LOCAL WEATHER

20, నవంబర్ 2012, మంగళవారం

హాంద్రీ....నీవా.........నేనా....!!!!!



దేశంలోకెల్లా ఎత్తైన ఎత్తిపోతల ప్రాజెక్టుని ప్రారంభించారు......చాలా ఏళ్ళ తరవాత ఒక పనికొచ్చే పనిచెశారు....బాగున్నది.  దీని వలన లక్షల మందికి ఉపయోగం ఉన్నది.....దీనిని పార్టీలకి అతీతంగా అందరూ మెచ్చుకో తగినదే.....కానీ, ఎవరికి వారు, ఇది మా ప్రాజెక్టు, ఇది మా మనిషి శంకుస్థాపన చేశాడు,  మా మనిషి మొదలు పెట్టాడు,  ఇది మేము  పూర్తి చేశాము   అని  గొడవ మొదలు పెట్టారు....


ఎవరికి వారు, ఈ గొప్పతనం మాదంటే మాదని కొట్టుకొన్నారు......కానీ, అసలు ఇది ప్రజల సొమ్ముతో కట్టారన్న సంగతి మర్చేపోయారు.....ఎవరికి వారు తమ జేబులో సొమ్ముతో కట్టినంత ఫోజులు కొడుతున్నారు.  రాజకీయ నాయకుల  ఈ విధమైన ప్రవర్తన వలన ప్రజాసామ్యంలో ప్రజల పాత్రను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నది.... నిజంగా తమకి  ఇందులో ప్రమేయం ఏమీ లేదా...?  ఇది ఎవరి దయా దాక్షణ్యాల వల్లనో వచ్చిందా...?? అన్న సందేహాలు సామాన్యుడిని చుట్టుముడుతున్నాయి.  దీని వలన ప్రజాసామ్య దేశమైన మన దేశంలో,  రాజరిక బానిసత్వపు లక్షణాలు ప్రబలుతున్నాయి...... 



ఎవరో ఒక మనిషి ఉంటేనే ఇదంతా జరుగుతుంది...! ఎదో ఒక రాజకీయ పార్టీ వల్లనే జరుగుంది....!! ఎవరో అదిష్టానం అనే వారి వల్లనే జరుగుతుంది.....!!! అన్న ఆలోచనలు సామాన్యుడికి కలిగి,   "అయ్యో వారు లేకపోతే ఎలా...?"  అని ఒక అమాయక అభధ్రతా భావం పెరిగిపోతున్నది.   ప్రజాసామ్యంలో ప్రతీ సామాన్యుడికీ కూడా తమ వల్లనే దేశం నడుస్తోంది అన్న ఆత్మ స్థైర్యం పెంపొందించి, తాము కష్టపడితే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచన కలిగించాలిసిన మన నాయకులు..........ఎవరికి వారు తమకి ప్రజల ద్వారా దక్కిన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్ముతో రాజరికం వెలగబెడుతూ.... తాము ప్రజల కోసమే త్యాగాలు చేస్తున్నట్లుగా తెగ నటించేస్తున్నారు. తాము అధికారంలో లేకపోతే సామాన్య ప్రజలకి ఎదో జరిగిపోతుందనే భయాన్ని కలిగిస్తున్నారు......"దేవుడు తమతోనే ఉంటాడనీ, తాము చెప్పినట్లు వినకపోతే నరకంలో పడిపోతారని, అమాయక ప్రజలని భయభాంతులను చేసి ప్రజలని తమ గుప్పిటలో పెట్టుకొన్న"  మధ్య యుగాల్లోని యూరప్పు మత పెద్దలు లాగా ప్రవర్తిస్తున్నారు.  
 
ఇలాంటి పనికిరాని పోటీ ప్రచారం వలన, భవిష్యత్తులో  "వారు కూడా" దీర్ఘ కాలానికి సంబంధించిన అభివృద్ధి పనులు చెయ్యటానికి వెనుకాడతారు.....ఎందుకంటే ఇవి పూర్తి అయ్యేటప్పటికి వారుంటారో లేదో అన్న అనుమానంతో,  ఎక్కువ ఖర్చుతో కూడి,  దీర్ఘ కాలం సాగి....... ప్రజలకి అసలైన ప్రయోజనం కలిగించే కరెంటూ, నీటిపారుదల లాంటి మొదలైన ప్రాజెక్టులు మరుగున పడిపోతాయి. ఎప్పటికప్పుడు "ఫాస్ట్ ఫుడ్" లాంటి దిక్కుమాలిన ప్రజా పథకాలనే పెట్టి,  ప్రజలను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేసి,  దిర్ఘకాలంలో ప్రజలకి తీరని ద్రోహం చేసిన వారవుతారు.  

కాబట్టి, ప్రజలకి సంబంధిన పనులు జరిగినప్పుడు.....ఏ ప్రాజెక్టు ప్రారంభోస్థవానికైనా ... అన్ని రాజకీయ పార్టీల వారినీ పిలిచి....వారికి కూడా సముచిత స్థానం గౌరవం కలిపించి......వారిని కూడా మట్లాడనిస్థే  ఇందులో ఏ గొడవా ఉండదు కదా........ఇదేమీ వారి జేబులో సొమ్ముతో కట్టినవి కావు, వారి పార్టీ మీటింగులు కాదు కదా!! అధికార ప్రతిపక్షాలు నువ్వేంచేశావు....నువ్వేంచేశావు అనుకొని, వారిని గెలిపించిన ప్రజలని అవమానించ కుండా,  ప్రజానాయకులందరూ  ఒకరినొకరు గౌరవించుకొంటూ ఉంటే .... ప్రజాసామ్యనికి గౌరవం ఉంటుంది.  ప్రజల ఆత్మస్థైర్యం పెరుగుతుంది.........లేకపొతే ప్రజానాయకులే ప్రజాసామ్య   ద్రోహులుగా  మిగిలిపోతారు. 


************ 

బొమ్మలు  నెట్ పేపర్లోనివి 
  
  

1 కామెంట్‌: