆ చెట్టు తమ ఎత్తుకు దాటిపోతుంటే చూసి సంతోషించారు... సరేలే పోనీ... కనీసం ఇంట్లో ఉన్న చెట్లు కొట్టెయ్యకుండా ఉన్నారు.... కనీసం.. కనీసం ఇంట్లో కాకపోయినా రోడ్డుమీద తమ ఇంటిముందరైనా చెట్టుని పెంచినవారు ఉన్నారు... లేక ఉన్న చెట్టు ఇంటికి అడ్డమని కొట్టెయ్యకుండా ఉన్నారూ.... అలాంటి వారికి మాత్రమే ఇలా బాధపడే హక్కు, అర్హత ఉన్నది...

మిగిలిన వాళ్ళకి.... అంటే పేపరు మరియూ టీవీల నాలడ్జితొనో, చిన్నప్పటి నుండీ చేతికి మట్టి అంటకుండా ఉన్నవారు, జీవితకాలంలో ఒక్క మొక్కనైనా నాటని వారు,  మొక్కలు అంటే చెత్త అనుకునేవారు, వాస్తులూ...సిద్ధాంతాలూ అంటూ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్న చెట్లు కొట్టించేవారు,  ఇంటికో లేక తమ షాపుకో అడ్డంవొస్తోందని చెట్లుకొట్టించేవారు,...వీరు బాధపడాలిసిందే కానీ, ఏమిటీ ఎండలూ అని ప్రశ్నించే హక్కు లేదు....!!!


చెట్లతో కళగా ఉన్న ఇల్లు.........చేట్లుంటే చెత్త అనే అనాధ ఇల్లు[మోడల్].

ఇక గ్రామాల్లోనికి వెళితే, మాములుగా వ్యవసాయం చేస్తే ఎంతొస్తుందీ అని అనుకొని...ఏ చేపల చెరువులో, రొయ్యల చెరువులో తవ్వించుకొని లక్షలూ కోట్లూ గడిస్తున్న వారికి బాధపడే అర్హత లేదు. పైగా, ఇంతమందిని ఏడిపిస్తున్నందుకు శిక్షలకి మాత్రం అర్హులే....ఎందుకంటే వీరు తవ్వే చెరువుల్లో నానారకాలైన మందులూ.... అవికూడా విదేశాల్లో నిషేధానికి గురైన మందులు కలిపి, కలుషితమైన వాతావరణాన్ని సృష్టించుతున్నారు... ఈ పాపాన్ని కోస్తాలో నెల్లూరి నుండీ శ్రీకాకుళం వరకూ... చెరువులనీ, కుంటలనీ మాత్రమే కాకుండా కృష్ణా, గోదావరీ లాంటి నదులని కూడా ఆక్రమించి మరీ చేస్తున్నారు. ఇదొక అంటువ్యాధి; ఒక గ్రామంలో ఒకడుగానీ ఈ వ్యాధికి గురైతే మిగిలిన ప్రక్కనున్న వారు కూడా తమ పోలాల్ని తవ్వించెయ్యవలసిందే...రికార్డుల్లో వరి పండిస్తున్నట్లుగా ఉంటుంది....కానీ, డబ్బాశతో వారు   పండించేది  వాతావరణ కాలుష్యాన్ని......

విషమయమైన మందులని కలిపిన చేపల చెరువు....ఆ నీటి నుండి వచ్చిన ఆవిరి గాలికి దాని ఒడ్డునే ఉన్న కొబ్బరి మట్టలు[ఆకులు]మాడిపోయినాయి. ఆ గాలినే మనమూ పీలుస్తున్నాము.

ఈ క్రింది వీడియో చూడండి.....అది చెరువు కాదు...ఎవరి పోలంలోనో వేసిన చేపల చెరువు కాదు....అక్షరాలా గోదావరి నదిలో చక్కగా నిర్వహిస్తున్న చేపల చెరువులు.... మా దృష్టికి వస్తే చర్యలు తిసుకొంటాము అనే దృష్టి దోషం ఉన్న అధికారులకి ఇది కనపడలేదా...? చక్కగా ప్రక్కనే ఉన్న బ్రిడ్జి మీద నుండి వెళ్ళే అన్ని వాహనాల వారికి కనపడుతోనే ఉన్నాయి..........ఇది పాలకొల్లు...రాజోలు మధ్య ఉన్న గోదావరి నదిపై ఉన్న చించినాడ బ్రిడ్జి వద్ద వీడియో......

చేపల చెరువు కాదు......గోదావరి నదే.........

అబ్బే, అసలు పోల్యుషన్ అంతా పరిశ్రమల నుండీ, మనం వాడే ఫ్రిడ్జీలూ, ఏసిలు వలన ఎక్కువ వాతావరణం వేడెక్కుతోందనీ, ఎదో వాయువులూ అంటూ పేద్ద పేద్ద మాటలు వాడేసి తమ బాధ్యత ఏమీ లేనట్లుగా చేతులూ, నోరూ దులిపేసుకుంటున్నారు కొందరు కాస్త సైన్సు తెలిసిన విజ్ఞానులు....!!! మిగిలిన ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పరిశ్రమలూ, కాలుష్య గృహోపకరణాలూ తక్కువే... మన రాష్ట్రంలో మహా అయితే 5 లేక 6 చోట్ల మాత్రమే పరిశ్రమలు బాగా కేంద్రీకృతం  అయి ఉన్నాయి... మరి మిగిలిన ప్రదేశాల మాటామిటీ...??? ఇది వేరే వాటిమీదకి తప్పుని తోసేసి, మనదేమీ బాధ్యత లేదు అని అనిపించటానికి చేసే ప్రయత్నమే కదా.......


వీటినే మడ అడవులు అంటారు...ఇవి సముద్రం ఒడ్డున ఉండి వాతావరణ సమతౌల్యాన్ని ఇస్తాయి. వీటిని కొట్టేసి రొయ్యల చెరువులు వేస్తున్నారు.......

ఇలా అనేక పాపాల్ని, ఇటు నగరాల్లోనూ, అటు పల్లెల్లోనూ చేస్తూ ఉంటే ఎండాకాలంలో ఎండలు మండటం మనకి తెలియకుండా ఎలా ఉంటుందీ...??? ఆ మండే ఎండల తాపాన్ని తెలియకుండా చెయ్యగలిగేది ఒక్క వృక్ష రాజమే....!!! కానీ, ఆ చెట్ల జాతినే తమ డబ్బు దురాశకు ఓ ప్రక్క అంతమొందిస్తో... మరో ప్రక్కన ఎండలు బాబోయ్ అనే అర్హత ఎక్కడున్నదీ....???
ఇవి ప్రకాశం జిల్లా చిమకుర్తిలోని గ్రానైట్ త్రవ్వకాలు........ఇలా అడ్డగోలుగా తవ్వటం వలన, జిల్లాలో వేడి పెరిగి వర్షపాతం తగ్గిందని చెపుతున్నారు....కేవలం జిల్లాలోనే కాదు వీటి మీదుగా వచ్చే గాలుల వల్లనే గుంటూరు, విజయవాడల్లో కూడా  ఉష్ణోగ్రతలు పెరిగినాయట.....

కాబట్టీ, ఈ ఎండల వేడిని అధిగమించటానికి చెట్లు పెంచటంమే మార్గం... ఎందుకంటే పరిశ్రమలని తీసి వెయ్యలేము, మిగిలిన గృహొపకరణాలని వాడకుండా ఉండలేము...మిగిలిన వారిని అడ్డుకొనే పరిస్థితి లేదు.  అందువలన వాటికి విరుగుడుగా కనీసం ఒక్కో మనిషి, అతని జీవితంలో ఒక్క చెట్టునైనా నాటి, దానిని  అతని కంటే ఎత్తుగా చూడటమే దీనికి తరుణోపాయం.

"దీని కోసం మాములుగా చెపితే జనం మాట వినరు కాబట్టి, ప్రభుత్వమే చట్టాలు చెయ్యటం మరియు పెనాలిటీలు వెయ్యటం ద్వారా ప్రజలకి జ్ఞానొపదేశం చెయ్యాలి...  ఈ క్రింది విధంగా చేస్తే, మనకి కాకపోయినా మన తరవాతి తరానికైనా ఎండ వేడిని తగ్గించిన వారం అవుతాము....

1] ప్రతీ ఇంట్లో ఓ చెట్టు... ఆయా స్థల వైశాల్యాన్ని బట్టి చెట్లూ వుండి తీరవలసిందే అని ఒక చట్టం చేసి, పాటించని వారికి  ఇంకం టాక్సులలోనూ, మునిసిపల్ టాక్సులలోనూ పెనాలిటీలు వెయ్యాలి.

2] ఇళ్ళలో ఒక గది వేస్తె వచ్చిన అద్దెకంటే, ఆ ప్రదేశంలో చెట్టు లేనందుకే ఎక్కువ ఇంటి పన్ను వాసులు చెయ్యాలి. దీని వలన ఉన్న చెట్లు కొట్టి, గదులు వేసి అద్దెకిచ్చుకొనే వారిని కంట్రోలు  చెయ్య వచ్చును.

3] ఒక ఇంట్లో ఉన్న చెట్ల సంఖ్య ఎక్కువైతే, ఆ ఇంటి ముందర రోడ్డు మీద కూడా చెట్లు ఉన్నట్లైతే ఆ ఇళ్ళకు, ఇళ్లలోని వారికి అనేక టాక్సులలో రాయతీలు కల్పించాలి.

4] ఒక చెట్టుని కొట్టాలంటే... అది ఎక్కడున్నా సరే, దానికి ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చెయ్యాలి...అనుమతి లేకుండా చెట్లు కొట్టే వారిని హత్యానేరం క్రిందే చూడాలి... ఎందుకంటే భవిష్యత్తు తరాల ప్రాణాలని కాపాడేవి ఈ చెట్లే కదా....

5] చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద విపరీతమైన టాక్సులు వెయ్యాలి.......వీటిని వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోనికి మార్చాలి. వ్యవసాయ దారులకి ఇచ్చే ఏ సౌకర్యాలూ  ఇవ్వకూడదు. వీళ్ళకి ఇచ్చే నీళ్ళని, లీటర్ల లెక్కన అమ్మాలి........మనం తాగాటానికే లేక కొనుక్కుని తాగుతున్నప్పుడు.....ఈ చెరువుల పరిశ్రమ ద్వారా కోట్లు గడిస్తున్నా వీరికి,  ఉచితంగా నీళ్ళు ఎందుకివ్వాలి....???

6] ముఖ్యంగా దేశంలోని అడవుల శాతం తగ్గకుండా చట్టాన్ని కఠిన తరం చెయ్యాలి. వీటిని కొట్టే వారిని దేశాన్ని ఆక్రమించే వారి జాబితాలోనికి చేర్చాలి.

ఆ ఇదేమీ అయ్యే పనికాదులే, ఓ నెల రోజులు ఎండలని భరిస్తే ఆ తరవాత దానిని మర్చిపోవచ్చు, అని అనుకుంటే...అంతకన్నా తెలివితక్కువతనం లేదు... ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతున్న వేడి, రాబోయే రోజులలో ఒక నెలే ఉండాలని లేదు; సంవత్సరం పొడవునా ఉండచ్చు...అప్పుడు ఏ చెట్లు పాతిపెట్టినా పరిస్థితి చెయ్యదాటి, అవి బ్రతికే వాతావరణం లేక, నీరు లేక ఆ చెట్లతో బాటూ మనిషి జాతికూడా అంతరించే ప్రమాదం ఉన్నది......"చేతులు కాలేక ఆకులని పట్టుకొనే కన్నా,  ముందరే ఆకులకి చేతులు జోడిస్తే,  రాబోయే ప్రమాదాన్ని నివారించినట్లవుతుంది".......


బెంగళూరులో ఒక రోడ్డు చెట్లతో  ... ఈ పోలీసులు టెర్రరిస్టుల మీదకి దాడికి వెళ్ళబోవటం లేదు, విజయవాడలో ఒక ఎడారి రోడ్డు మిద
 ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. .......

ఈ చెట్ల విషయంలో బంగళూరు వారిని చూసి ఎంతైనా నేర్చుకోవాలి.........అక్కడ ఉన్నఇళ్ళ స్తలం 500 గజాలా లేక 50 గజాలా అని ఉండదు.......సాధ్యమైనంతవరకు చెట్లు పెంచాలనే చూస్తారు......రోడ్ల మీద చెట్లని కూడా అలానే కాపాడుకుంటారు....... అందుకనే నగరం ఎంత పారిశ్రామికంగా పెరిగినా... అది చల్లని నగరం అయినది. మనకు తెలియకపోయినా చూసినా నేర్చుకోవచ్చును కదా... పెద్దగా ఖర్చులేని పని కూడా...........కనీసం ఒక్కో మనిషి ఒక్క చేట్టునైనా పాతితే అదే భవిష్యత్తు తరాల వారికి  శ్రీరామ రక్ష.......

చివరిగా చల్లని వర్షం.......ఈ వీడియోలోని వర్షం శ్రీకాకుళం జిల్లా పలాస[కాశిబుగ్గ] లోనిది.....ఎండాకాలం ఎంత వేడిగా ఉన్నా, సాయంత్రం అయ్యేప్పటికి వర్షం కురుస్తుంది.....కారణం... ఈ ఊరు దగ్గరలో అడవులు ఉండటమే....ఈ మధ్య కాలంలో జీడి[జీడిపప్పు] పరిశ్రమల వలన వాతావరణం కలుషితం అవుతోందని వాటిని నిర్దాక్షణ్యంగా ఊరికి దూరంగా తరిమేస్తున్నారు.....

కాశిబుగ్గ బస్సు స్టాండు దగ్గర చల్లని వర్షం... 





@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 

ఇందులోని ఒకటో రెండో  బొమ్మలు గూగుల్ లోనివి 
  


ఈ రోజున వ్రాసిన 
 "అబ్బో ఎండలు మండిపోతున్నాయి...అనే అర్హత ఉన్నదా".....
 చదివిన అందరికి ధన్యవాదాలు.



 









26, మే 2013, ఆదివారం

వీరికే మానవహక్కులు లేవా....??????

మానవ హక్కులు అనగానే సామాన్యంగా దొంగలవో, లేక రోడ్లు రైళ్ళు పేల్చేసే వారివో  అనుకునేరు..... కానేకాదు............ ఈ క్రింది విడియో చూడండి. ఈ ప్రజలు  "ఏం పాపం చేసు'కొన్నారు"........... 


ఏం వీరెవరు టిక్కెట్టు కొనలేదా.......???  లేక ఏదైనా ప్రాంతంలో ప్రమాదం వచ్చి ఒక్కసారిగా రైల్వేవారు ఊహించని విధంగా వచ్చి పడిన ప్రయాణీకులా .....???  కానే కాదు... ప్రతీ  రోజు గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఇదే తంతు ...... ఈ కనిపించే విడియోలో జనం గోదావరి ఎక్స్ ప్రెస్ విశాఖలో బయలుదేరేప్పటికే ఉన్నవారే......... మరి తరవాత స్టేషన్లో ఎక్కేవారి గతి ఏమిటి.... ? రోజూ ఇంత రద్దీ ఉన్నప్పటికీ మన భారతీయ రైల్వేవారు ఎంతమాత్రం దయచూపరు... ఉన్నవి మూడున్నర బోగిలైనా అమ్మే జనరల్ టిక్కెట్లు  వేలల్లో ఉంటాయి... టిక్కెట్లు అమ్మేప్పుడు బోగీలు ఖాళీగాలేవని తెలియదా;  లేక భారతీయ సామాన్య మానవులకి హక్కులేవి లేవని వీరి ఉద్దేశమా.... ??? ఓ మానవ హక్కుల సంఘాలవారు మీరే చెప్పాలి.... !!!! లేక వీరు కనీస మానవ హక్కులకి నోచుకోక రైలులో లేట్రిన్ల దగ్గర ప్రయాణిస్తున్నారా...????

కేవలం ఈ ఒక్క రైలే కాదు.... దరిదాపులు అన్ని రైళ్లలోని జనరల్ బోగిల పరిస్థితి ఇంతే.... ఈ విషయమై ఒక టీటీఇ  "మీరు కావాలని ఎక్కితే మేమేమి చెయ్యగలం" అని అనేశాడు........ పైగా ఆర్టిసి బస్సులో ఇదే విధంగా ఎక్కటం లేదా అని ఎదురు ప్రశ్నించి, తమ తప్పుని కప్పెట్టుకోవాలని చూశాడు....  నిజమే ఎక్కుతాం;  కానీ, ఆ బస్సులో మహా అయితే ప్రయాణం చేసేది కొద్ది దూరం మాత్రమే, రైలులో లాగా వందల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యము........ అదీ రాత్రి పూట...........అని ఒక ప్రయాణికుడు అన్నాడు..... ఇంకో విషయం కూడా వున్నది ...... బస్సులో ఎక్కిన తరవాత టిక్కెట్టు తీసుకోవచ్చును......... అది మన ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది....... కాని రైలులో టిక్కెట్టు కొన్నాకే....  రైలు వొస్తే కాని పరిస్థితి తెలియదు, అని గడ్డి పెట్టాడు మరో ప్రయాణికుడు. 

ఎంత గడ్డిపెడితే మాత్రం ప్రయోజనం ఏమున్నది కనుక అధికారులలో ....... ఎప్పటికీ  జరుగుతున్న తప్పుని సమర్ధించుకోవటమే తప్ప,  ఆ తప్పు భవిష్యత్తులో సరిదిద్దుకోవాలి అనే జ్ఞానం లేనప్పుడు.... సామాన్యు మానవుల హక్కులు ఇలానే త్రొక్కివేస్తుంటే ... అడిగే నాధుడు లేనప్పుడు....!!!   ఆ ... ఆ...   ఎంఎల్ఏలు, ఎంపీల గురించి అడగకండి .... పాపం వారు , వారి వారి  "వ్యాపారాలో" బిజీగా ఉన్నారు... వారినెందుకు డిస్ట్రబ్ చెయ్యటమ్.... !!!

******************************************
 ******************************************

19, మే 2013, ఆదివారం

అత్తిపత్తి చెట్టు కనపడింది---[TOUCH ME NOT PLANT]...వీడియో

విజయవాడలో ఓ పార్కుకి వెళితే అక్కడ అత్తిపత్తి చెట్టు కనపడింది ..... ఈ చెట్టులో విచిత్రం ఏమంటే మనం దిని ఆకులని ముట్టుకుంటే చాలు అలా ముడుచుకొని పోతాయి ......... అందుకే దిని పేరు ఇంగ్లీషులో TOUCH ME NOT అని ఉన్నాదనుకుంటా........ ఈ చెట్టుని విడియో తీసి యు ట్యూబ్ లో  పెట్టాను చూసి ఆనందించండి......  

---------------------------------------------------------------------------------------------------------



****************************
ఇంతకు ముందు వేసిన పోష్టు 

బాల్య వివాహాలూ---వృద్ధ వివాహాలు.......అనే శుభ "లేఖ"......!!!!


***************************************

16, మే 2013, గురువారం

బాల్య వివాహాలూ---వృద్ధ వివాహాలు.......అనే శుభ "లేఖ"......!!!!


ఈ మధ్య కాలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే కొందరు పెద్దలు పెద్దరికాన్ని భుజాన్న వేసుకొని వాటిని ఆపించినట్లుగా టివీలలో వార్తలు చూస్తున్నాము. అలా చెయ్యటంలో ఆ పెద్దలు   సామాజిక స్పృహ కలిగినట్లుగా,  తాము బాధ్యతాయుత పౌరులు అయినట్లుగా ప్రవర్తించి, ఈ ఒక్క విషయంలోనే,  అంటే ఆ పెళ్ళి ఆపించే వరకే పెద్దరికం వహిస్తున్నారు. మరి ఆ పెళ్ళి ఆగిపోయిన తరవాత ఆయా కుటుంబాల పరిస్థితి యేమిటీ, ఆ తరవాతి కాలంలో ఆ పిల్లలు పెద్దయిన తరవాత వారికే ఇచ్చి పెళ్ళి చేస్తున్నారా అనే అనేక విషయాల పట్ల ఈ పెద్దలకి పెద్ద పట్టింపు లేదు. కేవలం పెళ్ళి ఆపేవరకే పెద్దరికం.   

ఈ పెళ్ళీ వద్దు..... 

బాగానే ఉన్నది.... బాల్యవివాహాలు చట్టరీత్యానే కాక ఆరోగ్య రీత్యా మంచివి కావని మన యూరోపియన్లు చెప్పనే చెపారు. కాబట్టి, అది వారికే కరెక్టా... లేక మన సమాజంలో కూడా సరిగ్గానే ఉన్నదా లేదా అని ఆలోచించవలసిన పనిలేదు.....!!!! 

మరి,  వయసుకి ముందర పెళ్ళి చేసుకుంటే వచ్చే పరిస్థితులనీ, ఇబ్బందులనీ తెలుసుకొన్న పెద్దలు..... ఆ పెళ్లి వయసు వచ్చాక కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా భటాచారుల్లాగా తిరిగే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, సామాజిక బాధ్యత మరియూ సామాజిక భద్రత దృష్ట్యా ఏమైనా చట్టం చేయిస్తే బాగుండేది కదా....!!! దీని గురించి పెళ్ళిళ్ళు ఆపే పెద్దమనుషులు కూడా ఎప్పుడూ ఆలోచించినట్లుగా కనపడటం లేదు.... 

ఎందుకంటే, బాల్య వివాహం వలన  ఏమైనా చెడు ఫలితాలుంటే అవి ఏ ఇద్దరైతే చిన్నప్పుడే పెళ్ళి చేసుకొన్నారో వారికి మాత్రమే  ఇబ్బందిని కలిగిస్తాయి.  కానీ, వయసు ముదిరినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సమాజంలో తిరిగే వారి వలన, వారికే కాకుండా సామాజిక సంభంధాల వికృతం గానూ, మరియూ మొత్తం సమాజానికే శాంతి భద్రతల సమస్యగానూ...కలిగిస్తున్నాయి. ఈ కోణంలో మన పెద్ద మనుషులు ఎందుకు ఆలోచించటంలేదో ఆ పెద్దమనుషులకే అర్ధం కావాలి....

 ఈ పెళ్ళీ వద్దు..... 

ఇదివరలో, ఓ వయసు రాగానే పెద్దలు వారికి వారిష్టం వచ్చిన సంబంధాలని చూసి పెళ్ళిళ్ళు చేసిపారేసే వారు. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి... బాల్య వివాహాలు అనగానే కన్యాశుల్కంలో చిన్న పిల్లని ఓ ముసలతనికి కట్టబెట్టటమే అనుకోవఖర్లేదు. అలా జరిగినవి చాలా తక్కువనే చెప్పుకోవాలి.   

విషయంలోనికి వస్తే.... ఇప్పుడు పెద్దలు పెళ్ళీ అనగానే, పెరిగిన పిల్లలలో కొందరు అప్పుడే పెళ్ళా... కొంతైనా జీవితంలో "ఎంజాయ్" చెయ్యకుండానే... అని అనేస్తున్నారు.... ఇంతకీ ఎంజాయ్ చెయ్యటం అంటే ఏమిటో వారికే తెలియాలి...!!!  మరికొందరు... అప్పుడే పెళ్ళా... ఇంకా జీవతంలో సెటిల్ కాకుండానే...ఎంత సంపాయిస్తే సెటిల్ అయినట్లో.....!!! ఇక మరికొందరు పెళ్ళిళ్ళకి సిద్ధంగానే ఉన్నప్పటికీ, వారి కుటుంబ పరిస్థితి  దృష్ట్యా వారికి పెళ్ళియోగం ఉండదు... అంటే పెళ్ళి కావాలిసిన పైన పెద్దవారు ఉండటం... లేదా పెళ్ళి కావాలిసిన వారి సంపాదన మీదే ఆ కుటుంబం ఆధారపడి ఉండటంతో వారికి పెళ్ళి చేస్తే కుటుంబం గడవదనే భయం..... ముఖ్యంగా ఇది ఉద్యోగం చేసే ఆడవారి మీదే ఎక్కువ దుష్‌ప్రభావం చూపుతోంది. పాపం నోరు తెరిచి నాకు పెళ్ళి చెయ్యండీ అని అడగలేరు. తెచ్చిన జీతమంతా తల్లిదండ్రుల చేతిలోనే పోస్తారు.. అబ్బయిలకి ఉన్నట్లుగా స్వంత ఖర్చులు కూడా ఎక్కువ ఏమీ ఉండవు... ఈ విధంగా ఉద్యోగం చెయ్యటం వల్లనే పెళ్ళి కాకుండా ఉన్న వారు ఎందరో....  

ఇలాంటి కారణాలతో, కొన్ని సంవత్సరాలు గడిచిన తరవాత ఏ 30 యేళ్ళకో 35 యేళ్ళకో పెళ్ళి చేసుకుంటే, వారు తమ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చెయ్యగలరా...??? మైండు మెట్యూరిటీ దాటి, స్వంతంగా తమ పరిధిని తామే గిరి గీసుకొని బ్రతుకుతున్న వారు, ఆ వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని, తమ స్వంత పరిధిలోనికి ఇతరులని...మొగుడిని కానీ, పెళ్ళాన్ని కానీ రానిస్తారా...??? వారిద్దరూ ఎవరి దారిన వారు ఆలోచించటానికి అలవాటు పడిపోయిన తరవాత పెళ్ళి చేసుకొని సవ్యంగా కాపురాలు చెయ్యగలరా... ఎందుకంటే ఇదివరలో చేసుకొన్న బాల్య వివాహాల వలన సర్దుకుపోవాలిసిన పరిస్థితి ఉన్నదన్నప్పుడూ... అదే పరిస్థితి ఈ వృద్ధ వివాహాలలోనూ ఉంటుంది కదా....ఈ విధంగా 30 వయసు దాటిన పెళ్ళిళ్ళు సమాజానికి మంచిదా....???

ఇకపోతే, వయసు దాటి పెళ్ళుళ్ళు చేసుకొనే వారికి పిల్లలు పుట్టే విషయంలోనూ ప్రమాదకరమైన పరిస్థితులే ఉంటాయి... డాక్టర్లు చెప్పిన దానిపట్టి 18 యేళ్ళ వయసుకి ముందర ప్రెగ్నెన్సీ రావటం ఎంత ప్రమాదకరమో... అలాగే 30, 35 యేళ్ళ వయసు తరవాత ప్రెగ్నెన్సీ రావటం కూడా అంతే ప్రమాదం... 

అంతే కాదు, ఆ వయసులో పిల్లలు పుడితే... ఈ భార్యా భర్తల తల్లిదండ్రులకి[అత్తా మామలకి]తగిన ఓపిక ఉండకపోవచ్చునూ... లేక అసలు వారే ఉండకపోవచ్చును... కాబట్టి తమ పిల్లలని చూసే పెద్ద దిక్కు లేక, ఇద్దరూ ఉద్యోగాలు చేసి, పిల్లలని "పిల్లల ఆశ్రమంలో[BABY CARE CENTER]" ఉంచి పెంచితే, ఆ పెరిగిన పిల్లలు సమాజానికి ఏ మాత్రం బాధ్యతగా  ఉంటారో చెప్పలేము.... ఎందుకంటే, ఇదివరలో స్వంత తల్లిదండ్రుల దగ్గిర పెరిగిన వారే సమాజంలో వస్తున్న మార్పులకి లోనై, బాధ్యతా రాహిత్యంగా ఉంటుంటే... అసలు తల్లిదండ్రుల దగ్గరే పెరగని, వారి మనస్థత్వం వలన....  సమాజంలో ఒక బాధ్యత అనేది ఉంటుందా...?? పిల్లల ఆశ్రమంలో పెరిగిన పిల్లలు, పెరిగి పెద్దై తమ తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్చ కుండా ఉంటారా...??? 


ఈ పెళ్ళే ముద్దు... 

కాబట్టి, బాల్యవివాహాలు ఆపే ఓ పెద్ద మనుషులారా....ఆ బాధ్యతతో బాటే వయసు వచ్చినా పెళ్ళికాని వారి పెళ్ళిళ్ళు చేసే బాధ్యతని కూడా.....  మంచి పౌరుల్లా మీద వేసుకోండి... వారితో బాటూ తల్లిదండ్రులూ... ముఖ్యంగా కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామనుకొనే పిల్లలూ ఆలోచించండి... కెరీర్ లో   డబ్బు ఎంత ప్రధానమో... మన జీవితంలో "కాలం" కూడా అంతే ప్రధానం.... డబ్బుని కావాలంటే 50 యేళ్ళు వచ్చాక కూడా సంపాయించ వచ్చును. కానీ, సమాజంలో మనం బాధ్యతగా మన పిల్లలని పెంచాలంటే...అంటే  ఆ పిల్లలకి  ఉద్యోగం వచ్చి, వారికి పెళ్ళి చేసే వరకూ మనం ఉండాలంటే...  సకాలంలో పెళ్ళి చేసుకొని సకాలంలో పిల్లలని కనటం కూడా కెరీర్‌లో భాగమే అని తెలుసుకోవాలి....డబ్బు కెరీర్ కి సంబంధించినది అయితే...... పెళ్లి అనేది కాలానికి సంబంధించినది. పోయిన డబ్బుని సంపాయించు కావచ్చును కానీ........ జరిగిన కాలం తిరిగి రాదు .....


**********************

 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 


ఈ మధ్యన ఓ పెళ్ళికి మచిలీపట్టణం వెళ్లాను.. ఆ పెళ్ళిలో  సన్నాయి వాయిద్యం వాయించే వాళ్ళు 
ఎంతో చక్కగా వాయించారు... ఈ సందర్భంగా మీరూ విని ఆనందించండి .... 
ఏ దివిలో విరిసిన పారిజాతమో....... 





శుభం






   ఇందులోని బొమ్మలన్నీ గూగుల్ లోనివే 


************************************************************************************************************

ఇంతకు ముందు వేసిన పోస్ట్ 



ఆవకాయ చెయ్యటం ఎలాగు...???





************************************************************************************************************




తెలుగు అక్షరాలు    అ ఆ....వ్రాయాలని సరదా ఉంటే, వ్రాయటానికి ప్రయత్నించండి..... అన్నీ ఓ క్రమంలో వచ్చాయో లేదో ఈ క్రిందికి[bottom లోనికి]వెళ్లి అక్షరమాలలో సరి చూసుకోండి.