LOCAL WEATHER

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

డబ్బు చెట్ల నుండీ రాదని తెలుసుకొన్న ఆర్ధిక ప్రధానమంత్రి

 "We need to contain subsidies, money doesn't grow on trees, Manmohan Singh says..." 




మొత్తం మీద ఇన్నాళ్ళ పరిపాలన తరవాత మన ఆర్ధిక ప్రధాన   మంత్రిగారు  డబ్బు చెట్ల నుండీ రాదని తెలుసుకొన్నారు.....చాలా సంతోషం. అవును సార్, డబ్బు చెట్ల నుండీ పుట్ల నుండీ..... ఒహ్ సారీ పుట్ల నుండీ[గనుల నుండీ]వస్తోంది కదా....!!! వచ్చేది మనుషుల... అదే మన దేశం మనుషుల జేబుల్లో నుండే కదా.... వచ్చేదీ.....విదేశీయుల నుండీ కాదు కదా.....మరెందుకండీ విదేశీ మార్కెట్లు నాశనమైపోతున్నాయని తెగ జాలి పడిపోతున్నారు.....మీరు వారి మీద జాలితో మన దేశంలో చేసే పనుల వలన పూర్తి   ప్రపంచ ఆర్ధిక  సమానత్వం  వచ్చే అవకాశం ఉన్నది...వాళ్ళ లాగా మనం కూడా దిగజారిపోయి....!!!

మన ప్రజలకి సబ్సిడీలు ఇవ్వాలంటే చెట్లకి కాసే డబ్బులు కావాలి....కానీ బురుండీ లాంటి దేశాలకి మిలియన్ల డాలర్లు సహాయం చెయ్యటానికి డబ్బును ఏ చెట్టు నుండీ కోసి ఇచ్చారో మన ప్రధాన మంత్రిగారికే తెలియాలి....అదే చెట్టు నుండీ మన దేశం పౌరులకి కూడా ఇవ్వచ్చు కదా.....కామన్ వెల్త్ ఆటల వలన మన దేశానికి మిగిలినదేమిటో......తాను దూరటనికి చాలదు....మెడకో డోలు.

ప్రభుత్వ సొమ్ముతో..... కార్ల నంబరు బాగాలేదని కార్లు మార్చటం, వాస్తు  బాగా  లేదని బిల్డింగులని పడగొట్టి మరి కట్టించుకొన్న అధికారులకీ, మంత్రి వర్యులకీ, ప్రజా ప్రతినిధులకీ డబ్బు ఏ చెట్టుకి కాస్తొందో చెపితే బాగుంటుంది.  తమ
కోసమే రక్షణ  పేరుతో వేల కోట్లు తగలేసు కొంటున్న ప్రజా ప్రతి "నిధులకి" సొమ్ములు ఏ విత్తనం నాటితే వస్తున్నాయీ....? పాలక, ప్రతిపక్షాలు.... వారికి వారే ఒక బిల్లు పెట్టేసుకొనీ,  ఏకగ్రీవంగా తమ జీతాలను, సౌకర్యాలను కోట్లలో  లక్షలలో పెంచుకొన్నప్పుడు  ఆ డబ్బు  ఎవరి జేబులోది, ఏ చెట్టు నుండీ వస్తోందని ఆలోచించారా...??   కేవలం జనం డబ్బు జనం కోసం ఖర్చు పెట్టేప్పుడే వస్తుందా ఈ చె[త్త]ట్ల ఆలోచన....???

ఎన్నికలైయింది మొదలు తరవాత ఎప్పుడో వచ్చే ఎలక్షన్లకి ప్రభుత్వ సొమ్ముతో  ఇప్పటి నుండే విపరీత ప్రచారం   చేసుకొంటూ అనవసర పనికిమాలిన పధకాలని డబ్బు తగలెయ్యటానికి  అధికార పక్షానికి ఏరకం చెట్ల నుండీ డబ్బు వస్తోంది....?  మధ్య మధ్యలో అలిగీ రాజకీయ బేరాలు కుదరక ఉప ఎన్నికలంటూ ప్రభుత్వం చేత వేల కోట్లు ఖర్చు పెట్టటానికి ఎక్కడ నుండీ వస్తోందీ డబ్బూ...???

సభలూ సమావేశాలూ అంటూ లేని పోని ఆవేశ కావేశాలు నటిస్తూ వేల కోట్ల ప్రజాధనం వెదజల్లుతోంది    ఏ విత్తనం నాటితే వచ్చే  డబ్బు........ విత్తమంత్రి గారూ......అక్కడికి మీరొచ్చిన తరవాతే దేశం పైకెక్కడికో పోయిందనీ,  దానిలో ప్రజల భాగసామ్యం ఏమీ లేనట్లు ఎలా  మాట్లాడగలుగుతున్నారు....? ప్రజలు తమ తమ పనుల్లో చాలా చక్కగా నిమగ్నమై చక్కటి అభివృద్ధిని అందిస్తుంటే అదేదో మీ ప్రతిభ అయినట్లు దంబాలు కొట్టుకోవటం  మీకు సబబేనా...??
 

ప్రజాసామ్య దేశంలో ఎంతో బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి...ఎదో ఆకతాయి,  బాధ్యత తెలియని పిల్లలతో అన్నట్లుగా ప్రజలని ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకూ సమంజసం...?  ఎంతో బాధ్యతగల దేశ ప్రజలు ఎవరి దారిని వారు పని చేసుకొని వారు అభివృద్ధి చెంది,  దాని ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో,  "బాగా చదువుకొన్నామనుకొన్న వారు" కలగ చేసుకోవటం వలననే దేశ ప్రజలు తమ పనులు మానుకొని ఈ చదువుకొన్న వారి తలతిక్క పనులను సవరించే పనిలో పడాల్సి వచ్చింది. దీని వల్లనే మన దేశం కూడా యురోపు దేశాల బాట పట్టనున్నది. "మనం అన్నం తిన్న తరవాత అది లోపలికి వెళ్ళి ఎలా అరగాలో లోప చెయ్యపెట్టి దారి చూపిస్తే ఏమవుతుంతో అదే మన దేశంలో జరుగుతోంది....."

ముందుగా ప్రభుత్వం నడిపేవారు తమ ఇష్టానుసారం వేలకోట్ల ప్రజాధనాన్ని అనవసర  ఖర్చులు చేసి  దుర్వినియోగం  చెయ్యకుండా చూడాలి.   తరవాత,  పేద్ద ఆర్ధిక వేత్తలు తమ విశాల హృదయ వైశాల్యాన్ని కొద్దిగా తగ్గించుకొని స్వంత ప్రజల బాబోగులు చూస్తే ముందు తరాల వారికి మంచి చేసినవారవుతారు.......మన ప్రజల నుండీ వచ్చే డబ్బును మన ప్రజల కోసమే ఖర్చు పెడితే ఏ చెట్టు నుండీ డబ్బు అడుక్కొనే  పరిస్థితి మన దేశ ప్రజలకి కలగదు. 


 జై హింద్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి