LOCAL WEATHER

8, మే 2014, గురువారం

సరి లేరు మీకెవ్వరూ....


హమ్మయ్య. ఎన్నికలు అయిపొయినాయి. 
ఇంకొ అయిదేళ్ళ దాకా రావు. 
రాకూడదు కూడా... 
ప్రజా సేవ చెయ్యటానికి రాజకీయ నాయకులు 
పొటాపోటీగా ఎగబడి ఎన్నికలలో పాల్'కొన్నారు
ఇంతగా ప్రజా సేవ చెయ్యటానికి ఎగబడే రాజకీయ నాయకులని 
మరే దేశంలోనూ కూడా చూడలేము. 
ఆ మాటకొస్తె పురాణాలలో కూడా చూడలేదు. 
ఆహా ప్రజలంటే నాయకులకి ఎంత ప్రేమ...! 

ప్రజలకి సేవ చెయ్యటానికి తాము పుట్టి పెరిగిన రాజకీయ పార్టీలనే ఒదులుకుని త్యాగాలు చేశారు. కొత్త పార్టీలనే ఎంతో శ్రమకోర్చి కొంత మంది పెట్టారు.  అంత స్తోమత లేని వారు ఏ పార్టీలో  చేరితే గ్యారంటీగా గెలుస్తామో ఆ పార్టీలోనికి రానిచ్చినా, రానియ్యకపొయినా...బలవంతంగానైనా దూరి ప్రజలకి దగ్గరవ్వాలని మన నాయకులు చేసిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా హర్షించి తీరాలిసిందే...

ఇక వారు గెలిచి ఆ ప్రాంతపు అభివృద్ధిలో భాగం పంచు' కోవటానికి{?} అప్పటిదాకా ఎవరిని తిట్టారో వారినే మెచ్చుకుని...ఎవరిని వెనకేసుకుని వచ్చారో వారినే ఎండగట్టి; తమలో తాము కుమ్ములాడుకుని అయినా సరే ప్రజా సేవయే తమ తక్షణ కర్తవ్యమని నమ్మినారు మన రాజకీయ నాయకులు. ఇంతే కాదు...తమ పార్టీలనే కాకుండా తమ సంపదని కూడా కొందరి ప్రజల కోసం త్యాగం చెయ్యటానికి వెనుదియ్యలేదు. "ఇలా సంపదని త్యాగం చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ నాయకులే ముందర ఉన్నారని ఎలక్షన్ కమీషన్ వారు కూడా ఎలక్షన్లు అయిపోగానే ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు"...!!!

ప్రజల కోసం ఏమైనా చెయ్యటానికి వెనుదియ్యని మన రాజకీయ నాయకులు కౌన్సిలర్ దగ్గర నుండీ ఎంపీల వరకూ తమ స్తాయిని కూడా మర్చేపోయి ప్రజల కోసం తాము చెయ్యబొయ్యే అభివృద్ధి పనులకోసం వేలకోట్ల రూపాయలు ఎలాగైనా తెచ్చి అభివృద్ధి చేస్తామని మాటలు ఇచ్చేస్తున్నారు.  ఒకరు అర్ధ రూపాయకే కిలో బియ్యం ఇచ్చేస్తుంటే, ఇంకొకరు సింగప్పుర్ చెసేస్తామంటున్నారు... మరొకరు కేవలం వంద రూపాయలకే నెల కరెంటుని ఇచ్చేస్తామని చెపుతున్నారు.  ఇది అన్నిటికన్నా అద్భుతమైన విషయం. ఎందుకంటే వీరు ఒక్కో నియోజక వర్గానికి చెయ్యబొయ్యే అభివృద్ధి పనుల విలువ అనేక చిన్న దేశాల సంవత్సరం బడ్జెట్టు విలువ అంత ఉండటమే. ఇది మన రాజకీయ నాయకులకి కాక మరింకెవరికి సాధ్యం...!!! స్వంత ప్రజల మీద భారం వెయ్యకుండానే ఇంత డబ్బుని ఎక్కడి నుండీ తేస్తారో...బహుశా ఇతర దేశాల మీద దాడి చేస్తారేమో...ఈ డబ్బు కోసం.

ఇంతలాగా ప్రజల గురించి మాత్రమే ఆలోచించే వారు మరెక్కడైనా ఉంటారా...? కేవలం ప్రజల కోసమే తమ పరువు ప్రతిష్టలనే కాకుండా తమ మనస్సాక్షిని కూడా చంపుకుని ఇష్టం లేని వారితో కూడా చేతులు కలిపి ప్రజలకి సేవ చెయ్యటానికి ముందుకొచ్చారంటే మన రాజకీయ నాయకుల గొప్పతనం మరింకెవరికైనా ఉంటుందా...??  తామూ కనుక అధికారం లోనికి రాకపొతే తమ ప్రజలు ఏమైపొతారో అన్న ప్రేమతో కూడిన భయం వీరిలో ఉన్నట్లుగా...కన్న తల్లిదండ్రులలో కూడా కనపడదు.

ఇంతే కాదు వీరి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నది... కానీ, ఇంత త్యాగాలు ప్రజల కోసం చేసినా ఎందుకో వీరంటే ప్రజలలో చులకన భావం ఉన్నది. ఎందుకు ఇంత చులకన భావం...???? ఎన్నో త్యాగాలు చేసి అధికారంలోనికి వచ్చిన నాయకులు పెంచిన రవాణా చార్జీలనీ, కరెంటు చార్జీలనీ, నిత్యావసర ధరలనీ భరించి ప్రజలు కూడా త్యాగాలు చెయ్యాలని కోరి... తాము మాత్రం రాచరిక హోదాల్లో అన్నీ ఉచితంగా పొందటం వల్లనా...?? లేక, ప్రజలు నానా కష్టాలు పడి 30, 40 ఏళ్ళలో సంపాయించలేనంత సంపదని రాజకీయ నాయకులు కేవలం అయిదేళ్ళ ప్రజాసేవలో సంపాయిస్తున్నారనా...?

ఇంతమాత్రానికేనా, నాయకులు కేవలం తాము రావటమే కాదు...తమ వారైన కొడుకుల్నీ, కూతుళ్ళనీ, కొడళ్ళనీ, అళ్ళుళ్ళనీ... ఇలా ఒకరేమిటీ పెద్దవారి ఆత్మలతో సహా...కుటుంబాలకి కుటుంబాలే ప్రజాసేవ నిమిత్తం ఎండనకా... వాననకా రొడ్డున పడుతున్నప్పుడూ కొన్ని సౌకర్యాలని పొందితే ఏమిటటా...? సంపాదన మాటా; ఆ మాత్రం లేకపొతే వారికి రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది.  ఇదేమన్నా నెలవారీ గ్యారంటీ ఉద్యోగమా 30 ఏళ్ళపాటూ నెల తిరిగేప్పటికి జీతం రావటానికి... అయిదేళ్ళు; అదీ కూడా గ్యారంటీ లేదు. ఆ తరవాత వాళ్ళ  పరిస్తితి ఏమిటో... "వారు అయిదేళ్ళలో సంపాయించిన విధానానికి...తిరిగి వారే అధికారంలోనికి రావటం తప్పనిసరి కదా...పులి మీద స్వారీ"... ప్రజల కోసం ఇంత చేస్తున్న మన నాయకులకి సరితూగగల వారు ఎవరన్నా ఉన్నారా... ?!?!?!?  


కొసమెరుపేమంటే, 
అధికారం కోసం నానా కష్టాలు పడినట్లుగా భావించిన నాయకులలో 
దేశం విడిచి వెళ్ళగలిగిన నాయకుడు 
దేశం విడిచి హాలిడే రిసార్టులకి వెళ్ళగా.... 
దేశం విడవటం కుదరని మరో నాయకుడు 
దేశీయ హాలిడే రిసార్టుకి వెళ్ళిపోయ్యాడు... 
కానీ, 
ఈ నాయకులు 
ఎన్నికల సందర్భంగా రగిల్చిన చిచ్చులో పడి
 ఆయా పార్టీల కార్యకర్తలు కొట్టుకుని చస్తున్నారు.
 వీరికి ఏ హాలిడే రిసార్టులు లేవు. 
ఇదే ప'రాజ సామ్యం..!!!!!!!!!
[11-5-14]





జై హింద్

బొమ్మ గూగుల్ ప్రసాదమే...మిక్సింగ్ కేఆర్కే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి