LOCAL WEATHER

25, మార్చి 2012, ఆదివారం

ప్రజాసామ్యం అంటే 20 ట్వెంటీ క్రికెట్టు మేచ్ లాంటిదా!!!..?

ఇప్పుడూ కొత్త ఈవీఎం మెషీనులొచ్చిన తరవాత ఇన్‌వేలిడ్ అదే చెల్లని ఓట్లు లేవని ఒకాయన, నా నియోజక వర్గ ప్రజలందరూ నేను చెప్పిందే కోరుకుంటున్నారు అని మరొకాయన అంటుంటే నాకు వాటిమీదకు దృష్టి పోయింది. ఇప్పుడు చెల్లని ఓట్లు లేనే లేవా....ఆ గెలిచేవాడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకి తగ్గట్టే గెలుస్తున్నాడా.....

ప్రజాసామ్యం అంటే 20 ట్వెంటీ క్రికెట్టు మేచ్ లాంటిదా...? ఒక జట్టుకన్నా మరొక జట్టు ఒక్క పరుగు ఎక్కువ కొడితే గెలవటానికి?

ప్రజాసామ్యం అంటే ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం ఎన్నుకోబడిన వారిచే నడపబడే ప్రభుత్వమని అర్ధమయితే....ఇప్పుడు జరిగే ఎన్నికల వలన అలాంటి ఫలితాలే వస్తున్నాయా...?

ఉదాహరణకి ఒక నియోజక వర్గంలోని ప్రజలు సామాన్యంగా 60శాతం ఓటేస్తే; ఆ వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారు ఆ ప్రజలందరికీ అంటే ఆ ప్రాంత ప్రజల అందరి మనోభావాలని ప్రతిబింబిస్తున్నారని అనుకోవచ్చునా...?

అరవై శాతం ఓట్లలో ఒకడికి 35 శాతం మరొకడికి 33 శాతం, ఇంకొకరికి 21 శాతం మిగిలినవి -- కలగూరగంపలోలా నుంచునే స్వతంత్ర అబ్యర్ధులనబడే అసంతృప్తులు పొందుతారు. వీరిలో కేవలం 35 శాతం[అనగా కేవలం 21 మంది] వచ్చిన వాడు గెలిచినట్లా....? ఈ గెలిచిన వాడు మిగిలిన 79 మందికీ ఎలా ప్రాతినిధ్య వహిస్తాడు అనేదానికన్నా; ఇలా గెలిచిన వాడు మొత్తం ఆ నియోజక వర్గ ప్రజలందరి మనోభావాలకి అద్దం పట్టేవాడని ఎలా అనుకోగలము....?

మరి పై లెక్కలని అనుసరించి నూటికి 70 నుండి 79 మంది ఓట్లు చెల్లుబాటు అయినట్లేనా....?

పైన శాతాల సంగతి అటుంచితే; అసలు ఆ నియోజకవర్గంలో నుంచునే వాడిని ఆ నియొజకవర్గ ప్రజల అనుమతితోనే నుంచో పెడుతున్నారా .....?

తీరా గెలిచిన వాడు తాను గెలిచినది ప్రజాబలంతోనే అని గుండెమీద కాకపోయినా కనీసం ఎవరి నెత్తిన చెయ్య పెట్టైనా చెపుతున్నారా.....?

గెలిచిన వాడికి వాడి నియోజక వర్గ ప్రజల సమస్యలు కానీ కనీసం దాని పరిధులు అయినా తెలిసి ఉంటున్నదా......?

రాజరిక పరిపాలనా కాలంలో దుష్పరిణామాలు తెచ్చిన "వంశపారంపర్యం" ప్రజాసామ్యంలో వాడుకొంటూ, దానిని ప్రజలు అమోదించేసినట్లుగా ప్రచారం చేసే "చెంచాల" మాట కరెక్టేనా....?పై వాటిలో ఏ ఒక్కటైనా "అవును" అని సమాధానం వస్తే మనం ప్రజాసామ్యంలోనే ఉన్నామని అనుకోవటానికి వీలున్నది.

నేననుకోవటం పైవాటి సమాధానాలు చెప్పాలంటే ఏ మాత్రం కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండానే "కాదని" చెప్పవచ్చును. మరైతే మనం ప్రజాసామ్య పద్ధతిలోనే ఉన్నామని అనుకోవడం మనని మనం మోసం చేసుకొవటమే కదా...

సరే, మొత్తం కాక పోయిన కనీసం కొన్నైనా "అవును" అని అనిపించటానికి ఇలా చెస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

రాజకీయ నాయకులకి

1.అన్నిటికన్నా ముందర ఎన్నికలలో నుంచునే వారిని నియంత్రించాలి. అంటే ఎవరైనా వారి జీవిత కాలంలో రెండుసార్ల కన్నా గెలిచే అవకాశం ఇవ్వకూడదు. అనగా దేశంలోని ఏవ్యక్తికి అయినా 10 సంవత్సరాల అధికార కాలం[టైం] మాత్రమే ఇవ్వబడుతుంది.

2.అలా గెలిచిన వారి కాల వ్యవధి అయిన తరవాత, కనీసం 20 యేళ్ళ వరకూ ఆ వ్యక్తి వారసులు రాజకీయాలకి సంబంధించి ఎక్కడా ఎటువంటి పదవిలో ఉండకూడదు. 20 యేళ్ళ తరవాత మాత్రమే అటువంటివారు రాజకీయ పదవులకి అర్హులు. వారు కలిసున్నా విడాకులు తీసుకున్నా...

3. ముఖ్యమైనది, ఏ వ్యక్తి అయినా ఒక రాజకీయ పార్టీ తరపున నుంచోవాలంటే అతను కనీసం ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని అయిదు యేళ్ళు పైబడి ఉండాలి. అలా 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన తరువాతే అతను ఎటువంటి టిక్కెట్టుకైనా అర్హుడు.

3A. అలాగే ఏ వ్యక్తి అయినా స్వతంత్ర అభ్యర్ధిగా నుంచోవాలంటే ఆ వ్యక్తి కనీసం అయిదు సంవత్సరాలు పైబడి ఏ రాజకీయ పార్టీలో గానీ సభ్యత్వం ఉండకూడదు.

3B. ప్రభుత్వ ఏర్పాటుకు ఇండిపెండెట్ల ఓట్లు చెల్లవు, కేవలం నియొజక అభివృధి మాత్రమే అతని భాధ్యత.

4. అలాగే నుంచునే అబ్యర్ధి ఏదైనా రాకీయ పార్టీ తరపున నుంచునేట్లు ఉంటే అతని పూర్తి బాధ్యత ఆ పార్టీ అధ్యక్షులే వహించాలి. అంటే అతడు చేసే తప్పుడు పనులకి ఆ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలే గానీ, అతడిని రాజీనామా చేయించినంత మాత్రన ఆ బాధ్యత నుండీ తప్పించుకోజాలదు.

5. ఒక నియోజక వర్గంలో నుంచునే వ్యక్తి "పూర్తిగా" పుట్టుకతో ఈ దేశం వాడవటమే కాకుండా, అతని ఓటు ఆ నియోజక వర్గంలో కనీసం అయిదు సంవత్సరాల పైబడి ఉండి తీరాలి.

6.నుంచోటానికి ఎటువంటి డిపాజిట్లు వసూలు చెయ్య కూడదు. కానీ, పోలైన ఓట్లలో కనీస శాతం ఓట్లు రావాలి. అలా పడక పోతే 10 సంవత్సరాల వరకు అతడు తిరిగి నుంచో కూడదు.

7. ఎన్నికలలో నుంచుని ఓడిపోయిన అధికార మరియు ప్రతిపక్ష పార్టీ సభ్యులకు గానీ, వారి కుటుంబ సభులకు కానీ, వారి బంధువులకు గానీ మరియు వారి సంబంధీకులకు గానీ ఎటువంటి ప్రభుత్వ భాధ్యతలు లేక కాంట్రాక్టులు ఇవ్వరాదు. వారికి ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి కేటాయింపులు వుండరాదు. అలాగే గెలిచిన వారు తప్ప వారి కుటుంబ సభ్యులకు మరియు ఏ సంభంధీకులకు ప్రభుత్వ లాభదాయకాలు అందనీయరాదు.

8. ఎన్నికలలో నుంచుని తక్కువ మార్జినుతో ఓడిపొయిన సభ్యులను ఎగువ సభకు డైరెక్టుగా పంపాలి. పై నుండి క్రిందకు మార్జిన్ లెక్కించాలి. ప్రతిపక్ష సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

9. ఎన్నికలలో నుంచున్న వ్యక్తులు ప్రచారములో తమ పరిధికి మించి వాగ్దానాలు చెయ్యరాదు.

10. ఎంతకాలం వున్నా, ఎటువంటి బంధుత్వం వున్నా విదేశీయులు ఎన్నికలలో నుంచోటానికి అనర్హులు. వీరు రాజ్యాంగ సంస్థలు మరియు రాజ్యాంగ అమలు సంస్థలు మరియు మరే ఇతర ప్రభుత్వ అజమాయషీలకి అనర్హులు.

11. దేశానికి సంబంధించిన ముఖ్యమైన పదవులు అన్ని రాష్త్రాలకీ, మరియు రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలకీ రావాలి. అన్నీ అయిపోయిన తరవాత గానీ మరల వచ్చినవి రాకూడదు.

12. ఒక సారి ఎన్నిక అయిన వ్యక్తి ఆ 5 సంవత్సరాల కాలం తప్పని సరిగా సభ్యునిగా వుండవలెను. అతడు చనిపోయిన, అవినీతికి పాల్పడినప్పుడు గానీ మాత్రమే ఉప ఎన్నిక గురుంచి ఆలోచించాలి. ఏ వ్యక్తి అనవసర మాటలకి కట్టుబడి రాజీనామా చెయ్యరాదు. ఒకవేళ రాజీనామా చెయ్యవలసి వస్తే రాజీనామా చేసిన సభ్యడు ఉప ఎన్నికలలొ నుంచో రాదు.


ఓటర్లకి

ఓటరు గుర్త్తింపు "పంచింగ్ కార్డు" తప్పనిసరి. ఈ ఓటరు కార్డు మిద "పంచ్ ఉంటేనే" డ్రైవింగు లైసెన్సు, బ్యాంకు అక్కౌంట్, విదేశీ ప్రయణాలకి,
ప్రభుత్వ ఉద్యోగాలకి , వ్యాపార లైసెన్సులకి, ప్రభుత్వ పధకాలకి, రైల్వే రిజర్వేషనుల లాంటి మొదలగు సౌకర్యాలకి ఈ కార్డు తప్పనిసరి చేయాలి.


రోగి మరియూ రోగ లక్షణాల బట్టి మందిచ్చినట్లే ఇప్పటిదాకా జరుగుతున్న దాని లక్షణాలబట్టి ప్రజాసామ్యానికి పైన మందులిస్తే ప్రజాసామ్యం తిరిగి పునరుజ్జేవనం అవుతుందనే నా ఆశ. లేదా ఈ అయిదేళ్ళ రాజరిక పాలనని మనం అనుభవించి తీరవలసిందే.....

జైహింద్


పైన బొమ్మలన్ని గూగుల్ IMAGES పుణ్యమే