ఆరోగ్యాన్నిచ్చే కాయగూరలలో పొట్లకాయ ఒకటి. దీని ఆకారమే మిగిలిన కూరగాయలకంటే విభిన్నంగా ఉంటుంది. దీనిని మార్కెట్టులో కొన్న వెంటనే కూర చేసుకొంటే రుచి బాగా ఉంటుంది. అంటే ఎక్కువ నిలవ పెట్ట కూడదు. తప్పనిసరై దాచాలంటే పొట్లకాయను 3, 4 భాగాలుగా కట్చేసి ఫ్రిడ్జిలో పెట్టుకోవచ్చును.పొట్లకాయతో మాములుగా కూర చేసుకోవచ్చును, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు.
కూరకు కావాలిసినవి:
పొట్లకాయ
ఎండు మెరపకాయలు రెండూ లేక మూడు, కొద్దిగా మినపప్పు, ఆవాలు...కొంచం శనగ పప్పు,
నానబెట్టిన పెసరపప్పు లేక కంది పప్పు కొద్దిగా[పప్పు నానిన తరవాత నీళ్ళు ఒంపేసుకోవాలి],
కొద్దిగా నూనె, కావలిసినంత ఉప్పు.,
బియ్యప్పిండి కొద్దిగా...
కూర చేసే విధానం.
ముందరగా పొట్లకాయను చక్రాలుగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు తరుగుకోవాలి. ఎందుకంటే, ఈ ముక్కలు ఉండికేటప్పుదు ఒకే విధంగా ఉడుకుతాయి. లేకపోతే చిన్నవి బాగా ఉడికి, పెద్దవి సరిగ్గా ఉడకవు. తరవాత, కట్ చేసిన ముక్కలను ఒక గిన్నెలో వేసి వాటికి తగినంతగా ఉప్పు వేసి కలపాలి. ఒక అరగంట ఉప్పులో నానిన తరవాత చెత్తో కలిపి, చేతికి దొరికినన్ని ముక్కలను గట్టిగా పిండి, ఆ ముక్కలను వేరే పళ్ళెంలో పెట్టుకోవాలి. అలా అన్ని ముక్కలనీ పిండాలి. [ఇదే కూరను ఉప్పు చల్లి ఉడకబెట్టి తరవాత పిండుకోవచ్చును]
ఇప్పుడు స్టవ్వు మీద గిన్నె పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తరవాత, దానిలో ఎందు మెరపకాయలూ, శనగ పప్పు, మినపప్పు, ఆవాలూ వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరవాత, ప్రక్కన పెట్టుకొన్న పొట్లకాయ ముక్కలనూ, నానబెట్టిన పప్పునూ[పెసర పప్పు లేక కంది పప్పు] గిన్నెలో వేయాలి. ఒకసారి గరిటతో కలియబెట్టి, ఆ తరవాత మూత పెట్టాలి
ఇప్పుడు ఆ ముక్కలు చక్కగా ఉడుకుతాయి. అలా ఉడికిన తరవాత మూత తీసివేసి, కొద్దిగా స్టవ్వు మంట పెంచి కూరను గరిటతో వేయించుకోవాలి. అప్పుడు అందులో ఉన్న నీరు ఆవిరి అయి, కూర మంచి రుచిగా తయారవుతుంది. ఇంకా నీరు ఉన్నట్లైతే కూరలో కొద్దిగా బియ్యప్పిండిని వేసి కలియపెట్టి వేయించుకోవాలి. అంతే కూర మంచి రుచితో తయారైంది.
ఇక, పొట్లకాయ పెరుగు పచ్చడీ చెయ్యాలంటే ఈ తయారైన కూరలో పెరుగూ, కొద్దిగా పసుపూ వేసి ఓ గంటసేపు నాననిస్తే చాలు: పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైనట్లే.
*****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి