LOCAL WEATHER

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

"పైరసీ సామాజిక వేత్తలూ"...ఏది పైరసీ...??!!! [PIRACY]

ఈ మద్యన... ఎదో సినిమా ఇంకా రిలీజు కాకుండానే పైరసీకి గురైందని, మన బాధ్యత గల సామాజికవేత్తలు తెగ కంగారు పడిపోయి...తమ సామాజిక బాధ్యతగా ఆ పైరసీ చేసిన వాడిని.... అది చెయ్యాలి... ఇది చెయ్యాలి అనీ... చివరికి వాడిని ఉరి తియ్యాలి అనేదాకా వెళ్ళిపోయింది వారి "సామాజిక బాధ్యత". నిజమే, కష్టమొకరిదీ...అదే... సొమ్ము ఒకరిదీ సోకు మరొకరిదీ అయ్యేటప్పటికి అలానే కడుపుమండుతుంది మరి... 

అయితే, ఈ సామాజిక బాధ్యత కేవలం ఎవడో తీసిన సినిమాలకేనా లేక సమాజంలో ఉన్న అన్నిటికీ వర్తిస్తుందా...??? ఎవడో 3 గంటల సినిమా తీస్తే... దానికి పైరసీ వస్తేనే ఇంత హడావిడి చేస్తున్నవారు...... మరి, మిగిలిన పైరసీలు... అందునా ముఖ్యంగా తిండికి సంబంధించిన పైరసీ గురించి ఏమీ స్పృహ కలిగి ఉండరా...??? అయితే,  మన సామాజిక బాధ్యతగల వ్యక్తులని చూస్తే... అన్ని విషయాలలోనూ ఇదే ఉత్సాహం చూపిస్తారని  అనిపిస్తే,  మనం పైరసీలో కాలెట్టినట్లే...!!!

తిండికి సంబంధించిన పైరసీనా...!! అని అశ్చర్యపడకండి... రైతు ఏ కొన్ని రోజులో కాకుండా, నెలలకి నెలలూ... సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటను, "రైతు మార్కెట్టులో" వేలం పేరుతొ మోసంతో తేలిగ్గ కొట్టేసి... "ప్రజా మార్కెట్టులో" విపరీత రేటుకి అమ్ముతున్న పైరసీదార్ల గురించి అన్నమాట... ఉదాహరణకి... పైరసీ దారులు కుమ్మక్కై...రైతు దగ్గర నుండీ కిలో ఉల్లిపాయలని 4 లేక 5 రూపాయలకి కొని..."తమ మర్కెట్టులో" వేలం ద్వారా 30, 40 రూపాయలకి పెంచేసి...తీరా అవి మన దగ్గరకి వచ్చెటప్పటికి కిలో 50, 60 రూపాయలకి దొరికేట్టు చేసే వీరిని ఏమనాలి...? వీరిని, పైరసీ సామాజిక బాధ్యతగల  పౌరులు.. ఆపరా....??? ఇలాంటివే అన్ని రకాల నిత్యావసరాలు.

రోజు వారి నిత్యావసరాలే ఈ విధంగా పైరసీకి గురవుతుంటే మాట్లాడని మన సామాజిక వేత్తలు.... సమాజం మంచి కోరే వారేనా, లేక వీరు "పైరసి[కి] సామాజిక వేత్తలా"...??? వీరికి తోడు టీవీలలోనూ...న్యూస్ పేపర్లలోనూ ఒకటే గోల..... ఇలా వచ్చి అలా పొయ్యే సినిమాకే ఇంత గోల చేస్తున్నప్పుడూ....రోజు రోజుకీ విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగినా, వాటిని పండించే రైతులకీ ఆ ప్రతిఫలం అందకుండా చేసే.... రోజూ వారీ "నిత్యావసరాల పైరసీకి" ఇంకెంత గొడవ చెయ్యాలీ...?? ఏ మాత్రం బాధ్యతతో వ్యవహరించాలీ...??? అలాగే, నిత్యావసరాలని వాడే సామాన్య పౌరులకీ ఇబ్బంది కలిగించే బ్రోకర్ల పైరసిని ఎలా ఎదుర్కోవాలి...???

సరే, సినిమా వారికి, సమాజంలోని "వారి సమాజ సేవకులు" ఇంత సేవ చేస్తుంటే, ఇంతకీ...సమాజం పట్లా సినిమావారి అభిప్రాయం ఏమిటని చూస్తుంటే...మొన్నీ మధ్య ఓ టీవీ వారు... ఒక సినిమా ప్రతినిధిని; ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల గురించి ప్రస్తావించగా..."మేము కేవలం డబ్బు సంపాయించుకోటానికే సినిమాలు తీస్తున్నాము" అని నిస్సిగ్గుగా బహిరంగంగానే చెప్పి..."తమని సమాజంలో జరిగే గొడవలలోనికి లాగటం అన్యాయం" అని  కూడా వాపోయాడు. ఇదీ సినిమా వారికి, సమాజం పట్ల ఉన్న బాధ్యత.


*************************************************************************************
*****************************************************************************
పైరసీ అంటే  ఈ లింకు నొక్కితే వచ్చేఇంగ్లీషుకి ముఖ్యమైన అర్ధాలు... తెలుగులో ...
దోచుకొవటం, దోపిడీ చెయ్యటం, కాపీ కొట్టటం,   దొంగతనం,   ఉల్లంఘించుట, 
సాహిత్య దొంగతనం, గ్రంథచౌర్యం[ఈ రెండు సినిమా వారికి బాగా తెలిసినవే] 
దొంగిలించుట[వేరే భాషల నుండీ ట్యూన్లని, కధలని] ,
చట్ట వ్యతిరేకం, దోపిడీ,
మొదలైన...14 అర్ధాలు ఉన్నాయి.  
పైరసీకి ఇన్ని అర్ధాలు ఉండగా  
అది కేవలం సినిమా వాళ్ళ కోసమే... అనే  అర్ధం వచ్చేట్లుగా 
సినిమా వారే  పైరసిని పైరసి చేసిపారేసారు.
*****************************************************************************
*************************************************************************************
*****************************************************************************
మచ్చుకకి తెలుగు పైరసీకి ఒరిజినల్  సాంగు చూడండి 
*****************************************************************************
*************************************************************************************

ఓ సామాజిక వేత్తలూ, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న సినీవారి పైరసీ సేవేనా... లేక ఈ పైరసీలు కూడా చూస్తారా...???

1] నిత్యావసరాల పైరసీ...పైన చెప్పుకున్నాము.

2] గృహావసర/కట్టడాల పరికరాలూ వస్తువుల పైరసి... ఒకడు కష్టపడి మార్కెట్టింగు చేస్తే, దానికి పైరసీగా తక్కువ ధరలో....తక్కువ నాణ్యతతో అమ్మే పరిస్థితి. దీని వలన సినీ పైరసీలోలాగా... సినిమా తీసిన వాడి కొంపే కాకుండా.... అందరి కొంపలూ కూలే అవకాశం ఉన్నది....!!!

3]మందులలో పైరసీ...ప్రాణావసరాలకి సంబంధించిన మందుల గురించి చెప్పనే అఖర్లేదు...!!! దొంగ మందులు సప్లై చేసే అనేక పైరసీ కంపనీలూ ఉన్నాయి...అలాగే ఈ బొగస్ మందులనే వాడించే పైరసీ ఆసుపత్రులూ ఉన్నాయి...!!! ఇక, ఇంకో మందు... అంటే ప్రాణావసర మందులు కాదండోయ్... ఈ మందు వలన కూడా పైరసీ దార్ల కల్తీతో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు...

4] రాజకీయ పైరసీ...ఎవరో ఒక పార్టీని పెట్టి, నమ్మకాన్ని కలిగిస్తే... అది జరిగి  వందేళ్ళో లేక 30, 40 ఏళ్ళో అయినా కూడా...  అందులో ఉన్న వారు, "ఆ పార్టీ పెట్టిన/నడిపిన వారి పేరు పెట్టుకొని//చెప్పుకుని" చేసేదే రాజకీయ పైరసీ...దీని వలన సామాన్యులే కాదు... దేశమే తీవ్రంగా నష్టపోతోన్నది....

ఫెసుబూక్ సౌజన్యంతో...

5] పైరసీ ఉద్యమ[నాయకులు]కారులు...ప్రజా ఉద్యమాల పేరుతో... పైరసీ ఉద్యమాలు నడుపుతూ... ఒక్క రూపాయి లేకుండా ఉన్న వారు... వేల కోట్ల రూపాయలు సంపాయించు కొన్న//కొంటున్న వారు..., కనీసం తాము నివసించే సందులో కూడా గతి లేని వారు.... రాష్ట్ర నాయకులుగా ఎదిగేవారు. ఇలాంటి వారి వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలూ....రెండూ ఉన్నాయి.... విచిత్రం ఏమంటే...ఏ ప్రజలు, ఏ ప్రాంతం అంటే పడదంటారో... ఆ ప్రాంతం వారి పేర్లే పెట్టుకుంటారు.....ఆ ప్రాంతంలోనే ఆస్తులు కొంటారు. ఇది వారికి మాత్రమే పరిమితం...మిగిలిన సామాన్య ప్రజలెవ్వరు చెయ్యకూడదు....!!!

6] పైరసీ మీడియా... ప్రజల వార్తలని చూపించకుండా కేవలం రాజకీయ నాయకుల వెనుకాలే "హచ్చ్ కుక్కల్లాగే" తిరుగుతూ ఉన్న... కొన్ని[దరిదాపుల అన్నీ] స్పాన్సర్డు పైరసీ మీడియాలు....ఏదైనా ప్రకటన రావాలంటే "సెకండుకి ఇంత" "అంగుళానికి అంత" అనీ.... వేలు లక్షలు అడిగే ఈ మీడియా వారు.... ఎందుకనో మన రాజకీయ నాయకుల మీటింగులనే కాదు... వారి పర్సనల్ కామెంటులని కూడా "గంటలకి గంటలు లైవ్ చూపిస్తారు, అడుగుల కొద్దీ ప్రింటు చేసిపారేస్తారు"....ఏమీ లాభం లేకుండానే.....!!!!? 

7] పైరసీ మేధావులు.... సమాజం పట్ల అవగాహనతో మెలగాల్సిన వీరు, సమాజంపై తమ అభిప్రాయాన్ని రుద్ది... ప్రజల మధ్య విభేదాలూ...వైషమ్యాలూ పెంచిపోషించే వారు. ఈ పనిని వారు ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ మరీ చేస్తారు....!!!  

ఇలా చెప్పుకుంటూ పొతే అనేక పైరసీలు... దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటికేమీ ప్రతిస్పందించని "పైరసీ సామాజిక స్పృహ" కలిగిన వారు,  సామాన్యునికి ఏ మాత్రం సంబంధం లేని, ఏ కొందరి కోట్ల రూపాయల వ్యాపారాలకి సంబంధించిన వాటిపట్ల మాత్రమే, సామజిక చైతన్యం కలిగి ఉండటాన్ని ఏమనాలి...??? 

కాబట్టి, సామాన్యులకి ఏ మాత్రం సంబంధం లేని,  కొట్ల రూపాయల సిని వ్యాపార పైరసి కొసం... రెచ్చగొట్టే చైతన్యం తీసుకు రావటం కాదు... అసలు సిసలైన "సామాజిక పైరసీలపట్ల" అవగాహన వచ్చేటట్లుగా...  పైరసీ సామాజికవేత్తలూ,  సినిమా వారూ...అలాగే మన మీడియా వారూ... కృషి చెయ్యాలి.


ఫెసుబూక్ సౌజన్యంతో..

కొసమెరుపు ఏమంటే, 
ఈ పోష్టుకి సరిపొయ్యే బొమ్మలు వేద్దామని 
"గూగుల్ మంత్రగత్తెను" అడిగితే....
"పైరసీ అంటే... 
కేవలం సినిమాలు మరియు సాఫ్టువేర్లకి 
సంబంధించిన బొమ్మలు మాత్రమే" ఎక్కువగా వచ్చాయే కానీ.... 
"ప్రపంచంలో పైరసీకి గురవుతున్న మిగిలిన
 ఏ కష్టానికి సంబంధించిన విశేషాలు" కనపడలేదు. 
చివరికి దాని అసలు అర్ధం అయిన... 
సముద్ర దొంగతనం బొమ్మలు కూడా ఒకటో రెండో వచ్చాయి... 
పాపం ఎంత మంత్రగత్తె అయినా ఏమిచేస్తుంది...
పాత గాంధి కోసం సెర్చి చేస్తే... 
ప్రజెంటు గాంధీలని కూడా చూపిస్తుంది... 
మంచి చెడులు, నిజానిజాలు దానికేమి తెలుస్తాయి....
ఏది ఎక్కువ అప్లోడ్ చేస్తే, అదే చూపిస్తుంది.... 
సరే, ఏం చేస్తాం... 
ఈ పైరసీ విషయంలో 
మనవారిని మాత్రమే తిట్టుకోవాలిసిన పనిలేదు...!!! 
జై హింద్