LOCAL WEATHER

31, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగు సభలా........? శాలువా సభలా.......??

అసలు విషయం కన్నా కొసరు విషయం ముందర వ్రాస్తున్నాను........ ఇవాళ ఉదయం మన వార్తా చానళ్ళలో "చైనా వారి కళా ఖండాల ప్రదర్శన" గురించి చెపుతు.......... "అద్భుతమైన కల ఖండాలని చైనా వారు ప్రదర్శించారు" అని వార్తలు చదివే వారు ముద్దు ముద్దుగా చెప్పారు........ సరే ఈ వాక్యాన్ని మన గూగుల్ అనువాదంలో పడేస్తే ఎలా వస్తుంది అని వేసాను....... ఇదిగో ఈ క్రింది విధంగా వచ్చింది.

"అద్భుతమైన కల ఖండాలని చైనా వారు ప్రదర్శించారు" = గూగుల్ అనువాదం = "They performed a wonderful dream that had come to China".


సవ్యంగా ఇలా ఉండాలి........
"అద్భుతమైన కళని చైనా వారు ప్రదర్శించారు". =  గూగుల్ అనువాదం = " They performed a wonderful art in China".

ఈ విదంగా గూగుల్ అనువాదం అంటేనే భయంకరంగా  ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది.......అర్ధం ఉన్నా లేకున్నా...........గూగల్కి తెలిసినంత తెలుగు కూడా మన తెలుగు టివిల వారికి తెలియదంటే సిగ్గుతో మన టివి వారు...............


ఇక అసలు విషయంలోనికి 

తెలుగు మహా సభలు బొలెడంత ఖర్చు చేసి వైభవంగా చేసేశారు...... ఆ సభలు దేనికోసం జరిగినాయో దానికోసం మడుకూ జరిగినట్లు అనిపించలేదు..... మళ్ళీ మామూలే... గంగిరెద్దులూ, కుండల తయారీ, నాట్యాలూ, శాలువాలూ........ "ఇంతకీ ఇవి తెలుగు భాషా సభలా...?  లేక తెలుగు సంస్కృతిక సభలా"....?? ఈ సభల్లో గంగిరెద్దులతో పనియేమి...... వస్త్ర  ధారణా విషయం ఎందుకు......... ఎక్కడో పడిపోతున్న తెలుగు భాషని రక్షించుదామని కదా........ మళ్ళీ  పాత ధోరణే.......మూడు శాలువాలు.....ఆరు ఉపన్యాసాలు.... ఈ సభలకు అయిన ఖర్చుని తెలుగు భాషాభివృద్దికి ఇచ్చేనట్లయితే బాగుండేది. 

ప్రజలకి భాష వలన ఉపయోగపడే చర్యలు తీసుకోవాలి.... తెలుగు ఉద్యోగాలని సృష్టించాలి.... అంతే కాని ఇలా పేద్ద సభ చేస్తే,  అది ఒక  పెద్ద బల ప్రదర్శనగా ఉన్నదే కాని తెలుగు భాషా సభలాగా లేదు..... మరి ఈ సభలో  రాష్ట్రంలో ఉన్న మిగిలిన పార్టీలవారు  కనపడలేదు.......వారేమైనారు....వేదికని కూడా తిరుపతిలో కాకుండా ఏ ఓరుగల్లులో పెట్టినట్లైతే కాకతీయ ఉత్సవాలకి మరింత అందాన్నిచ్చే అవకాశం ఉండేది.... పాపం గవర్నర్ గారు కష్టపడి తెలుగుని మాట్లాడటం బాగున్నా...... నాకు తెలిసినంతవరకూ చాలామంది ఆరవ వాళ్ళకు చక్కటి తెలుగే వచ్చు మరి...........   


జరిగిన సభలో తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చినట్లే కనపడలేదు...... వారి గుర్తు.... పైన ఇంగ్లీషూ, హిందీ ఉండీ అడుగున తెలుగులో ఉన్నది... రేపు తెలుగుని ప్రముఖంగా వ్రాయమని వీరు ఏముఖం పెట్టుకొని జనానికి చెపుతారు...... షాపుల పేర్లూ, ఆఫీసుల పేర్లూ తెలుగులోనే పైన వ్రాసి, క్రింద ఏ భాషలోననా వ్రాసుకోమని చెప్పిన వారు...... తామే పైన వేరొక భాష వ్రాసి, తెలుగుని క్రిందకి నొక్కారు.....

ఏదైనా కార్యక్రమం జరిగితే సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం మాములే....  కానీ, సభల్నే సాంస్కృతిక సభలలాగా మార్చటం సబబుగా లేదు.  పైగా అక్కడ జరిగిన సభలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు... సభ  జరగాల్సింది తెలుగు భాష గురించి అయినప్పుడు.... శ్రీకాకుళం భాష, గోదావరి జిల్లా యాసా, నెల్లురి తెలుగు, కర్నూలు భావం, తెలంగాణా గానం ఎక్కడా వినిపించలేదు. తెలంగాణా గానం ఎందుకన్నాను అంటే....... ఇదివరలో శుద్ద గ్రాంధిక తెలుగు భక్తి పాటలు మాత్రమే జనానికి అందుబాటులో ఉండేవి... కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయం దగ్గరా తెలంగాణా యాసలోని భక్తి పాటలకి విపరీత జనాదరణ ఉన్నది....... ఈ విధమైన  తెలుగులో పలు వైవిధ్యంగల అనేక తెలుగు యాసల అందానికి ఎక్కడా ప్రాధాన్యతని ఇవ్వలేదు..... ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగా జరిగిందే కానీ, అందులో ప్రజా చైతన్యం ఎక్కడా కానరాలేదు.

ఇకపోతే, ఇదేమీ కాంగ్రెస్సు మాహా సభ కాదు కదా; మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు పాల్గొనలేదు....? పిలవలేదా....?? లేక పిలిచినా వారు రాలేదా.....?? పిలవకపోతే నిర్వాహకుల తప్పు....పిలిచినా రాకపోతే తెలుగు భాషమీద మిగిలిన వారి గౌరవం ఎంతటిదో తెలుస్తోంది.  ఇకపోతే, పాపం ఒకాయన  తమ స్వామిభక్తిని చాటటానికి నల్ల జెండాలు పట్టుకొని రావటం చాలా అసహ్యకరంగా ఉన్నది.... పైగా ఆయన తెలుగు తల్లి ముఖాన నల్ల జెండా పెట్టి మాట్లాడుతుంటే ఆయన నిరసన తెలుగు తల్లిమీదా.... అని అనుమానం వచ్చింది... ఇలాంటి విషయాలని కూడా రాజకీయం చేయటం తెలుగు రాజకీయ వ్యవస్థ సిగ్గు పడే విధంగా ఉన్నది..... 

ఇక సభలో మాట్లాడేవారు ఏమి మాట్లాడోరో అర్ధం కాలేదు, కానీ ఒకటి మటుకూ అర్ధం అయింది... భాషాభిమానం అంటే ఏమిటో అరవ వాళ్ళ నుండో లేక ఇతర భాషల వాళ్ళ నుండో చూసి నేర్చుకొమ్మని కసిరినట్లుగా చెప్పారనిపించింది... ఇంతకీ తెలుగు భాష గురించి వీరు ఏమి చేస్తారో చెప్పలేదు. భాషని జనానికి ఉపయోగ కరంగా ఉంచితే ఎవరైనా దానిపట్ల ఆశక్తిని చూపుతారు... కనీసం రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఏ విన్నపం చేసుకోవాలన్నా వాటిని ఇంగ్లీషులో వ్రాయలని ఉంటే,  తెలుగు ఎవరు నేర్చుకొంటారు...?? అయ్య సభలో మాట్లాడిన పెద్ద మనుషులలారా...... ఈ రోజు ఏదైనా మనగలగాలంటే అది ప్రజల భ్రతుకు తెరువుతో మిళితం అయి ఉండాలి.... అంతే కానీ తెలుగుని రక్షిద్దాం అని ఊకదంపుడు మాటలు మాట్లాడి మన దారిని మనం పోయి మన వాళ్ళని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చేరిపిస్తే, మన మాటని ఎవరు నమ్ముతారు....?? ఎందుకు నమ్మాలి...??? 


ఊరికే తెలుగు నేర్చుకొని కూర్చోండి అంటే  ప్రజలేమన్న పాతకాలపు రాజ ఆస్థానంలో ఉన్నవారా...... వారినైతే రాజులు పోషించారు కాబట్టి హాయిగా మంచి వాతావరణంలో తెలుగు భాషాభివృద్దిని చెయ్యగలిగారు... అలా చెయ్యటం వల్లనే మనం ఈ రోజున చెన్నయ్ వెళ్ళినా, బెంగుళూరు వెళ్ళినా, భువనేశ్వర్ వెళ్ళినా, తిరువనంతపురం వెళ్ళినా తెలుగు మాట పాట వినపడుతోంది...రాజుల్లాగా కాకపోయినా, కనీసం ..... రాష్ట్ర ఉద్యోగాల్లో  50 శాతం ఉద్యోగాలని తెలుగు మాధ్యమంలో చదివిన వారికి తప్పని సరిగా కేటయిస్తే చాలు, కోట్ల రూపాయల పెట్టి ఏ సభలూ నిర్వహించకుండానే తెలుగు అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని దుకాణాలా, ఆఫీసుల, ఊళ్ళ పేర్లే కాకుండా, మన రాష్ట్రం గుండా వెళ్ళే వందలాది రైళ్ళ మీద తప్పనిసరిగా తెలుగు అక్షరం కనపడి తీరాలి అని చట్టం చేస్తే చాలు, బోలెడు మంది తెలుగు వ్రాతగాళ్ళకి పని దొరుకుతుంది.... ఏ రాష్ట్రం వారు వచ్చినా, ఏ ఉత్తరం వ్రాయాలన్నా తెలుగులోనే ప్రభుత్వ కార్యక్రమాలు జరిపితే అనేక మంది తెలుగుని మాత్రం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి....

ఇంతకు ముందు వ్రాసిన తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!! లొ ఇదే విషయం వ్రాసాను....."ఎదైనా భాష అబివృద్ధి చెందాలంటే ఆ భాష వలన ప్రజా అవసరాలు తీరాలి.  అలాగే, తెలుగు నేర్చుకోవటం వలన బ్రతుకు తెరువు లభిస్తుంది అన్న నమ్మకాన్ని విద్యార్ధి లోకంలో కలిగించాలి.  ఆ భాష నేర్చుకొన్న వాళ్ళకి గుర్తింపు....... అంటే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ఉద్యోగాల్లోనైనా 50 శాతానికి తగ్గకుండా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యతని ఇస్తే, తెలుగు మాధ్యమంలో చదవటానికి ప్రోత్సాహం లభిస్తుంది". ఏది ఏమైనా ఈ సభల్లో తెలుగు భాషకి సంభంధించి  ప్రత్యేకించి చేసిందేమీ లేదు........... 

ఈ సందర్భంగా  శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన "చక్కర కలిపిన" అనే పాటని ఇక్కడ ఉంచుతున్నాను.  పాడినది  కైకలూరులో సంగీతం మాస్టారుగా పనిచేస్తున్న చిరంజీవి పోపూరి శ్యాం సుందర్.........@@@@@@@@@@@@@@@@@@@@