LOCAL WEATHER

13, జులై 2014, ఆదివారం

త్యాగాలకి సిద్ధంగా ఉండాలిసింది ప్రజలేనా... మోదిగారు...???

ప్రతీ వాడూ పైకొచ్చే వరకూ ఒక మాటా...తరవాత మరొక మాట చెప్పేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రధాన మంత్రిగారు కూడా ప్రజలు త్యాగాలు చెయ్యవలసిందే అని చెప్పి తన పదవికి త్యాగం చెయ్యవలసి వచ్చింది. దానితోబాటూ చెడ్డ పేరు కూడా 
మూటగట్టుకోవలసి వచ్చింది.


గొప్ప మాటలతో పైకొచ్చిన మోడీ...
తన సమర్ధతతో 
ప్రభుత్వంలో ఉన్న అసమర్ధతని తొలగించటం ద్వారా 
అభివృద్ధిని సాధించాలే కానీ....  
అసమర్ధత వలన కలిగిన నష్టాన్ని, 
ధరలు పెంచటం ద్వారా 
పూడ్చాలని అనుకునే పద్ధతిని అనుసరిస్తే 
అది మోడీ ఇజం కాదు...
మన్-మొహనిజమే అవుతుంది.... 

ఉదాహరణకి 
ఈ మధ్యన పెంచిన రైల్వే చార్జీలు... ఈ సంస్థలో జరుగుతున్న భయంకరమైన దూబరాని ఆపకుండా... 
చార్జీలని పెంచటమే దానికి మందని, ఇదివరకూ ఉన్న అతి తెలివి ప్రభుత్వం అనుకున్నది...  
అయితే...
ఏవో గొప్ప మాటలు చెప్పిన ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా దీని గురించి సమూలంగా చర్చించకుండానే 
ధరలని అమాంతం పెంచి... పైగా అది మా తప్పు కాదు క్రిందటి ప్రభుత్వ నిర్వాకం అంటోంది...
వీరికి, 
ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక బీజేపీనో.. స్పృహ తెలియాలిసి ఉన్నది...

ఎదైనా ప్రభుత్వ పరమైన ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలే పంచుకోవాలి అని చెప్పటమే మన నాయకులు ప్రజలకిచ్చే సందేశమే "త్యాగాలు". ఈ మాటతో ప్రజలకి బ్లాక్ మైల్ చేస్తున్నారనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే దేశం కోసం త్యాగాలు చెయ్యటం అనే మాటని ఎవరూ కూడా తిరస్కరించలేరు కదా... అయితే, ఆ త్యాగాలని ప్రజలే చెయ్యాలని రాజకీయ నాయకులు అనటం ఎలా ఉన్నది అంటే..."రాజుగారి భార్య పతివ్రత" అని రాజుగారి ఎదుట అనవలసిన పరిస్థితిలాంటిదే...దీనిని ఎవరూ కాదనలేకుండా ఉండేట్లుగా, ప్రజలని మోసం చేస్తున్నారు మన నాయకులూ మరియూ అధికార గణం...


ఎలాగంటే, 
ఈ త్యాగాల గురించి 
అధికార గణం ఒక చెంప రాజకీయ నాయకులకి నూరిపోస్తూనే...
తమకు రావాలిసిన జీతాలని పెంచమనటం, 
సౌకర్యాలని పెంచమనటం చేస్తునే ఉన్నారు. 
అలాగే 
రాజకీయ నాయకులు కూడా తాము చెప్పేది ప్రజలకి మాత్రమే అన్నట్లుగా...
తమ ఖర్చులని ఏ మాత్రం తగ్గించుకోవటం లేదు. 
కేవలం అధికార పక్ష నేతలే కాకుండా, 
ప్రతిపక్ష నేతలు కూడా 
ఈ విషయంలో చాలా ఐక్యంగా మెలుగుతూ 
తమ సౌకర్యాల కోసం 
వేల కోట్లు తగలేసే బిల్లులకి 
తమ సపోర్టుని ఇచ్చేస్తున్నారు. 
ఎంతైనా వారూ వారూ ఒకటే కదా...

వీరిలో ఒకడు వాస్తు సరిపోలేదని ప్రభుత్వ భవనాలని మార్పుచేసే వాడు, మరొకరు తమ లక్కీ నంబరు సరిగా లేదని కొత్త కారులు కొనమనే వారూ...ప్రజల వద్ద పోగుచేసిన పన్నులు ఉద్యోగుల జీతాలకే సరిపోవట్లేదంటూనే తమ విదేశీ పర్యటనలకి ఉపయోగించే అధికారులూ... ఇలా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములని లెక్కా పత్రం లేకుండా ఖర్చులు పెట్టేస్తూ... "అభివృద్ధి కావాలంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలని" ప్రతీ వాడూ కుయ్యటమే కానీ, తమ ప్రక్క నుండీ ఈ "త్యాగాన్ని" ఎంత చేస్తున్నారో చెప్పరు. అందుకనే, వీరు ప్రజలకి చెప్పే ముందర తాము ఎంత ఖర్చులు పెడుతున్నామో ప్రజలకి వివరించాలిసి ఉన్నది...


అంతేకాదు,
దేశ భక్తి పేరుతొ త్యాగాలు అంటే...
ఏ పనికి మాలిన హిందీనో నెర్చుకోవటమో... 
లేక  
అడ్డమైన పన్నులు కట్టటమో 
లేక
 పెంచిన అధిక ధరలని 
నోరు మూసుకొని భరించటం లాంటి అర్ధాన్ని కనుక 
మన నాయకులు ప్రజల మనస్సులో కలిగించినట్లైతే...
అది 
ప్రజలలో ఉన్న అసలైన దేశభక్తికి
విఘాతం కలిగే అవకాశం ఉన్నది.

అందువలన, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలతో పాటూ నాయకులూ...ఉద్యోగులూ త్యాగాలు ఈ విధంగా చేస్తే వారు ప్రజలకి ఆదర్శంగా ఉంటారు...

1] అన్ని రకాలైన రాజకీయ నాయకులకీ మరియూ ఉద్యోగులకీ ఇచ్చే పెన్షన్లనీ ఆపివెయ్యాలి. ఒకడిని ఒక ఐదేళ్ళకి ఎన్నుకున్న పాపానికి...జీవితాంతం పొషించాలా...??? ఇది రాష్ట్రపతి నుండీ తాలూకా ప్యూను వరకూ వర్తింప చెయ్యాలి. 

2] ఉద్యోగుల/రాజకీయ నాయకుల జీతాలు కూడా దేశ ప్రజల తలసరి ఆధాయాన్ని మించి ఎన్నో రెట్లు ఇస్తున్నారు. అది మానాలి. డీయ్యే పేరుతో... నెలకెంత వస్తుందో తెలియని బడుగు ప్రజలని దోచి, నిర్దుష్టంగా నెలవారీ జీతాలొచ్చె ఉద్యోగులని పోషిస్తున్నారు. ఇది సామాన్యులైన ప్రజల మీద పెద్ద భారాన్ని మోపుతోంది.

3] సరదాల పేరుతో కూడా ఇటు రాజకీయ నాయకులూ, ఉద్యోగులూ కూడా ప్రజల డబ్బుతో ఆటలాడుకుంటున్నారు. ఇది పూర్తిగా ఎత్తివెయ్యాలి. ఏదైనా వారికొచ్చే జీతాల నుండే చెయ్యాలి.

4] ఉద్యోగులకి జీతాలని పూర్తిగా ఎటువంటి కటింగులూ లేకుండా ఇచ్చెయ్యాలి... ఒక ఉద్యోగి రిటైరు అయిన తరవాత, ఆ ఉద్యోగికీ...ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధం ఉండరాదు... అలాగే ఆ ఉద్యోగికి కూడా సాయంత్రం 5 గంటల నుండీ ఉదయం 9 గంటల వరకూ పూర్తి స్వేచ్చని ఇవ్వాలి. అంటే, కార్యాలయంలో పనిచేసే 8 గంటల సమయం వరకే వారు ప్రభుత్వ పనులు చెయ్యాలి...ఆ తరవాత వారు ఎటువంటి పనులైనా చేసుకునె అవకాశం ఉండాలి.

5] ఉద్యోగుల సంక్షేమానికి సమంధించిన ఎటువంటి పనినైనా ఉద్యోగ సంఘాలే నిర్వర్తించాలే కానీ... దానిలో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం ఉండరాదు.

6] ప్రస్తుతం ప్రజలకి సేవ నిమిత్తం ఉన్న రాజకీయ నాయకులకి తప్ప, మిగిలిన అందరికీ... డబ్బుతో కూడిన సౌకర్యాలని నిలిపివెయ్యాలి. ప్రబుత్వ ఖర్చులతో వీరికి కాపలాలు పెట్టటం కానీ, వీరికి ఉండటానికి నివాసాలు ఏర్పర్చటం లాంటి తదితర విషయాలని పూర్తిగా వదిలెయ్యాలి.

7] మాజీలకి లేక మరెవరికైనా ప్రాణ హాని ఉన్నదంటే వారికి రక్షణని ఇచ్చేందుకు కొన్ని "రక్షణ సెంటర్లని" ఏర్పరచి అందులో వారిని పెట్టాలే కానీ... ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఖర్చుతో రక్షణని ఇవ్వరాదు.

8] అలాగే సైన్యానికి చెందిన ఖర్చుని ప్రజలకి చెప్పకపోయినా, సరైన పద్ధతిలో చెయ్యటానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చెయ్యాలి.

ఈ విధంగా చేసే,
దేనికైనా ధరలు పెంచటమే పరమావధిగా భావించే కాంగ్రెస్సు ప్రభుత్వ విధానాలనే తామూ ఆచరించ కుండా... తప్పు ఎక్కడున్నదీ...రూపాయ ఖరీదు చేసే వస్తువుకి రైల్వేలోగానీ, మరే ప్రభుత్వ రంగ సంస్థలలో గానీ 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేవలం రైల్వేలోనే కాదు... అన్ని ప్రభుత్వ శాఖల బండారం బయట పడుతుంది అని మోది గారు తెలుసుకోవాలి...

సమర్ధ పాలన అంటే ధరలు పెంచి పాలన చెయ్యటం కాదు...
ఆ పనిని ఎంతటి అసమర్ధుడైన పాలకుడు కూడా చెయ్యగలడు.
సమర్ధత అంటే 
ప్రభుత్వ పరంగా ఉన్న సమర్ధతని పెంచటమే కాదు...
అసమర్ధతని, అవినీతిని తొలగించటం....
ఈ పనిని తమ అవసరం కొద్దో 
లేక 
తమ అస్మదీయులని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేకో 
ఇంతకు ముందున్న  పాలకులు అలక్ష్యం చేసారు.... 

ఎక్కడో ఉన్న నల్ల ధన్నాన్ని 
బయటకు తీసుకు రావటం కాదు... 
ఆ "నల్ల ధనాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు"గా ఉన్న 
ప్రభుత్వ సంస్తలనీ, ప్రభుత్వ విధానాలనీ 
తరచి చూసుకుంటే...
కొత్తగా నల్లధనం తయారు కాకుండా ఉంటుంది. 
రాక్షస సంహారం అంటే 
పుట్టిన రాక్షసులని అంతమొందించే మార్గం కాదు...
అసలు రాక్షసత్వం పుట్టే మూలం ఎక్కడున్నదో కనిపెట్టి 
దానిని ధ్వంసం చెయ్యటమే...
ఆలాగే 
అవినీతి అంతం అంటే,
దానిని చేస్తున్న వారిని వల వేసి పట్టటం కాదు.
ఆ అవినీతికి మూలంపై 
ఆటం బాంబుని వెయ్యటం.

ఆ... ఇవన్నీ కుదిరే పనా, మేము చెయ్యలేముం, ఇవన్నీ చేస్తే మాకు కష్టం లాంటి మాటలు మాట్లాడినప్పుడు... ప్రజలని  కూడా త్యాగాలని చెయ్యాలని చెప్పద్దు. ముందర మీరు  ఏసి రూముల్లోంచి బయటకి వచ్చి ప్రజలకి ఆదర్శంగా ఉండి, తరవాతే ప్రజలకి చెప్పవలసి ఉన్నది.






జై హింద్ 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి