LOCAL WEATHER

28, అక్టోబర్ 2012, ఆదివారం

తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!!



తెలుగు భాషా సంఘం అధ్యక్షునిగా మండలి బుద్ధ ప్రసాదుగారు ఎన్నికైనందుకు వారికి అభినందనలతో పాటూ మా విన్నపము....... 

ఇదివరలో తెలుగు భాషా అబివృద్ధి అనీ, సభలూ సమావేశాలూ అంటూ పెట్టి ఎదో కొద్దిమందిని శాలువాలని కప్పి సన్మానం చేసి చేతులు దులుపుకున్నారు.  కానీ, తెలుగు భాషని అభివృద్ధి చెయ్యటానికి ఇదేమంత ఉపయోగ 
పడదు.  ఎదో కొద్ది మంది పడితులను లెక్కలోనికి తీసుకోవటం కన్నా, ఎక్కువ మంది సామాన్య జనానికి తెలుగు పట్ల ఆశక్తి కలిగేట్లు చేస్తే బాగుంటుంది.       

ఎదైనా భాష అబివృద్ధి చెందాలంటే ఆ భాష వలన ప్రజా అవసరాలు తీరాలి.  అలాగే, తెలుగు నేర్చుకోవటం వలన బ్రతుకు తెరువు లభిస్తుంది అన్న నమ్మకాన్ని విద్యార్ధి లోకంలో కలిగించాలి.  ఆ భాష నేర్చుకొన్న వాళ్ళకి గుర్తింపు....... అంటే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ఉద్యోగాల్లోనైనా కనీసం  50శాతానికి తగ్గకుండా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యతని ఇస్తే, తెలుగు మాధ్యమంలో చదవటానికి ప్రోత్సాహం లభిస్తుంది. 


ఇక మన వాళ్ళు ఇంగ్లీషుకిచ్చే మర్యాద ఎలా ఉంటుందంటే;  ఇంగ్లీషులో మాట్లాడటమే గొప్ప అయినట్లూ... అందులో కొద్దిగా స్పెల్లింగు తేడా వచ్చినా.....గ్రామరు తేడా వచ్చినా ఆ మాట్లాడే  వాడిని పామరుడు,  ఏ జ్ఞానం లేనివాడుగ నిర్ణయించెసి వ్యంగంగా నవ్వుకుంటారు.... అదే పట్టుదల మన మాతృభాష పట్ల ఉన్నదా...?? తెలుగులో  కూడా అక్షరం మారితే అర్ధాలు మారిపొతాయి,  లేదా అర్ధం లేకుండ  పోతుందిమరి తెలుగు మీద శ్రద్ద ఎందుకు లేదు...???  ఎందుకంటే...... అక్కడికి ఇంగ్లీషు మాత్రమే జ్ఞానికి చిహ్నం అయినట్లుగా  చదువుకున్నామని అనుకున్న వారిలో నమ్మకం ఏర్పడింది.  కాబట్టి,  ఇంగ్లీషు భాష మాత్రమే జ్ఞానానికి చిహ్నమనే మూఢ నమ్మకాన్ని చెరిపేసి, తెలుగుకి కూడా అంతటి ప్రాభవం, తెలుగులో మాట్లాడే వారికి గౌరవం వచ్చే విధంగా గట్టి ప్రయత్నం చెయ్యాలి.  


ఇదే విధంగా, మన రాష్ట్రంలో   వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న మన రైళ్ళ మీద తెలుగులో ఊళ్ళ పేర్లు ఉండేటట్లు గట్టిగా ప్రయత్నం చెయ్యాలి...ఇదివరకు అలా ఉండేవి. ఇప్పుడు కేవలం మన రాష్ట్రంలో బయలుదేరే కొన్నిటి మీద మాత్రమే తెలుగు ఉంటోంది.....బోగిల మీదే కాకుండా టిక్కెట్టు  మీద ఉన్న తెలుగును కూడా తోలగించారు.....ఈ విధమైనటువంటి ప్రజోపయోగకరమైన వాటి మీద తెలుగు ఉండేట్లు   చర్యలు తీసుకొని,  అన్నిటిమీదా తెలుగులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటే కోట్లాది తెలుగు ప్రజలకి ఉపయోగకరంగా  ఉంటుంది.  హిందీ వారికి తామేదో సామంతులమనే భావన పోతుంది. 
 
  రాష్ట్ర రవాణా సంస్థలోనే దిక్కులేని తెలుగు.

తరవాత, ప్రపంచంలోని అనేక ముఖ్యమైన గ్రంధాలను తెలుగులోనికి అనువదించి, వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలి. అనువాదం అంటే మక్కీకి మక్కి కాకుండా....సులభతరంగా...ఎక్కువ భాగం నామ వాచకాలను మార్చకుండా అనువదించినట్లైతే బాగ ప్రజాదరణ పొదుతాయి. దీనికోసం తెలుగు అకాడమీ అని ఉన్నదో,  ఉండేదో........ అయితే  దాని ఉనికి తెలియటంలేదు.       
 
ఇంకో  విషయం,  మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం స్కూళ్ళు ఉన్నట్లుగానే, ఇతర రాష్ట్రాలలో  ఎక్కువగా తెలుగు  వాళ్ళు నివశించే  ప్రాంతాలలో  కూడా తెలుగు 
మాధ్యమం స్కూళ్ళని నడిపితే అక్కడ ఉన్న మన తెలుగు వారికి ఉపయోగకరంగా ఉంటుంది.  లేక పోతే అక్కడి తెలుగు వారు క్రమంగా అక్కడి భాష వారుగా మారిపొయ్యే ప్రమాదం ఉన్నది.... ఇప్పటికే అలా మారిపోయి, తెలుగును మాట్లాడటమే కానీ వ్రాయటం మర్చిపోయిన  తెలుగు వారు  ఇతర రాష్రాలలో లక్షలాదిగా ఉన్నారు. కాబట్టి,  ఈ విషయం మీద శ్రద్ధ పెట్టినట్లైతే,  ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రచారం మాట అటుంచి, కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకున్న వారవుతాము.  

అన్నిటికన్నా ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవహారాలన్నీ తెలుగులోనే సాగించాలి. దీని వలన తెలుగు నేర్చుకొన్న వాళ్ళకి ఉద్యోగవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇతర రాష్ట్రాల వారితో సంప్రదించాలంటే....ఆ భాషను తెలుగులో అనువదించే వారిని పెట్టుకొంటే....ఆ విధంగా కూడా తెలుగు వారికి మేలు చేసిన వారవుతారు. అలాగే, తెలుగులోనే బోర్డులు పెడితే [విపరీత అనువాదం చెయ్యకుండా] చూసే తెలుగు వారికి ఒక విశ్వాసంలాంటిది అభివృద్ధి చెందుతుంది.  

పైవి  కొన్ని  చెయ్యాలి  అంటే  తెలుగు భాషా సంఘానికి వేరే అధికారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉపయోగం ఉండకపోవచ్చు; కానీ,  జరిమానాలు  వేసే అధికారాన్ని మాత్రం ఇస్తే సత్వరం గుణం కలుగుతుంది......జరిమానాలకే  కదా మన వారు లొంగేది.  ఆ జరిమానాలు తెలుగులో తప్పులు మాట్లాడే వారి నుండి వసూలు చేసినట్లైతే మన తెలుగు టీవీల వారి నుండే వందల కోట్లు రూపాయలు వచ్చే అవకాశం వున్నది!!!

****

  తెలుగులో అక్షరం మారితే అర్ధాలు మారిపొతాయి, 
 లేదా అర్ధం లేకుండ  పోతుంది.  
ముఖ్యంగా "ణ" మరియు "ళ" 
ఇవంటే మన తెలుగు టివి వారికి పడదు..ఎందుకో....
వారి కోసం కొన్ని ఉదాహరణలు....

 ళ 
కల్లు [తాగేది]  కళ్ళు [చూసేవి]
పల్లు[చీర పమిట]  పళ్ళు[నోటిలో ఉండేవి]
మంగలం[క్షవరం] మంగళం[శుభప్రదం]
పెల్లి ..........పెళ్ళి 
వాల్లు వీల్లు........వాళ్ళు వీళ్ళు
కల[కలలు]........కళ[కళలు]

ణ 
జాన [కొలిచేది]  జాణ [తెలివిగలది]
ప్రయానం........ప్రయాణం
ప్రమానం[ఒట్టు వెయ్యటం]...ప్రమాణం[కొలత]
నానెం............నాణెం
రనము.....రణము

కారు[వాహనం] [నీరు "కారు"[క్రియ]] కాఱు[చిక్కని.... దట్టమైన]

రుషి...ఋషి 
రునము....ఋణము

ఇలా అనేకం...

ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ
ణ ణ ణ ణ ణ ణ ణ ణ
ఋ ఋ ఋ ఋ 
ఱ ఱ ఱ ఱ ఱ 

*****


4 కామెంట్‌లు:

  1. "...తెలుగులో తప్పులు మాట్లాడే వారి నుండి వసూలు చేసినట్లైతే మన తెలుగు టీవీల వారి నుండే వందల కోట్లు రూపాయలు వచ్చే అవకాశం వున్నది!!!..."

    ప్రభుత్వానికి మంచి సలహా ఇది, వెనువెంటనే మొదలుపెడితే ఖజానా నిండిపోవటం ఖాయం, అప్పుడు మద్యపాన నిషేధం పెట్టినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు (అదే అదాయం తగ్గదు).

    రిప్లయితొలగించండి
  2. శివరామప్రసాదు కప్పగంతు గారు, చెప్పాలంటే......గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. @చెప్పాలంటే......

    ముందు మీరు తెలుగును తెలుగు లిపిలో వ్రాయండి చాలు, వేరే వాళ్ళ సంగతి తరువాత.

    రిప్లయితొలగించండి