LOCAL WEATHER

1, అక్టోబర్ 2014, బుధవారం

"మేకిన్ ఇండియానా" లేక "ఫెక్ ఇన్ ఇండియానా".....!!!


ఈ మధ్యన మనకు వినపడుతున్న మాట "మేడ్ ఇన్ ఇండియా" లేక "మేకిన్ ఇండియా"... ఐడియా మంచిదే ... అయితే దీనికి మన భారత దేశ ప్రజల/అధికారుల సహకారం ఎంతున్నదీ...??? మన క్రొత్త ప్రధాని గారు వచ్చిన తరవాత అనేక క్రొత్త పంధాలూ... కొత్త ఆలోచనలూ అంటూ విపరీతంగా ప్రచారంలోనికి వస్తున్నాయి... అవినీతి అంతమొందటం, ఆర్ధిక వ్యవస్థ గట్టి పడటం, శక్తివంతమైన భారత్, స్వచమైన భారత్, స్వేచ్చ్జా భారత్....ఇలా అనేకమైనటువంటివి వినపడుతున్నాయి... నిజానికి ఇవన్నీ పాత మాటలే...ఒకప్పుడు మన దేశంలో ఇలాంటి వన్నీ జరిగినవే... అయితే, కాల క్రమేణా... జనాభా పెరుగుదల ఉండటం వల్లనో, ప్రజల అవసరాలు పెరగటం వల్లనో, లేక శక్తికి మించిన ఆలోచనలతో అడ్డదారిన పైకి ఎదగాలని అనుకోవటం వల్లనో పై మాటలని తిరిగి ఉపయోగించాలిసిన ఖర్మగతి మన దేశానికి పట్టింది...

మరి, దీనికి కారణం ఎవరూ...? ప్రజలా... రాజకీయ నాయకులా, జనాభా సమస్యా, గ్లోబలైజేషన్ సమస్యా... ఇలా అనేకమైనటువంటి పేర్లు పెట్టి కారణాన్ని ఎవరి మీదకో తోసివెయ్యటం జరుగుతోంది... దానివల్లన సమస్య పెరుగుతూ పోతోందే కానీ, ఓ కొలిక్కి రావటం లేదు... అంటే, సమస్య మూలాన్ని గుర్తించటంలో మన దేశం ఆపసోపాలు పడుతున్నదని చెప్పవచ్చును. సమస్య ఉంటే... దాని మూలాన్ని గుర్తించటం కష్టమా... లేదు. అయితే, ఆ సమస్య మూలాన్ని గుర్తిస్తున్న సమయంలో...దానికి సంబంధించిన కారణాలలో గుర్తించే వారు కూడా ఉంటే...వెంటనే స్యమస్యని ప్రక్కదారి పట్టించి, మరోకోణంలోనికి మార్చి..."ఎవరికి వారు సమస్య మూలం మేము మడుకూ కాదు" అని అనిపించుకుంటున్నారు... దీని వల్లనే సమస్య మూలాన్ని కనుగొనలేకపోతున్నాము. మూలాన్ని కనుగొనటానికే తప్పుదార్లు వెదుకుతున్నప్పుడు...ఆ సమస్య నుండి బయటకు ఎలా బయట పడతాము...??? 

ఇప్పుడు విషయంలోనికి వస్తే, మేడ్ ఇన్ ఇండియాకి పేరు రావాలంటే ముందర అలా పేరు వచ్చే వస్తువులకి ప్రజలలో గిరాకీ ఉండాలి కదా...మన దేశ ప్రజలలో అనేక మంది వస్తువులు తక్కువ ధరలో దొరకాలి అనే కాన్సెప్టు మీదే తమ కొనుగోళ్ళు చేస్తున్నారు... ఉదాహరణకి ఒక వస్తువు వంద రూపాయలకి దొరుకుతుంటే, అలాంటిదే మరొకటి 125/-రూపాయలకి దొరికితే మన వాళ్ళు కొనరు... "ఇది ఎందుకు 25/-రూపాయలు ఎక్కువ ఉన్నది"...అని ఆలోచన కూడా చెయ్యకుండా... "వందకే వస్తుంటే ఎందుకు పాతిక రూపాయలు దండగ" అని అనుకుని, కేవలం పాతిక రూపాయలకి కక్కుర్తిపడి, నాణ్యమైన వస్తువుకు ప్రొత్సాహం ఇవ్వటం లేదు... ఇక ఆ సమయంలో ఏ చైనా వస్తువో కేవలం రు.60/-కే దొరికితే మన దేశం వారిలో దేశ భక్తి కనపడుతుందని అనుకోవటం దురాశే...

మన వాళ్ళు ఒక వస్తువు తక్కువకి వస్తే, ఆ వస్తువులో నాణ్యత ఉండదేమో అనే ఆలోచనే చెయ్యపోవటం వల్లన మన దేశంలో నాణ్యత లేని చైనా వస్తువులకి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అలా అని చైనావారు పనికి మాలిన వస్తువులే తయారు చేస్తారని కాదు... అక్కడ  భారత దేశం వస్తువులంత నాణ్యత కలిగిన వస్తువులని కూడా తయ్యారు చేస్తారు... కానీ, వాటి విలువ మన దేశ వస్తువుల కన్నా ఎక్కువ ఉండటంతో, వాటిని మన వ్యాపారులు కొంటే గిట్టుబాటు కావు... ఈ విధంగా ఈ మధ్యకాలంలో చైనా వస్తువులు వచ్చినట్లే...అంతకు ముందు ఢిల్లీ వస్తువులు అని వచ్చేవి...అంటే అవి అన్ని  కంపెనీ బ్రాండ్ల డూప్లికేట్లు... వాటి దెబ్బకే మన మంచి వస్తువులు తయారు చేసే కంపనీలు నేల మట్టం అయితే ...ఇక ఇప్పుడు చైనా వస్తువులు వచ్చిన తరవాత చెప్పేదేమున్నది...???

ఉదాహరణకి, 
పాతకాలంలో మనదేశంలో తయారయ్యే సీలింగు ఫేనులు కొంటే, 
అవి దశాబ్దాలపాటు పనిచేసేవి ... చేస్తున్నాయి కూడా... 
వాటికి ఆ కంపెనీ వారు 7 నుండి 10 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చేవారు. 
మరి ఇప్పుడు... 
అదే కంపెనీ వారు తమ ఫేనులకి ఒక సంవత్సరం గ్యారంటీని మాత్రమే ఇస్తున్నారు... 
కారణం... 
ఇప్పుడు వచ్చే అన్ని కంపెనీల ఫేనులూ భారతదేశ వర్కర్లు తయారు చెయటం లేదు... 
వారి ఉద్యోగాలు ఊడి సంవత్సరాలు అవుతున్నాయి... 
ఇప్పుడు వచ్చే ఫేనులకి
 "పైన పేర్లు భారత్‌వి -- ప్రాణం చైనాది"...
అంటే లోపల వైండింగ్ చైనా నుండి వస్తే, ఇక్కడ మన దేశంలో కేవలం అసెంబ్లింగు మాత్రమే చేస్తున్నారు...  
ఒక ఫేన్లే కాదు అన్ని రకాల వస్తువులూ అలానే ఉన్నాయి. 
ఏదైనా దేశం క్రింద నుండి పైకి ఎదుగుతుంది... 
కానీ, 
మన దేశం... 
ఒకప్పుడు ఎంతో క్వాలిటీతో వచ్చే వస్తువులని ఇచ్చిన మన దేశం 
ప్రజల సహకారం లేకపోవటం వలన
 వస్తూత్పత్తి[MANUFACTURING] నుండీ నేలకి దిగి 
వస్తువులని అమర్చటం[ASSEMBLING]లోనికి దిగజారిపోయింది. 


అలాగే, 
ఎవరైనా ఓ కొత్త కంపెనీ లేదా స్వంతంగా ఏదైనా చేద్దాము అంటే...
ముందర దానికి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి,  
ఎలా మార్కెట్టు చెయ్యాలి, 
దానికి కావాలిసిన పనిమంతులు ఎక్కడ దొరుకుతారు అని కాదు చూసేది... 
మనం మొదలెట్టే దానికి ఏ ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకోవాలి...
వాడికి ఎంత ఇవ్వాలి...దానికోసం ఎవడి కాళ్ళు పట్టుకోవాలి...
దాని అనుమతి/లైసెన్సుల  కోసం ఎంత ఖర్చు పెట్టాలి.. 
ఇది ఆలోచించాలి... 
దీనికి TATA గారు[లింకు నొక్కండి]కామెంటు చేసినదానినే 
ఉదాహరణ తీసుకోవఖర్లేదు...
రైలులో అమ్మే ఆహార పదార్ధాల క్వాలిటిని చూస్తే 
అధికార గణం కుళ్ళు ఎంత ఉన్నదో ఇట్టే తెలిసిపోతుంది... 
కేవలం 5/-రుపాయలకే మంచి కాఫీ బయట దొరుకుతుంటే... 
కాఫీ కంపుకొట్టే వేడి నీళ్ళని 10/- రూపాయలకి రైల్లో ఇస్తున్నారు..
వాళ్లకి తయారు చెయ్యటం తెలియక కాదు...
వీరిలో ఎక్కువమంది కేరళా కాంట్రాక్టర్లే...
వీరు ఖర్చుపెట్టే పెట్టుబడి, క్వాలిటి కోసం కాకుండా 
అధికారుల లంచాలకి వాడటం వల్లనే....

కాబట్టి, ఏదైనా జరగాలంటే దేశ ప్రజలందరి సహకారం దానితో పాటు ప్రభుత్వ అధికార గణంలో మార్పు ఉండాలే కానీ, ఎవరో గభాలున వచ్చి ఎదో మాయా జాలం చేసి ఎవరినీ ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా దేశాన్ని పైకి తీసుకుని రావాలని అనుకుంటే అంతకన్నా స్వార్ధం\అమాయకత్వము కానీ మరొకటి ఉండదు...కొత్త ప్రధాన మంత్రిగారు వచ్చి ఎదో మార్చేస్తారు అని అంటే...  వ్యవస్తలో మార్పు రానిదే... ఆ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే చర్యలు తీసుకోనిదే ఏ మాయా జాలంతో కూడా దేశం బాగుపడదని ఇదివరలో ఇదే బ్లాగులో వచ్చిన "త్యాగాలకి సిద్ధంగా ఉండాలిసింది ప్రజలేనా... మోదిగారు...???" లో[లింకు నొక్కండి]వివరించటం జరిగినది... 

ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ... ఇప్పుడొచ్చిన కొత్త ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని సినిమా హీరోల కన్నా ఎక్కువగా అభిమానించే వారు ఎక్కువయ్యారు... ఫేన్సు వలన పాపం హీరోగారు వెయ్యాలి అనుకున్న వేషం ఎలా వెయ్యలేకపోతున్నాడో, అలాగే మన మోడీగారి మీద ఆయన అభిమానుల విపరీత విశ్వాసం వల్ల కూడా ఆయన "చెయ్యాలీ" అని అనుకున్న పనిని సక్రమంగా చెయ్యటంలో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పవచ్చును. ఎదో ఎల్కేజీ పిల్లాడిని వెనకేసుకొచ్చినట్లుగా ఈ అభిమానులు ఆయనను వెనకేసుకొచ్చి ఇబ్బందులలోనికి నెడుతున్నారు...ఇంతకీ ఆయన చెపుతున్న మాటల్ని మాత్రం ఎవరికి వారు తమకి అప్లై చేసుకోకుండా ఇతరుల వైపు చూపెడుతున్నారు. ఇలా ఎవరికి వారు ఇతరుల వైపు చూపెడితే మోదీగారి ఇబ్బందులేమోగానీ, మన దేశంలో మడుకూ ఏ మార్పూ వచ్చే అవకాశం లేదు.

కాబట్టి, మన మోడీగారు చెప్పిన "మేడ్ ఇన్ ఇండియా" లేక "మేకిన్ ఇండియా" ఐడియా పనిచెయ్యాలంటే... దేశ ప్రజలూ మరియూ దేశ ప్రదానిగారు   చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని...

ముందరగా దేశ  ప్రజలు:

1] మనం కొనే వస్తువు మనదేశంది అయినా కాకపోయినా కూడా మన దేశంలోనే తయారై ఉండాలి...అంటే..మన దేశంలో తయారైయ్యే వస్తువుకి మనమిచ్చిన డబ్బులు మనలాంటి మన దేశ ఉద్యోగులకే జీతాలుగా వెళతాయన్న విషయం మీద అవగాహన కలిగి ఉండాలి... మన దేశ సంస్థలో పనిచేసి మనం జీతం పొందుతున్నట్లే...మనం కొనే దేశీయ వస్తువుల కంపేనీలలో పనిచేసే వాళ్ళు కూడా అలాగే జీతం పొందాలి అని అనుకోవాలి...అలా అనుకోవాలంటే మన దేశంలో తయారైన వస్తువులనే కొనాలి...అప్పుడే మన డబ్బు వారికి జీతంగా వెళుతుంది.

2] మనం కొనే వస్తువులలో ధరలలో తేడాలు ఉంటే... ఆ తేడా వలన నిజంగానే ఆ వస్తువు యొక్క నాణ్యత ఎక్కువ ఉన్నదా... ఉంటే అదే  కొందాము అని అనుకోవాలి...

3]నాణ్యత లేని వస్తువులని తయారు చేసే కంపనీలనీ, అవి అమ్మే దుకాణదారులనీ దూరంగా ఉంచాలి.

4] పైరసీ వస్తువులనీ అంటే డూప్లికేట్ వస్తువులని...వేరొక కంపెనీ పేరుతో చవుకరకం వస్తువులు తయారు చేసే కంపనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి శిక్షలు పడేట్లు చెయ్యాలి...[సినిమాల గురించి కాదు..."పైరసీ సామాజిక వేత్తలూ"...ఏది పైరసీ...? లింకు నొక్కండి]

5] ఏ సంస్థలో పనిచేసే వారైనా హక్కులుతో పాటు బాధ్యతల పట్ల కూడా బాధ్యతగా ఉండాలి.



దేశ ప్రధాని చెయ్యవలసినవి:

1] మనదేశంలో తయారైయ్యే వస్తువులు లాంటివి మరొక దేశం నుండీ రానియ్యకుండా కట్టుదిట్టం చెయ్యటం ... ఇలాంటి ఆంక్షలు కొత్తవేమీ కాదు. ఇదివరలో ఒక జపాన్ టేప్ రికార్డరును కొనాలంటే దొంగతనంగా స్మగుల్డు షాపులో కొనాలిసివచ్చేది... మరల అలాంటి పరిస్థితినే కల్పించాలి...

2] ప్రభుత్వానికి అవసరమయ్యే కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటి మొదలైన వస్తువులని దేశీయంగా తయారైనవే కొని ప్రోత్సాహించాలి.

3]ఇతర దేశాల వారి చేత మన దేశంలో పెట్టుబడిని మాత్రమే పెట్టించి, వారి పరిశ్రమలని మన దేశంలో నెలకొల్పాలి...ఆయా పరిశ్రమలలో తయారైయ్యే వస్తువులు ఇప్పటికే మన దేశంలో అధిక భాగం మంది ప్రజలు తయారు చెయ్యనివై ఉండాలి...

4]మన దేశంలో నాణ్యమైన వస్తువులని తయారు చేసే దేశీయ కంపెనీలకి అనేక రాయతీలు కల్పించి ప్రోత్సాహించాలి.

5]వస్తువుల కల్తీలపై కఠినమైన చట్టాలు చేసి వాటిని అమలు అయ్యే విధమైన "స్వచ్చమైన" అధికార వ్యవస్థని రూపొందించాలి.

6] ప్రతీ విషయానికీ లింకు ఉన్న ప్రభుత్వ అధికార అవినీతి వ్యవస్తని రూపుమాపే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి... జీతం కాకుండా పై డబ్బు తీసుకుంటే అసలుకే మోసం అనే భయాన్ని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికీ కల్పించాలి.

7] అవినీతిని ప్రొత్సాహించే వారిని వారు ఎవరైనాగాని...మరల అటువంటి ఆలోచనే రాకుండా ఉండే విధంగా శిక్షలు విధించాలి.

8] పెట్టుబడుల గురించి ఎక్కడికో పోనవసరం లేదు... మన దేశంలోనే ప్రోత్సాహకాలు ఇస్తే, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి... ఎన్.ఆర్.ఐ ల కన్నా ఎన్నో రెట్లు పెట్టుబడులు వస్తాయి...


9] దేశంలో ఉన్న వాళ్ళనేమో పార్టీఫండ్స్ పేరిట పిడించి స్వంత లాభాలు పొందుతూ, దేశం కోసం బయట దేశాల వారి దగ్గర బిచ్చమెత్తటం మానాలి.



10] స్వ దేశీయులు పెట్టుబడి పెట్టాలంటే రూల్స్ సరళ తరం చెయ్యాలి...కానీ దీనికి వ్యతిరేకం జరుగుతోంది. బయట వారి పెట్టుబడులకి రూల్స్ అఖర్లేదు అనే స్థితికి ప్రభుత్వం దిగజారింది...ఇది మారాలి.

11] ప్రపంచంలోని అనేక దేశాలు, మన దేశంలో ఉన్న  లక్షల కోట్ల విలువ గల వాడకందారుల [CONSUMER MARKET] మీద పడుతుంటే... మన దేశం మడుకు వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. క్వాలిటి వస్తువులని వీరికి దొరికేట్లు చేస్తే మన కంపనీలకి దేశీయ ఆదరణ ద్వారా బలం చేకూరుతుంది.


ఇలాంటివి అనేకం 
దేశంలో మార్పునకి కావాలిసి ఉన్నాయి... 
అందుకుగాను
ఒక నిజాయతి/స్వేచ్చని కలిగిన 
నిపుణుల కమిటిని ఏర్పాటు చేస్తే
 మరిన్ని ముఖ్యమైన విషయాలు 
తెలిసే అవకాశం ఉన్నది. 
అలాగే, 
ఇవన్నీ చెయ్యటానికి 
ప్రభుత్వ అధికారుల మీద పట్టూ, 
ప్రజలలో గౌరవంతోపాటూ భయాన్ని కలిగించి 
తన దమ్ము\శక్తీని ప్రధాని ఉపయోగించాలే కానీ...
 ఏదో ప్రాస కుదిరే మాటలు వాడి, 
మాటల మాయాజాలం చేస్తే 
మన దేశం 
"మేడ్ ఇన్ ఇండియా"--"మేకిన్ ఇండియా"
అవదు. 
ఫేక్ ఇన్ ఇండియాలోనే ఉంటుంది.


జై హింద్ 



                 అంరికి                   
                                                                           
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 
                    1953 అక్టోబర్ 1                   
 అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి