LOCAL WEATHER

12, మార్చి 2013, మంగళవారం

బిట్టి మొహంతి ఉదంతం వ్యవస్థలో లోపమా....???


ఇంతకీ ఈ బిట్టీ మొహంతీ ఎవరు...??? రాజస్థాన్‌లో ఒక జర్మనీ మహిళని రేప్ చేసిన కేసులొ నిందితుడు, 2006లో పెరోల్ పై విడుదలై పారిపోయాడు. ఇతని తండ్రి మొహంతీ  ఒరిస్సా డీజీపీ కావటంతో, అతని హామీపై విడుదల చేశారు. ఇతను పారిపోగానే, అతని తండ్రి ఉద్యోగం పోయింది. ఈ పారిపోయిన బిట్టినే మారు పేరుతో కేరళాలో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఈ మధ్యన రాజస్థాన్ పోలీసులు పారిపోయిన నిందితులు ఫొటోలు రిలీజ్ చెయ్యటం... ఇతనిని కేరళాలో గుర్తించటం, అరెస్టు చెయ్యటం జరిగిపోయినాయి. ఇతను ఇంతకాలం దొరకకపోవటానికి కారణం పోలీసులు అసలు వెతకకకపోవటమే అని అందరూ అంటున్నారు... మరి దీనంతటికీ కారణం వ్యవస్థలో లోపమా అనే ప్రశ్నని చాలా మందే లేవదీశారు....!!! 

అయితే దీనంతటికీ కారణం వ్యవస్థ అవునో కాదో తెలియదు కానీ, మన దేశంలో ఏ డిపార్టుమెంట్ అయినా,  అయిన వాళ్ళకి ఒక నీతీ,  బయట వాళ్ళకి ఒక నీతి అన్న పద్దతిన మెలగటమే దీనికి కారణం అనిపిస్తోంది.

మొదలుగా పోలిసు డిపార్టుమెంటునే తీసుకొంటే.... ఇందులో పనిచేసే వారు ఏదైనా తప్పు చేస్తే, సాధ్యమైనంతవరకు తప్పించాలనే చూస్తారు.  లేదా,  వెంటనే వారిని అక్కడి నుండీ ట్రాన్స్‌ఫర్ చెయ్యటం జరుగుతుంది.... ట్రాన్స్‌ఫర్  చేస్తే, వారు చేసిన  తప్పు సంగతేమిటి...???

బాంకుల్లో పనిచేసే వారి సంగతి తీసుకొంటే, వీరికి తప్పు సంగతి అలా ఉంచితే... డబ్బుతో పని కాబట్టి.. ఆ డబ్బుకు సంబంధించి సమాజంలో ఎవరికీ లేనన్ని సౌకర్యాలని కల్పిస్తారు. రెండవది, ఆ డబ్బుకు సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే సాధ్యమైనంత వరకూ వారి ఉద్యోగం పోకుండా ఉండటానికే సర్వ విధాలా ప్రయత్నిస్తారు. ఉదాహరణకి,   విజయనగరం ఒక బాంకు  కాషియరు తాను కౌంటరుకు రాగానే, అక్కడ అందుబాటులో ఉన్న డబ్బు మొత్తం తీసుకొని కారులో బరంపురం పారిపోయాడు.... అక్కడ జల్సాలు చేసిన తరవాత పట్టుబడ్డాడు... కానీ అతనికి వేసిన శిక్ష కేవలం ట్రాన్స్‌ఫర్ మాత్రమే. అతని ఉద్యోగం సేఫ్. ఇలాంటి సంఘటనలలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి సంఖ్య అతి తక్కువ. మహా అయితే వారికి డబ్బుతో పనిలేని చోట వేస్తారు అంతే. 

అలాగే ఆర్టీసీ.... ఈ ఉద్యోగులందరికీ బస్సు పాసులూ, వారి ఫ్యామిలీలకి కుడా అదనపు సౌకర్యాలే.... డిపోలో అయిలు అమ్ముకొనే వారుంటారు, స్పేర్లు అమ్ముకునే వారుంటారు... వారిని కాపాడటానికి యధావిధిగా యూనియన్లు ఉండనే ఉన్నాయి. ఇక రైల్వే వారి గురించి చెప్పనే అఖర్లేదు... వారేదో దేవతా భూముల నుండి వచ్చినట్లుగా రైళ్ళలో వ్యవహరిస్తారు... కనీసం మనం కొన్నట్లుగా టిక్కెట్టైనా కొనకుండానే....!!!  

రాజకీయాల్లో అవినీతికి పాల్పడితే వారు రాజీనామా చేసే వరకే పట్టించుకుంటారు .  ఆ తరవాత దీనికోసం అల్లరి చేసిన వారు కూడా పట్టించుకోరు. ఇలా ఒకరేమిటి మన సమాజాన్ని ఏలుతున్న మన ప్రజా ప్రతినిధిలు పొందే సౌకర్యాలు దగ్గర నుండీ ప్రతీ డిపార్టుమెంటులో వారి అవకాశం కొద్దీ వారు అనేక ఎక్కువ సౌకర్యాలని పొందుతున్నారు.  ఆ సౌకర్యాలు మిగిలిన సమాజానికి ఉండవు.... ఇలా అనేక విభాగాల్లో చేసే వారికి  ఇచ్చే సౌకర్యాలు కేవలం డబ్బే కాబట్టి అది కనపడదు. ఆయా డిపార్టుమెంటులో అధిక సౌకర్యాలు పొందటం వల్లన ఏర్పడిన డబ్బు లోటుని జనం మీద బాదేస్తారు. పరోక్షంగా సమాజానికి ఆర్ధిక మైన భారం....

బాగానే ఉన్నది, మరి పైన సంఘటనకీ దీనికీ ఏమిటి సంబంధం....???  మరి అన్ని డిపార్టుమెంటులూ వారి పరిధికి తగ్గట్టుగా సౌకర్యాలని ఇస్తుంటే మరి పోలిసు డిపార్టుమెంటు కూడా వారి పరిధికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తే ఏమవుతుందీ...??? మొదలుగా పోలిసు  వాళ్ళ గురించి చెప్పుకొన్నాముగా.... మిగిలిన వారిలాగా వీరు కూడా తమ ఉద్యోగులని కాపాడుకోవటం కానీ, తమ పరిధిలో ఉన్న సౌకర్యాలని పొందటం కానీ చేస్తే..... ఇది సమాజ బధ్రతకు సంబంధించిన తప్పు అవుతుంది..!!! ఈ తప్పు డబ్బుకు సంబంధించినది కాదు కదా.... ఆ తప్పుని వెంటనే సమాజంలో ప్రత్యక్షంగా అందరూ తప్పు పడతారు..... 

మరి వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారని అనుకుంటే,  సమాజంలోని ఏ విభాగం వారికైనా ఒకటే న్యాయం అన్న పద్దతిన అన్ని విభాగాలు ఉన్నట్లైతే ఈ తప్పుని మనం తప్పుగా గుర్తించ వచ్చును. అలా కాకుండా "ఫలానా డిపార్టుమెంటులో ఉండి కూడా ఆ సౌకర్యాలని  పొందలేకపోవటమేమిటి" అని అనుకున్నట్లైతే, ఈ తప్పులని...  తప్పు అనగలిగే హక్కు  వారికి ఎక్కడ ఉన్నది..??? ఉంటే  ఆ హక్కు కేవలం  ఏ సౌకర్యాలు పొందకుండా బ్రతుకుతున్న కోట్లాది సామాన్య ప్రజలకి మాత్రమే ఉంటుంది. కానీ, సామాన్యులు ఏమి చెయ్యగలరు....?   రాజకీయ నాయకులు త్యాగాలు చెయ్యమన్నప్పుడల్లా త్యాగాలు చెయ్యటం తప్ప ..... !!!!!!!! 

ఇదేదో పోలిసులని వెనకేసుకు రావటం కోసమో, లేక తప్పులు చేసిన వారిని సమర్ధించటం కోసమో వ్రాసినది కాదు.  "ఒక తప్పు ప్రత్యక్షంగా కనపడుతుంటే,  అనేక తప్పులు అలవాటుగా మారటం వలన,  అవి క్రమంగా తప్పులుగా కనపడకుండాపోయినాయి".  మిగిలిన వాటికైతే కేవలం సామాన్య జనం మీద డబ్బు భారం మాత్రమే కాబట్టి, మన పిచ్చి ప్రజలు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమే కాబట్టి భరిస్తారు. కానీ, ఈ "సౌకర్యాల తప్పులని" రక్షణకి సంబంధించినవారు అలవాటుగా చేసుకొంటే.... అది సమాజంపై తీవ్రమైన చెడు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది.....

అందువల్లన ఆర్టీసీలో, రైల్వేలో  పని చేసే వారు కూడా టిక్కెట్టు కొనుక్కుని బస్సులూ, రైళ్ళు ఎక్కితే, బాంకుల్లో పనిచేసే వారు కూడా సామాన్యులకి ఇచ్చే వడ్డీ పద్దతిన, రూల్సు ప్రకారమే లోన్లు తీసుకుంటే, ప్రజాప్రతినిధులు కూడా స్వంత వాహనాలలో, కోట్ల రూపాయల ప్రభుత్వ బధ్రత లేకుండా సమాజంలో తిరిగి... తమలో తప్పు చేసిన వారిని తిరిగి రాజకీయాల్లోకి రానీయకుండా ఉండి,  సమాజంలో ఏ వ్యక్తులైనా వారు చేసే పని బట్టి కాకుండా సమాన హోదా కాకపోయినా, కనీసం సమాన  సౌకర్యాలు పొందితే,  రాబోయే సమాజంలోని వారు ఎటువంటి చెడు ప్రభావాలకీ లోను కాకుండా తాము పనిచేసే డిపార్టుమెంటులకి  న్యాయం చేసే అవకాశం  ఉన్నది.  ఏ డిపార్టుమెంటు ఎవరి సొత్తు కాదు. కెవలం  30 ఏళ్ల  ప్రజాసేవకు అందులో చేరామనే స్ప్రహ ఉండే అవకాశం  ఉన్నది .   (((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))
(((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))
(((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))