LOCAL WEATHER

27, డిసెంబర్ 2012, గురువారం

తెలుగు టీవీల్లో తెలుగు ఠీవీ ఎంత...??? ...నేతి బీరకాయంత...!!!

తెలుగు ప్రపంచ మహా సభలు జరగబోతున్న సందర్భంగా, మన తెలుగు టివీలు తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తున్నాయి. అందరూ తెలుగు వాడాలని అని చెపుతున్నాయి... కానీ వారి టీవీలలో భాషని ఏమాత్రం మార్చకుండా యధావిధిగా అలాగే వాడుతున్నాయి..  వాల్లూ వీల్లూ,  నాన్యత, ప్రమానం[ప్రమాణం], కల్లు, అంటూ చక్కగా భాష తెలిసిన వారిచేత కూడా ఇలా పలికిస్తున్నారు....



సరే, ఇదెలాగూ మారదు... కనీసం పేర్లైనా తెలుగులో ఉన్నాయా అంటే   అదీ లేదు....!!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ తెలుగులోనే ఉండాలనీ లేకపోతే జరిమానాలు వడ్డిస్తామనీ చెపుతున్నది... ఆ జరిమానాలు ముందర మన తెలుగు టీవీలకే పడే అవకాశం కనపడుతోంది...... ఎందుకంటారా... దిక్కుమాలిన తెలుగు వాడినందుకు కాదు.... వారి వారి టీవీల పేర్లన్నీ ఇంగ్లీషులోనే ఉండటం వల్లన.... 

ఒకటి రెండు టీవీలు మినహా మిగిలినవన్నీ తమ పేర్లని ఇంగ్లీషులో వ్రాసుకోవటమే కాదు.... అసలు వాటిని ఇంగ్లీషులోనే పెట్టారు... ఉదాహరణకి టీవీ నైన్, టీవీ ఫైవ్, వీ సిక్స్, ఏ టీవీ, హెచ్‌ఎం  టీవీ, సీవీఆర్ టీవీ, ఏబీఎన్, ఐ టీవీ, స్టుడియో ఎన్  లాంటివి.. .. ఇలా   ఉన్నాది  మన మార్గ దర్శకాలైన తెలుగు టీవీల పేర్ల పరిస్థితి. ఇక ఇవ్వి చెప్పే  "టెల్గు" విషయాలకి ఏమి గౌరవం ఉంటుంది.... 


మరికొన్ని భారతీయ పేర్లు తగిలించుకొన్నప్పటికి వాటి పేర్లు ఇంగ్లిషు అక్షరాలలొనే ఉన్నాయి. ఆ మాత్రం అక్షరాల అందానికి కూడా తెలుగు నోచుకోలేదా...? ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించిన మన తెలుగుకి మనవారిచ్చే గౌరవం.........


ఒకదానికి ఒకటి విరుద్దమైనప్పటికీ "సాక్షీ", "ఈటీవీలు" తెలుగును ఉపయోగిస్తున్నాయి. దూరదర్శన్ వారు ఎంత హిందీ సేవ చేసినప్పటికీ పేరులో మాత్రం తెలుగూ..ఇంగ్లీషులని వాడుతున్నారు...ఏబీఎన్ వారు ఇంగ్లీషులో  పేరెట్టుకొన్నప్పటికీ తెలుగులో "ఆంద్రజ్యోతి" అని అప్పుడప్పుడూ వేస్తున్నారు. ఇలా కొద్ది టివీలు తప్ప మిగిలినవన్నీ తెలుగు అక్షరాల అందాన్ని తమ టీవీల పేర్లలో కనపడేట్లు చెయ్యటంలో విఫలం అయినాయి.


తెలుగులో అందమా అని ఆశ్చర్యపోకుండా మన తెలుగు సినిమా వారి సహాయం తీసుకొంటే వారు చక్కగా సహాయం చేస్తారు కదా....పాత సినిమా పేర్లు దొరకలేదు కాని వాటిల్లో ఇంకా అందమున్నది.


తెలుగుకి గౌరవం ఇద్దాం అని మాటలు కాదు......  ముందర టీవీల పేర్లు ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, వాటిని తెలుగు అక్షరాలని ఉపయోగించి తెలుగులో వ్రాసినట్లైతే బాగుంటుంది... తెలుగుకి ఏమో కానీ కనీసం "తెలుగు అక్షరానికైనా" గౌరవం ఇస్తే బాగుంటుంది.  మనకి మనం కాకపోయినా, ఇతరులు  ప్రపంచంలో అత్యంత అందమైన భాషగా 2వ స్థానాన్ని గుర్తించినందుకైనా  తెలుగుకి గౌరవాన్ని ఇద్దాం.... 






@@@@@@@@@@@
ఈ సందర్భంగా వ్యాఖ్యల్లో వచ్చే  నా పేరుని "Radhakrishna  kappagantu"  తెలుగులో వచ్చేట్లు మార్చాను.
@@@@@@@@@@


ఇక యదావిధిగా బొమ్మలన్నీ గూగుల్ వే 





3 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా ఎంతో శ్రమించి మంచి టపా సందర్భోచితంగా ఇచ్చారు.మీకు అభినందనలు !!!

    రిప్లయితొలగించండి
  2. అవును మన తెలుగు టి విల్లో తెలుగు ఠీవి లేనేలేదు. తెలుగును సరిగ్గా ఉచ్చరించటం చేతకాని బొమ్మలను తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత దుర్భరమైన ఉచ్చారణతో మనకు వార్తలు వగైరాలు వినిపిస్తూ ఉంటారు. ఆమాట అంటే మీడియా మమ్మల్నే అంటారా అనే పొగరుమోత్తనం కూడానూ! "తెలుగు" అనే మంత్రిత్వ శాఖను ఏర్పరిచి, ఆ శాఖకు కనీసం ఇలాంటి అవకతవకలను సరిచేసే అధికారం ఇవ్వాలి. ఎలాగూ మనకు సర్వరోగ నివారిణి అదే "అవినీతి" ఒకటి సర్వాంతర్యామిగా ఉన్నది కదా ఆ "అవినీతే" అన్నిపనులూ చేసిపెడుతుంది. ఆ శాఖ వాళ్ళకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనైనా సరే ఈ టివి వాళ్ళు వాళ్ళ పేర్లు కనీసం తెలుగులోనైనా వ్రాసుకోవటం మొదలుపెడతారు.

    టి వి ల్లో ఉద్యోగాల్లో చేరాలంటే ఆ ఇంటర్వ్యూ చేసే వాడి ప్రకారం కన్నూ ముక్కూ బాగుండటం కాదు. తెలుగు భాష, ఉచ్చారణ, వ్యాకరణం, సాహిత్యం, కలగలిపి మంచి పాథ్యాంశాలు తయారుచేసి అవన్నీ నేర్చుకున్న వారికి, పన్నెండో క్లాసు తరువాత, పట్టా ఇవ్వాలి. ఈ పట్టా ఉంటే కాని టి వి ల్లో కాని పత్రికల్లో కాని ఉద్యోగాలు ఇవ్వకూడాదు అన్న నిబంధన పెడితే కొద్దిగా అ ఆ లు అనేవి ఉన్నాయని తెలిసిన వాళ్ళన్నా మన మీడియాలోకి వస్తారు. లేకపోటే "వాల్లు", "కల్లు","ముక్యం", "పెల్లి" భాద" వంటి కంకర్రాళ్ళు తగులుతూనే ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  3. స్పందించినందుకు శివరామప్రసాదు కప్పగంతు గారికి, వసంతం గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి