LOCAL WEATHER

23, మార్చి 2013, శనివారం

కోట్ల రూపాయల వ్యాపారాలుంటే శిక్షించకూడదా...???మొత్తం మీద ముంబాయ్ పేలుళ్ళ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది........ కొన్ని వేల పేజీల హైకోర్టు తీర్పుని పరిశీలించిన మీదట, సుప్రీం నుండీ తుది తీర్పు వచ్చింది... అన్ని వేల పేజీలలో అనేక విషయాలున్నాయి. వేల మంది బాధితుల కన్నీళ్ళు ఉన్నాయి, దేశ భద్రత గురించి ఉన్నది.... కానీ, అవేమీ మాకఖర్లేదు..... దేశం గురించి, దేశ ప్రజల గురించీ మాకఖర్లేదు. మాక్కావాలిసింది ఒక్కటే,  వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒప్పుకున్న సంజయ్ దత్త్‌గారికి   ఐదేళ్ళు జైలు శిక్ష పడింది.... మరి ఆ ఒప్పుకున్న వందల కోట్లవ్యాపారాలు ఎలాగు పాపం.....??  ఇదొక్కటే మాకు కావాలిసింది...!!!

ఇదీ మన "పెద్దమనుషుల" తీరు, ఎంతో "బాధ్యతగల" మీడియా తీరు. వీరందరూ కలసి ఒక ఉద్యమంలాగా గొంతెత్తి అరచి, దేశంలోనే అత్యున్నత స్థానమున్న సుప్రీం కోర్టు తీర్పుని చాలా తెలివిగా వ్యతిరేకిస్తున్నారు. మేము ఆ తీర్పుని గౌరవిస్తున్నాము అంటునే.... అతనిని వదిలెయ్యాలనీ, అతనికి శిక్షని  ఖరారు చెయ్యటం తప్పనే ధ్వనితో సుప్రీం తీర్పునే వీరు ప్రభావితం చేస్తున్నారు....

వీరు చెప్పేది ఏమంటే...సంజయ్ దత్ గారు కోట్లరూపాయల సినిమా వ్యాపార లావాదేవిలలో ఉన్నారు కాబట్టి, ఆయన జైలుకి వెళితే, ఆయనని నమ్ముకున్న వారు నష్టపోతారనీ..., అదీకాక, ఆయన చాలా మంచి వాడనీ చెపుతునారు. ఇవన్నీ ఓక ఎత్తు అయితే మన "రెండువేల రూపాయల పెద్దమనిషి"[లింకు నొక్కండి] ఇంకో మెట్టు పైకెక్కి... ఒక ఆర్టికల్ ప్రకారం అతనికి క్షమా'బిక్షపెట్టవచ్చనీ, అతని తల్లిదండ్రులు చాలా మంచి వారనీ, అదీకాక గాంధీగిరి గురించి దత్త్ గారు సినిమాలో బాగా చూపించారనీ.... కాబట్టి అతనిని వదిలివెయ్యాలనీ కోరారు. 

సరే మిగిలిన వారంటే వారికి న్యాయ వ్యవస్థ పట్ల అంతగా అవగాహన లేకపోవటంవలన, తమ అక్కసు, ఆవేదనని వెళ్ళగక్కారనుకుందాము....నేరస్తులు కూడా తమని తాము అమాయకులుగానూ, తాము చేసింది సరిగ్గానే ఉన్నదనీ నమ్ముతారు.... అలా నమ్మటం వల్లనే కదా వారు నేరాన్ని చేసేది...  కానీ, మన రెండువేల రూపాయల పెద్ద మనిషిగారు, తాను న్యాయ వ్యవస్థకి చెందిన వాడైయుండీ, న్యాయ వ్యవస్థ గురించి తెలిసి కూడా న్యాయవ్యవస్థ పట్ల విధేయతని చూపించకపోవటం ఆయన విజ్ఞత ఏమిటో తెలుస్తోంది. పైగా దానిలో ఉన్న లూప్‌హోల్స్ ఆర్టికల్స్‌ని బయటవారికి తెలియచెప్పటం ఎంతవరకూ సమంజసం...??? ఒకప్పుడు దేశ వాసులందరినీ తిట్టిన ఈ పెద్దమనిషికి[లింకు నొక్కండి], సంజయ్ దత్ గారి మీద ఇంత ప్రేమెందుకో ఆయనకే తెలియాలి. 

పైన మన "10 శాతం మేధావులు" కోరిక ప్రకారం 
మన సుప్రీం కోర్టు సంజయ్ దత్‌కి శిక్షని మాఫీ చేస్తే...
మరి దాని అర్ధ ఏమని వొస్తుందో
మన మీడియా మేధావులకి కానీ,
దేశంలో కల్లా "ఏకైక పెద్దమనిషి" గారికి గానీ
పూర్తీ న్యాయవ్యవస్థ మీద అవగాహన ఉండి, 
తెలిసే సుప్రీం కోర్టు మీద ఒత్తిడి తెస్తున్నారా...??? 

వారి కోరికకి అర్ధం ఇదేనా...

"మీరు ఏ నేరమైనా చెయ్యండి,
కానీ,
దానికి కావాలిసిన అర్హత
మీరు కోట్ల రూపాయల వ్యాపారాలలో ఉండవలసి ఉంటుంది.
ఒక వేళ మీరు కానీ జైలుకి వెళితే,
అనేక మంది మీ ఖాతాదారులకి
కోట్లలో నష్టం వస్తుందని నిరూపించాలి.
అలా కోట్లలో నష్టం వచ్చే విధంగా
మీరు అనేక వ్యాపార లావాదేవీలలో బాగా ఇన్వాల్వు అయి ఉండాలి...
అంతే...
ఇక మీరు ఏ నేరం చేసినా పరవాలేదు... 
జైలుకి వెళ్ళ వలసిన పనిలేదు.
 హాయిగా మీ పనులు మీరు చేస్కుంటూ
 జైలు శిక్షా కాలం పూర్తి చెయ్యవచ్చును. 
లేదా
ఆ జైలు శిక్షనే రద్దుచేయించుకోవచ్చును.
దీనికి కావాలిసిందల్లా మాంచి లాయరూ,
వెనుక ఫ్యాన్సూ,
సమాజంలో పెద్దమనుషులతో సంబంధాలు ఉంటే చాలు.
మరచిపోయ్యాను...
ఈ స్వంత సోదంతా
ప్రజలందరికీ చాలా దీన గాధలాగా ప్రచారం చెయ్యటానికి
చక్క భజన చేసే మీడియా వాళ్ళతో చక్కటి సంబంధాలు ఉండాలి ...
మహా అయితే...
లాయరుకు గానీ, "మరేదైనా దానికి" గానీ
కొంత ఖరుచు అవుతుంది...అంతే...
ఆ ఖర్చు పెట్టగల సత్తా ఉంటే చాలు
ఎటువంటి నేరానికి సంబంధించిన శిక్ష నుండైనా
తప్పించుకోవచ్చును.
లేదా
ఎటువంటి నేరమైనా చెయ్యవచ్చును.
ఇదీ అర్ధం...
మన మీడియా వారు  కానీ,
పెద్దమనుషులు అనుకుంటున్న వారు కానీ,
సుప్రీం కోర్టు మీద వత్తిడితో అడిగి,
అల్లరి చేస్తున్న దానికి"...!!!

కాబట్టి, ఓ 10 శాతం ప్రజలారా.... మీకు బాధ కలిగితే కలగవచ్చును; ఎటువంటి నేరస్తుడికైనా, అతని స్వంత దారులు ఉంటారు. ఆ నేరస్తుడికి శిక్ష పడినప్పుడు వారికి బాధ కలుగుతుంది. అప్పుడు వారు కన్నీళ్ళతో తమ వాడి తప్పుని క్షమించమని అడగవచ్చును..... కానీ మీడియా వారికి కానీ, పెద్దమనిషిగారికి కానీ సంజయ్ దత్ గారితో ఏమి సంబంధం ఉన్నదని ఒకపూటతో కాకుండా, అదే పనిగా ఏదో ఉద్యమంలాగా గోల చేస్తున్నారు..... కాబట్టి, ఈ విషయాన్ని సుప్రీం కోర్టువారు తీవ్రంగా పరిగణించి, వీరి నోరు మూయించి, అసలు...  దత్ గారితో వీరికి ఉన్న  ఈ సంబంధాల వ్యవహారాలపై  విచారణ చేస్తే, సామాన్యులకి న్యాయం మీద  అనుమానం లేకుండాపోతుంది. లేకపోతే, డబ్బుతో పనున్నవారికోన్యాయం,  డబ్బు లేని వారికొక న్యాయం అనే సందేశాన్ని సామాన్య ప్రజలలోకి పంపించినట్లు అవుతుంది....!!!!  

వీరికి తోడు,  ఇటలీ వారు తమ ఇద్దరు నేరస్తులనీ మన దేశానికి పంపించటానికి ఒప్పుకుంటూనే, వారికి మరణ శిక్షని విధించకూడదూ అంటూ అనేక నిబంధనలని పెట్టింది. విచారణ చేసిన తరవాత వచ్చే తీర్పుని ముందే ఎలా ప్రభావితం చెయ్యగలరో ఆ యూరప్పు వారికే తెలియాలి. మరి యురప్పు కోర్టుల్లో కూడా తీర్పుకి ముందరే ఒక నిర్ణయానికి వచ్చేసి, తరవాత తీర్పు చెపుతారా....??? ఏదైతేనే, మొత్తానికి భారత సుప్రీంకోర్టు  తన కఠిన వైఖరి ద్వారా ఇటలీ దేశ మెడలు వంచినందుకు అభినందించాలిసిందే....

అలాగే, కొందరు స్వంత దేశ పెద్దలనీ, మీడియానీ కూడా తన కఠిన వైఖరితో,  సుప్రీంకోర్టు అంటే భక్తితో పాటూ భయాన్ని కూడా కల్పిస్తే మంచిది. లేకపోతే, వీరు "డబ్బున్న నేరస్థుల సానుభూతి  ప్రచార సాధనాలుగా" మారే ప్రమాదమున్నది....!!!   @@@@@@ 
@@@@@@ 


ఇందులోని బొమ్మ గూగుల్ లోనిదే 

తెలుగు అక్షరమాల