LOCAL WEATHER

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మానవ హక్కుల వారు స్పందించండి.....


నిన్న విశాఖ జిల్లాలో జరిగిన దారుణాం ఎర్ర సైన్యం అసహనానికి నిదర్శనం. ఎదో సినిమాలో డైలాగు "నేను మాట్లాడేప్పుడు చెవులు మాత్రమే పనిచెయ్యాలి......." లాగా  మన ఎర్ర వారి స్వాతంత్రం ఉన్నది. కనీసం గ్రామీణ గిరిజన ప్రాంతాలలో పెట్టిన సమావేశంలో అయినా కొద్దిగా సంయమనం, ఓర్పునీ చూపించలేని వీరు, పేద ప్రజలని ఉద్దరిస్తామని ఎలా చెప్పగలరు...???  ఇంతే అసహనం ప్రజాసామ్య వాదులకి కూడా ఉంటే  వీరి ఆటలు సాగేవా ........

జరిగిన గొడవలో గ్రామీణ గిరిజనులు రాళ్ళు వేస్తే, వీరు భయంతో తుపాకీలకి పనిచెప్పారు. ఇంత పిరికి వాళ్ళు బడుగు జనాన్ని ఎలా వృద్ధిలోనికి తెస్తారు...?? వీరిని నమ్ముకొని పేద ప్రజలు, పైన ఉన్న వారితో ఎలా పోరాటాలు చేస్తారు...??? ఇప్పటిదాకా వీరు చేసిన ఘాతుకాల్లో సామాన్య ప్రజలూ, ప్రజలకి పనికొచ్చే అధికార్లు మాత్రమే బలైపోతున్నారు. వీరి నిరంకుశ విధానంతో ప్రజలందరినీ ఏవిధంగా ఒక తాటిపైకి తెస్తారు...??

ఈ ఎర్ర సైన్యంలో అనేక హత్యలూ చేసిన వారూ, బోలెడు బాంబులు పెట్టి అనేకం పేల్చేసినవారిలో ఒక్కరు పోలిసుల చేతులో చనిపోయినా, కాకుల లాగా గోల గోల చేసే  అనేక హక్కుల వారు ఎవరూ కూడా ఈ సంఘటన పట్ల ఇంతవరకూ స్పందించలేదు.  నిన్న చనిపోయిన అమాయక గిరిజన ప్రజలు మానవులు కాదని వీరి అభిప్రాయమా....??? టీవీల వారు కూడా ఏదో విదేశాలలో జరిగిన సంఘటన అయినట్లు ఒకసారి చెప్పి ఊరుకున్నారు...... పొద్దున్నే వచ్చే "పెద్దమనుషులైన వారు" కూడా ఎందుకనో ఈ విషయంపట్ల సానుభూతితో శ్రద్దపెట్టలేదు....!!!

ఇప్పుడున్న సమాజంలో అవినీతి అక్రమాలూ ఏవో పెరిగిపోయాయన్న వీరి ఊకదంపుడు ఉపన్యాసాలు విని వీరిపట్ల సానుభూతిని చూపించినవారిని కూడా వీరు వదలకపోతే, రేపు అదేదో మరో ప్రపంచం అంటే అది వచ్చేది ఎక్కడో ...? మానవుల ప్రాణాలు పట్ల గౌరవం ఉన్న ఓ హక్కుల సమితులారా స్పందించండి... వీరికి తగిన బుద్ధి చెప్పి, ఈ తప్పిదనం మరోసారి జరగకుండా చర్యలు తీసుకొనే వరకూ పోరాడండి.... 

ప్రజాసామ్యంలో కనుక ఈ ఎర్ర సైన్యపు అసహనం, పిరికితనం  ఉన్నట్లైతే, ఈ పాటికి అనేక వేలు  కాదు లక్షల మంది ప్రాణాలు గాలిలో ఉండేవి...  ప్రజాసామ్యాన్ని తిట్టే వారికి, ప్రజాసామ్య ఉదారత్వంతో ఆటలాడుకునే వారికి,  ఇప్పటికైనా ప్రజాసామ్య విలువలు అంటే  ఏమిటో అర్ధం అవుతుందేమో ...........


@@@@ 

6 వ్యాఖ్యలు:

 1. సిద్ధాంతం పేరున అయినా అధికారం పేరున అయినా ప్రాణాలు తీయడం తప్పే. మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ సంఘటన ను మీడియా వాళ్ళు కవర్ చెయ్యలేదు, ఎవరు స్పందించలేదు. మీరు వ్రాసిన దాన్ని బట్టి కొంచెం అర్థం అవుతున్న, ఏమి జరిగిందో వివరం గా వ్రాస్తే బాగుటుంది. మనం వ్రాసి చదివితే చని పోయిన వాళ్లకు న్యాయం జరగకపోవచ్చు. కాని మీకు తెలిసిన నిజం దయచేసి అందరికి తెలియచెప్పండి. బాధ్యులు , బాధితుల గురించి అందరికి తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చంద్ర గారూ స్పందించిననదుకు ధన్యవాదాలు. కేవలం అక్కడ జరిగిన సంఘటన అభిప్రాయ విభెదాలు రావటం, ఒక తెగవారికి సంబంధించిన ఒకరిని కొట్టబోగా అడ్డుకోవటం అనేదే అక్కడ గిరిజన ప్రజలు చేసిన ఘోరమైన తప్పిదనం. అదీ కూడా మాటలతో కానీ, రాళ్ళతో కానీ జరిగే గొడవని, ఎర్ర సైన్యం వారు కత్తులూ తుపాకులూ దాకా తెచ్చారు.

  రాజ్యాంగం మీద, చట్టం మీద ఏమాత్రం గౌరవం లేని వీరు, తమ వారిని ఎవరైనా చంపితే ఆ నమ్మకంలేని చట్టాల ద్వారానే ఎంక్వైరీ చెయ్యాలని పట్టుబడతారు. అలాంటి వీరు ఏరకమైన పద్దతిలో తమకి ఎదురితిరిగిన వారిని మట్టుబెట్టాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఏ రకమైన చట్టాలు కానీ, అటవీక న్యాయం కానీ తమకి అనుకూలంగా మాత్రమే ఉండాలనుకునే సంకుచిత మనస్థత్వం కలవారు, పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగ పడతారో వారికే తెలియాలి. ఎవరినైతే వీరు విమర్సిస్తున్నారో వారి లాగానే ప్రవర్తిస్తే, ఏమున్నది తేడా..........?

  అక్కడ జరిగింది సిద్దాంతాల కోసమో, అధికారం కోసమో జరిగిన హత్యలు కాదు. కేవలం, వీరు మనకి ఎదురుతిరుగుతారా అనే కోపంతో మాత్రమే....నిజమే మనం వ్రాసినంతమాత్రాన చనిపోయీన వారినికి న్యాయం కలగదు కానీ, ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉండ కూడదు కదా....స్పందనలో కూడా వివక్షత చూపిస్తే ఎలా.....అదీ గిరిజన తెగల వారు హత్యకి గురైనప్పుడు కూడా మేధావుల నుండీ స్పందన లేకపోతే వారికి భరోసా ఎక్కడ అని..........

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాధాకృష్ణ గారు,
  స్పందించే విషయం లో వివక్ష ఉండకూడదు అనే మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకిభవిస్తున్నాను.
  ఇప్పుడు మావోయిస్టులు గా పేరు మార్చుకున్న నక్సలైట్ ల పైన పోలీసులు చేసే హింస ను అంతగా నిరసించే హక్కుల మేధావులు, నక్సలైట్ లు చేసే హత్యల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తారో అని ఎప్పుడు అనుకొనే వాణ్ని. హక్కులు అనేవి నక్సలైట్ల కేనా మిగతా వారికి ఉండవా అనిపించేది. కోపం వచ్చేది.

  కొంతమంది రచనలు చదవడం వలన ఈ అసంబద్దత గురించి కొన్ని విషయాలు తెలిసాయి. వారిలో ముఖ్యమైన వారు డా .బాలగోపాల్ గారు. పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక ల గురించి తెలిసింది. డా .బాలగోపాల్ గారు నక్సలైట్ ఉద్యమం మీద వ్రాసిన “చీకటి కోణాలు” పుస్తకం అనే మీరు ఇప్పటికే చదవక పోయి ఉంటె ఒకసారి చదవండి.
  http://balagopal.org/wp-content/uploads/2010/05/chikatikonalu.pdf

  మొదటి రోజుల్లో నక్సలైట్లు సిద్ధాంతం కోసం, అదీ చాల పరిమిత సందర్భాల లో మాత్రమే హింస కు పాల్పడే వారు అని, ఆ హింస కుడా అమాయకుల మీద కాకుండా, పైశాచికం, కిరాతకం కాని పద్దతులలో అని. అణిచి వేతకు వ్యతిరేకం గా, ప్రజా బాహుళ్యం మేరు కోరి చేసిన ఆ హింస ను కుడా మనం సమర్థించక పోయినా, కొంత అర్థం చేసుకోవచ్చు అని . కాని తరువాతి రోజులలో ఇదే నక్సలైట్ లు వ్యక్తిగత పగ, ప్రతీకారం పేరు మీద , ఆర్ధిక ప్రయోజనం కోసం ఎలా చంపడం మొదలు పెట్టారు. ఆ చంపేది కుడా పైశాచిక, కిరాతక పద్దతులలో. ఈ విషయాలు అన్ని చాల విపులంగా , యదార్థ సంఘటనల ఆధారం గా వివరించారు బాలగోపాల్ గారు. ఇది చదివితే ఈ రోజు హక్కుల మేధావులం అని చెప్పుకుంటున్న కొంతమంది ఆలోచనా ధోరణులు కూడా మనకు అర్థం అవుతాయి.

  @రాజ్యాంగం మీద, చట్టం మీద ఏమాత్రం గౌరవం లేని వీరు, తమ వారిని ఎవరైనా చంపితే ఆ నమ్మకంలేని చట్టాల ద్వారానే ఎంక్వైరీ చెయ్యాలని పట్టుబడతారు.

  ఇది చదవడానికి, వినడానికి చాల న్యాయమైన, సహజమైన విషయం అనిపిస్తుంది. కాని కొంచెం విచారణ చేసి చూస్తే దాంట్లో ఉన్న అసంబద్దత తెలుసుకోవచ్చు. రెండు మూడు సంవత్సరాల కిందట అయితే ఈ విషయం మీద మీతో సంపూర్ణం గా ఏకీభవించే వాడిని. “24 గంటలు” అనే కన్నబీరన్ గారు వ్రాసిన పుస్తకం లో ఎన్ కౌంటరు జరిగిన ఒక ఉరి కి వెళ్ళినప్పుడు, ఒక గొర్రెలు కాసే వ్యక్తి “ అయితే కోర్ట్ లు ఎందుకున్నాయి” అని అడిగాడంట. దాని గురించి చదివాక నా అభిప్రాయం మార్చుకున్నాను.
  ముద్దాయిల కు, నేరస్తులకు రాజ్యాంగం మీద, చట్టం మీద గౌరవం ఉందా లేదా అన్నది కాదు. విచారణ చేసే వాళ్లకు శిక్ష అమలు చేసే వాళ్లకు వాటి మీద గౌరవం ఉండాలి. ఎందుకంటె వారు వీటికి లోబడి పని చేస్తాం అని చెప్పుకున్నవాళ్ళు. కాబట్టి వాళ్ళు వేసే శిక్ష రాజ్యాగం పరిధి కి లోబడే ఉండాలి.
  ఈ విషయం లో మాత్రం మీ అభిప్రాయం తో ఏకీభవించ లేను. క్షమించండి.
  చివరిగా తుపాకి ద్వారా వచ్చే మార్పు తో ప్రజల కు ఎక్కువ స్వేచ్చ స్వతంత్రం ఉంటాయని నేను నమ్మను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చంద్రగారు ఈ విషయంపై మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. మీరు వ్రాసినదంతా చదివాను సార్, బాగున్నది.... భారతీయ ప్రజలందరి మీదా ఒకే సానుభూతి ఉండాలి.... ఒకరికొకరు శత్రువులు కారు.... కానీ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ జరిగిన సంఘటని దాటి ఎక్కడికోపోయి తప్పుకి మరొక తప్పుని ఎరవేసి తప్పుని ఒప్పుగా చూసే సానుభూతి మొదలు పెడితే.....కేవలం హత్యలూ, దొంగతనాలే కాకుండా ప్రతీ తప్పు పట్లా కూడా సానుభూతి చూపించాలిసిన దుర్గతి పట్టవచ్చును. తప్పు ఎవరు చేసినా అది తప్పే... ఆ తప్పు జరిగిన వెంటనే దానిని ఖండించి తీరాలిసిందే కానీ, పాత తప్పులతో ముడిపెట్టి ఇప్పటి తప్పుని కప్పిపెట్టకూడదు.ఎవరికి వారు తమ తప్పులని గుర్తించి తప్పులని సరిచేసుకుంటూ పోతే అప్పుడే ఈ తప్పుల పరంపర అన్నివైపులా ఆగుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Well said Radha Krishna.

  This episode shows the high level of partiality of the present day phamplets and satillite channels calling themselves "MEDIA". It is very unfortunate that the Media does not show any interest in highlighting this kind of incidents.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. అవునండి, వివక్షత మీడియాలోనే కాదు, మేధవులు అనుకొనే అనేక మంది పెద్ద మనుషులు కూదా ఈ విషయాన్ని తీసి పారేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు