LOCAL WEATHER

8, మార్చి 2013, శుక్రవారం

పోలిసులు వెదికేది "బీదర్ ఇసుక" కోసమా...!!!


మొన్న హైదరబాదు పేలుళ్ళ సందర్భంగా భద్రతని కట్టుదిట్టం చేశాము, అన్ని చోట్లా "ఎర్ర ఎలర్టు" చేస్తున్నాము అంటున్న పోలీసులు చేసేది చూస్తుంటే.... ఒక సినిమాలో ఆలి నటించిన హాస్య సన్నివేశం గుర్తుకొస్తోంది... 

ఆ సినిమాలో, ఆలి బండి మీద ఇసుక మూటని తీసుకొస్తుంటే, చెక్ పొస్టు దగ్గర ఒక మహా తెలివిగల పోలిసు ఆఫిసరు ఆపుతాడు... ఏం పనిమీద వెళుతున్నావు అంటే; బీదర్‌లో ఇసుక చల్లటానికి  అని ఇసుక మూటని చూపిస్తాడు. ఆయన ఆ ఇసుక మూటని అనుమానంతో వెతికించి పంపేస్తాడు. అలా చాలా సార్లే ఇసుక మూటతో కనిపిస్తాడు ఆలి. కొన్నాళ్ళ తరవాత, అక్కడి పోలీసు ఆఫీసరు ట్రన్స్‌ఫెర్ అయి వేరేచోట కనపడి, ఆలీని అడుగుతాడు... ఇంతకీ బీదర్ ఇసుక రహస్యం ఏమిటని.. దానికి ఆలీ నవ్వుతూ... నేను ఇసుక చల్లే పని  కాదు, దొంగతనం చేసిన వాహనాలు అమ్ముతున్నాను అనేసరికి, తన తెలివి ఇసుక మూట దగ్గరే ఆగిపోయిందని తెలుసుకుంటాడు. 

ఇడియట్ సినిమా నుండి "ఇసుక"  క్లైమాక్స్ సన్నివేశం 

సేం టూ సేం....   మన పోలిసులు కూడా అలానే చేస్తున్నట్లుగా కనపడుతున్నది.... ఎందుకంటే ఫలాన చోట వెతుకులాటలో లక్షలు కనపడినాయనీ, మరో చోట బంగారం కనపడిందనీ, మరో వెతుకులాటలో మరిన్ని లక్షల రూపాయలు కనపడినాయని టీవీలలో వార్తలు వస్తున్నాయి. సరే బాగానే ఉన్నది. సమాజం అన్న తరవాత ఆర్ధిక లావాదేవీలు ఉండనే ఉంటాయి.  వాటిల్లో తప్పులుంటే పట్టుకోటానికి వేరే శాఖలు ఉన్నాయి కదా.... [వీరే చెయ్యాలిసి వస్తే  దానికి  ఇది సమయం కాదు]    ఇంతకీ మన పోలీసులు వెతికేది బాంబులూ, టెర్రరిస్టుల గురించా లేక డబ్బులూ, నగల గురించా అనేది అసలు విషయం....!!!

ఈ విధమైన పద్ధతిలో వెతికితే, ఆలీ లాగా ఉగ్రవాదులు చాలా చక్కగా పోలీసులని బురిడీ కొట్టించ వచ్చును. లక్షలు రూపాయలు ఎర పెట్టి,  బాంబులు తీసుకు వెళ్ళవచ్చును.  లేకపోతే, బంగారం తీసుకెళుతూన్నట్లుగా కనపడి, టెర్రరిస్టు మూకలని తీసుకు రావచ్చును...తీసుకు పోవచ్చును. 

ఇలా పోలీసులు కనుక డబ్బులు, నగలు యావలో పడితే,  అసలు ఉగ్రవాదులు తప్పించుకొనే అవకాశం ఉన్నది.  అలాగే,  ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి కదా... అందుకని, సాధారణ పౌరులు కూడా...  లేనిపోనిది పోలీసులతో మనకి ఎందుకు....  అనుకొని,  ఉగ్రవాదుల కదలికల గురించి చెప్పేందుకు కూడా ఆసక్తి చూపరు.    

కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితిలో అయినా,  లక్షల రూపాయల మీద, బంగారం మీద దృష్టి పెట్టేకన్నా, అంతకన్న ఎక్కువ విలువైన  మనుషుల ప్రాణాలని లెక్కలోనికి తీసుకొని, అసలు పని నుండి డైవర్టు కాకుండా....  టెర్రరిస్టు కార్యకలాపాలని నియంత్రిస్తే బాగుంటుంది. మిగిలినవి వెతకటానికి వేరే అనేక డిపార్టుమెంటులూ ఉన్నాయి కదా.... వేటి పని అవి చేస్తే బాగుంటుంది.  లేకపోతే "బీదర్ ఇసుక" లాగానే, సిటీల లోనికి  ప్రమాదకరమైన వ్యక్తులూ, వస్తువులూ చేరే అవకాశం ఉన్నది....... 


తస్మాత్ జాగ్రత్త. 
  


{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}


కర్టేసి యుట్యుబ్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి