LOCAL WEATHER

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఎఫ్.ఎం రేడియోలు "పెద్దలకు మాత్రమే"!!!

ఇదేమిటి దృశ్య ప్రధానమైన వాటికి కదా హెచ్చరిక....కావచ్చును, కాసేపు మన "టెల్గు ఎఫ్.ఎం" లలో ఆడా మగా సంభాషణలు వింటే ఇవి అసలు ఇళ్ళలో వినతగ్గ భాషేనా అని అనిపించక మానదు. ఇంట్లో పిల్లలతో కూర్చుని వినాలంటేనే ఇబ్బందికరంగా ఉన్నాయి.ఒక ఎఫ్.ఎం లో తెలుగు తారల మీద జోకులు పరమ వెకిలిగా గొంతులు పెట్టి ఆడ మగా చేసే వీరాంగం ఇళ్ళలో కన్నా ఎదైనా "క్లబ్బుల్లోని పెద్దమనుషులు" ఆత్మానందం పొందేటట్లు వున్నాయి.....చివర్లో "అబ్బో నాకు సిగ్గూ...." అంటూ సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ఆడవారు. అన్నౌన్సర్లు వారికి వారే జాకీలని పేరెట్టేసుకొన్నారు. మరొక ఎఫ్.ఎం లో అయితే రోడ్డు మీద ఆడవారి మీద....బ్రోకర్ల లాగా మాట్లాడుకొనే జోకర్లు. ఇదీ పరిస్తితి. మరొక దరిద్ర ఎఫ్.ఎం లో "లవ్ గురు"ట; వీడు, లవర్లు పెద్దలకి ఎలా మస్కా కొట్టాలో నేర్పుపుతాడుట......అదీ అర్ధరాత్రి వొచ్చే ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం. ఇవి కాకపోతే సినిమా వాళ్ళ సంబంధాల గురించి........

ఈ ఎఫ్.ఎం ల కన్నా టీవీలే మెరుగనిపించేట్లుగా ఉన్నాయి. ఎందుకంటే, సెన్సారు అయిన సినిమాలోని సంభాషణలను సైతం కొన్నిటిని "
మ్యూట్
" చేస్తున్నారు. సరే, టివీలకి, సినిమాలకీ ఏదొక నియంత్రణ అంటూ వున్నది.

"ప్రతీ దానికీ నియంత్రణ ఉండాలా...?" అని ఒకప్పుడు వాక్ స్వాతంత్రవాదులు అనుకునే స్వాతంత్రాన్ని దుర్వినియోగ పరిచేవిధంగా మన ఎఫ్.ఎం లు ఉన్నాయి. ఎదో పాటలు చక్కటి క్లారిటీతో వస్తాయి కదా అని ఈ దిక్కుమాలిని ఎఫ్.ఎం లు పెడుతుంటే....పాటల మధ్య వచ్చే వీరి వాగుడుని నియంత్రించలేక రేడియోనే తీసేయ్యాల్సి వస్తోంది.


ఇప్పటి దాకా రేడియోలకి సెన్సార్ అనేది అవసరం అని అనిపించకుండా అవి నడిచినాయి. కానీ, ఇవ్వాళ వచ్చిన ఎండు మెరపకాయలు ఎఫ్.ఎంలు, ఎర్ర ఏరియా ఎఫ్.ఎంలు లాంటి రకరకాలైన ఎఫ్.ఎంల మధ్య పోటీ వలన అశ్లీల సంభాషణలతో జనాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. రేడియోలకి గల పరువు మర్యాదలను అశ్లీల పోటీ బురదలో కలుపుతూ అనారోగ్య ప్రసారాలను చేస్తున్నాయి.

జనాన్ని ఆకట్టుకోవాలంటే ఇలాంటి దిక్కుమాలిన సంభాషణలే అక్కర్లేదు; ఇదివరకు గవర్నమెంటు రేడియోలో ఆదివారం మధ్యహ్నం పూట ఒక నాటకం వస్తుంటే రోడ్లన్నీ నిర్మానుష్యం అయ్యేవి. ఇదివరకు అంటె అదేదో పూర్వకాలం అని తోసిపుచ్చేరు...., ఎప్పుడైనా ప్రేక్షక ప్రజలది మంచి టేస్టే అన్న సంగతి వారు తెలుసుకోవాలి. మిస్సమ్మ, మాయా బజార్ మొదలైన సినిమాలు ఎప్పుడొచ్చినా ఆడతాయేగాని....అశ్లీల సినిమాలు 100 రోజులు ఆడినట్లు మన తెలుగునాట ఒక్క రికార్డు లేదు.

ఏది ఏమైనప్పటికీ, ఈ ఎఫ్.ఎంల బారిన పడి మన పిల్లల భాష మారకుండా చేసుకోవటమే ఇప్పటికీ మనం చెయ్యగలిగింది.

ఇందులోని బొమ్మలు గూగుల్ ఇమేజ్ వారివే